నిలువెత్తు నిర్లక్ష్యం… తప్పెవరిది ?

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్. దీన్ని టచ్ చేస్తే ఏమి జరుగుతుందో తెలిసే ఏ పాలకులు కబుర్లే తప్ప కార్యాచరణలోకి దిగేవారు కాదు. లక్షమందికి పైగా నిర్వాసితులు [more]

Update: 2021-08-04 03:30 GMT

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్. దీన్ని టచ్ చేస్తే ఏమి జరుగుతుందో తెలిసే ఏ పాలకులు కబుర్లే తప్ప కార్యాచరణలోకి దిగేవారు కాదు. లక్షమందికి పైగా నిర్వాసితులు కావడం సుమారు 300 లలోపు గ్రామాలు నీట మునిగిపోవడం, వేల హెక్టార్లలో అడవి కనుమరుగు కావడం ఇలా అనేక నష్టాలు, కష్టాలు ఈ బృహుత్తర ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కించకపోవడానికి ప్రధాన కారణం. దీనికి తోడు వేలకోట్ల రూపాయల నిధుల సమీకరణ అంత ఈజీ కాదు. పోనీ ఇవన్నీ పూర్తి అయితే పర్యావరణ అనుమతులతో పాటు అనేకరకాల పర్మిషన్స్ అంత సులువు కాదు. ఇన్ని సమస్యలు ఉన్నా దివంగత రాజశేఖర రెడ్డి ధైర్యమే ఆయుధంగా పోలవరానికి ముందడుగు వేసి చరిత్రలో నిలిచారు 2005 లో. ప్రాజెక్ట్ కి అవసరమైన అనుమతులు ఏమి లేకపోయినా ముందుగా కాల్వలు తవ్వించే పని మొదలు పెట్టి కేంద్రం లో యుపిఎ అధికారంలో ఉండటంతో ఒక్కో అనుమతి సాధిస్తూ సాగిపోయారు.

ఆర్ ఆర్ ప్యాకేజ్ అదుర్స్ …

వేలమంది ని నిరాశ్రయులను చేసే పోలవరం ప్రాజెక్ట్ కి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పునరావాస ప్యాకేజీ ని రూపొందించారు వైఎస్ఆర్. పటిష్టమైన ఇంటి నిర్మాణం భూమిని కోల్పోయే వారికి భూమి, నష్టపరిహారం ఇలా అన్ని రకాల వారిని ఆదుకునే ప్యాకేజ్ ప్రకటించి సాక్షాత్తు నాడు మేధాపాట్కర్ వంటి ఉద్యమ కారిణి ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్. ఇలాంటి ప్యాకేజ్ ప్రభుత్వాలు నిర్వాసితులకు ఇస్తే తనలాంటి వారు పోరాటాలు చేయాలిసిన అవసరమే లేదని నాడు మేధాపాట్కర్ వ్యాఖ్యానించారంటే వైఎస్ విజన్ పేదలపట్ల ఎలా ఉండదన్నది చెప్పనవసరం లేదు. వైఎస్ ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో ఎలాంటి ఆందోళన లేకుండా పోయింది. మాటిస్తే ఆయన తప్పే రకం కాకపోవడంతో వారు ప్రశాంతంగానే ఉన్నారు.

దశాబ్దన్నర కాలం అవుతున్నా …?

పోలవరం ప్రాజెక్ట్ మొదలు పెట్టి దశాబ్దంన్నర కు పైగానే గడుస్తుంది. ప్రాజెక్ట్ కు అనుమతులు, నిధులు ఇతర సమస్యలు ఎలా ఉన్నా నిర్వాసితుల కు సంబంధించి కాలనీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన అంశంలో వైఎస్ మరణం తరువాత ఏ ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకోలేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, విభజన జరిగాక చంద్రబాబు నాయుడు పనిచేశారు. వీరంతా రాజకీయాలకే సమయాన్ని వెచ్చించారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఏదో ఒక రోజు పూర్తి అవుతుందని దీనికోసం తమ జీవితాలను ఫణంగా పెట్టిన గిరిజనులు, ఇతర రైతాంగం కోసం చిన్న ఆలోచన కూడా చేయలేదు.

ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నా …

విభజన కు ముందు పోలవరం ప్రాజెక్ట్ కు యుపిఎ ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించింది . దాని చట్టంలో చేర్చడంతో ఇక అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎపి వాసులు సంబరపడ్డారు. ఇది కూడా ఆవిరైపోయింది ఆ తరువాత. దాదాపు మూడేళ్లపాటు చంద్రబాబు సర్కార్ పోలవరం పనులు ప్రారంభమే చేయలేదు. నిర్మాణం తాము చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వంపై లాబీయింగ్ చేయడానికే సమయాన్ని వెచ్చించింది. కాలువలకు భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం అంశంలో టిడిపి పై అనేక ఆరోపణలు చుట్టుముట్టాయి. పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తి చేశామని పదేపదే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా అంతశాతం నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపి ఉంటె ఈపాటికి సముద్రంలో వృధాగా పోతున్న నీరును నిలిపేందుకు అవకాశం ఉండేది.

ప్రాజెక్ట్ పూర్తి చేసినా చుక్క నీరు ఆపలేరు …

కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి దాదాపుగా అయినా నీరు నిలపడానికి ఛాన్స్ లేకుండా పోయింది. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా నీటిని నిల్వ చేయడానికి ఏ చట్టం అంగీకరించే పరిస్థితి లేదు. దాంతో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శనిలా పోలవరం ప్రాజెక్ట్ మారే అవకాశం ఉంది. మరోపక్క వరదలు సీజన్ కావడంతో గిరిజనం బతుకు గోదావరి గా మారింది. వారు తట్టాబుట్టా పట్టుకుని పిల్లా జెల్లలతో లబోదిబోమని ఘోషిస్తూ కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. ఈ పాపం ఎవరిదీ ? అంటే గత పాలకులు ఒకరిపై ఒకరు చేతులు చూపుకునే పరిస్థితే ఉంది. అయితే దీనిలో తిలాపాపం తలాపిడికెడు అనే చెప్పాలి. ఇప్పటికైనా ఎపి సిఎం వైఎస్ జగన్ పోలవరం నిర్వాసితుల కు అండగా నిలిచేందుకు ముందుకు రావడంతో ఇది ఆచరణలో అమలైతే వారికి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశించాలి.

Tags:    

Similar News