మూడు ముచ్చెమటలు పట్టిస్తున్నాయిగా?

మరోసారి కర్ణాటకలో ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఇటు యడ్యూరప్పకు, అటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఈ [more]

Update: 2021-04-10 18:29 GMT

మరోసారి కర్ణాటకలో ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఇటు యడ్యూరప్పకు, అటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో మూడు ఎన్నికలు రెండు పార్టీల అధినేతలకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి.

మూడు స్థానాలకు ఉప ఎన్నికలు…..

కర్ణాటకలో బెళగావి లోక్ సభ నియోజకవర్గం, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటముల మీద రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. జనతాదళ్ ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో త్రిముఖ పోటీ జరగనుంది. సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక స్థానాలను గెలుచుకుంది.

యడ్యూరప్పపై అసంతృప్తి…..

అయితే ఇప్పుడు యడ్యూరప్పపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. సొంత పార్టీ నేతలే యడ్యూరప్ప వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. బెళగావిలో సంప్రదాయంగానే మృతి చెందిన సురేష్ అంగాడీ సతీమణికి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇక బసవకల్యాణ టిక్కెట్ ను తన కుమారుడికి ఇప్పించుకోవాలని యడ్యూరప్ప ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో కొన్ని చోట్ల యడ్యూరప్ప వర్గమే పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

రాసలీలల సీడీ వ్యవహారం….

మరోవైపు రాసలీలల సీడీతో అడ్డంగా దొరికిపోయిన రమేష్ జార్ఖిహోళి ఉదంతం కూడా అధికార పార్టీకి ఈ ఎన్నికల్లో ఇబ్బందిగా మారింది. అయితే ఈ సీడీ వెనక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉన్నారంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని బీజేపీ శ్రేణులు చేస్తున్నాయి. డీకే శివకుమార్ కు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇటు అసంతృప్తి, అటు రాసలీలల సీడీ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ యడ్యూరప్పలో స్పష్టంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News