ఎమ్మెల్యే ఎవరైనా….? ఇక్కడ మాత్రం వారిదే పెత్తనం

ఏమిటో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను తన పని తాము చేసుకోనివ్వరు. అంతా తమ ఇష్టప్రకారమే జరగాలంటారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఇలా ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వనీ ఆ [more]

Update: 2020-10-02 14:30 GMT

ఏమిటో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను తన పని తాము చేసుకోనివ్వరు. అంతా తమ ఇష్టప్రకారమే జరగాలంటారు. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఇలా ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వనీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నామమాత్రమేనని చెప్పాలి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇది భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలకు నోరు ఉండకూడదు. తమను కాదని పనులు చేయకూడదు. ఇలాంటి ఆంక్షల మధ్య ఉన్న ఆ నియోజకవర్గం పాయకరావుపేట.

గత ఐదేళ్ల పాటు……

2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో వంగలపూడి అనిత టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. కానీ అనితను పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పంపించేంత వరకూ అక్కడి టీడీపీ నేతలు నిద్రపోలేదు. అక్కడి టీడీపీ నేతలు గ్రూపుగా ఏర్పడి అనితకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. చివరకు ఆమెకు టిక్కెట్ ఇస్తే ఒప్పుకోమని కూడా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. చివరకు టీడీపీ అధిష్టానం వారికి భయపడి పాయకరావుపేట నుంచి ఆమెను కొవ్వూరుకు పంపాల్సి వచ్చింది.

మొన్నటి ఎన్నికల్లో…..

ఇక 2019 ఎన్నికల్లో పాయకరావు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా గొల్ల బాబూరావు పోటీ చేసి గెలుపొందారు. గొల్ల బాబూరావు సీనియర్ నేత. పాయకరావుపేటకు కొత్తేమీ కాదు. 2009లో గొల్ల బాబూరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి నెగ్గారు. 2014 ఎన్నికల్లో గొల్ల బాబూరావుకు వైసీపీ టిక్కెట్ దక్కలేదు. ఆయనను అమలాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయించింది. అయితే 2019 ఎన్నికల్లో గొల్ల బాబూరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తిరిగి గెలుపొందారు.

పెత్తనమంతా వారిదే…..

పాయకరావుపేటతో సుదీర్ఘ అనుబంధం ఉన్నా ఆయనను వైసీపీ నేతలు పనిచేయనివ్వడం లేదు. ఎక్కడికక్కడ కండిషన్లు పెడుతున్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గమైన పాయకరావుపేటలో అగ్రకులాలకు చెందిన నేతలదే పెత్తనం. దీంతో విసిగిపోయిన గొల్ల బాబూరావు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఎవరైనా పాయకరావుపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అగ్రవర్ణాల నేతలు పెత్తనం చేస్తున్నారు. వీరిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధిష్టానంపై ఉంది. లేకుంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా లేనట్లే?

Tags:    

Similar News