ఎన్టీఆర్ కి వెన్నుపోటు విధి వైపరీత్యమా ?

ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయనను కారణ జన్ముడు, రణ జన్ముడు అంటూ ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి కొనియాడారు. అది నిజమే అనిపించేలా ఆయన జీవిత చరిత్ర [more]

Update: 2020-06-12 15:30 GMT

ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయనను కారణ జన్ముడు, రణ జన్ముడు అంటూ ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి కొనియాడారు. అది నిజమే అనిపించేలా ఆయన జీవిత చరిత్ర ఉంటుంది. ఎన్టీఆర్ సినీ రంగంలో అగ్ర స్థానానికి చేరుకున్న వైనం చూసినా.. అలాగే రాజకీయాల్లో ఎందరో ఉద్ధండులను కాదని కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చూసినా కూడా ఆయన కారణ జన్ముడే అనిపిస్తుంది. ఇక జాతీయ స్థాయిలో ఎంతో పేరుండి, సుదీర్ఘ అనుభవం కలిగిన ఎందరో మహా నేతలు అన్నగారి వెంట తిరగడం చూసినా ఆయన సామాన్యుడు కాదు అనిపిస్తుంది. అటువంటి ఎన్టీఆర్ విధి చేతిలో బందీ అయి వెన్నుపోటుకు గురి అయ్యారా. ఎంత విధిని నమ్మినా కూడా ఎన్టీఆర్ కి రెండుసార్లు జరిగిన వెన్నుపోట్లు చూస్తే అందులో మానవతప్పిదం, కుట్ర అన్నవి ఉండకుండా పోతాయా అన్న సందేహాలు వస్తాయి.

నాడు అలా …..

ఎన్టీఆర్ మీద 1984 ఆగస్టులో తొలిసారి వెన్నుపోటు జరిగింది. ఆయన పార్టీలో, ప్రభుత్వంలో కో పైలెట్ గా ఉన్న నాదెండ్ల భాస్కరరావు నాడు వెన్నుపోటు పొడిచారు. మరి దాన్ని సినిమాగా తీసి ఎన్టీఆర్ ని హీరోగా, నాదెండ్లను విలన్ గా చూపించిన ఆయన తనయుడు, సినీ వారసుడు బాలక్రిష్ణ 1995లో రెండవమారు జరిగిన వెన్నుపోటును మాత్రం అది విధిరాత అంటూ కొట్టిపారేయడం రాజకీయ తెలివిడిగానే చూడాలేమో. తన బావ చంద్రబాబుతో పాటు మరో బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమార్తెలు, కుమారులు అంతా కలసి అన్న గారి మీద తిరుగుబాటు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఆయన నుంచి లాక్కున్నారు. ఇది పాతికేళ్ళ క్రితం జరిగిన రాజకీయ ఘాతుకం. దాన్ని తెలుగు సమాజమే కాదు, యావత్తు భారతం నాడు కళ్ళారా చూసింది. అటువంటి దాన్ని బాలయ్య విధిరాత అందుకే అలా జరిగింది అంటూ ఇన్నేళ్ళ తరువాత తేలిగ్గా తీసేస్తున్నారు.

బావ మంచోడేనేగా?

నాడు అన్న గారిని దించడంతో అందరి పాత్ర ఉందని బాలయ్య ఒప్పుకోవడం మాత్రం హర్షించతగినదే. ఇందులో చంద్రబాబు ఒక్కరే లేరని, అంతా కలసే చేశామని, అయినా అదంతా విధి నడిపించిన వింత‌ నాటకమని తాజాగా ఆయన 60వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలలో చెప్పుకొచ్చారు. అంటే మామకు బాబు వెన్నుపోటు పొడిచాడు అంటూ ఈ పాతికేళ్ళలో కాకుల్లా విపక్షం పొడిచిన దానికి బాలయ్య మార్క్ సమాధానం అన్న మాట. మా బావ మంచివాడు. ఆయనకు ఏమీ తెలియదు అంటూ బాలయ్య కవరింగు ఇచ్చారనుకోవాలి. ఇక వెన్నుపోట్లు పక్క పోట్లూ ఇవేమీ తమకు తెలియని పదాలంటూ మొత్తం దారుణమైన 1995 ఆగస్ట్ ఎపిసోడ్ ని ఒక్క మాటతో బాలయ్య లైట్ గా తీసి పారేయడం విశేషమే. దీన్ని బట్టి చూస్తూంటే బాలయ్య రాజకీయంగా లౌక్యం కొంత అయినా సంపాదించారనుకోవాలి.

ఒప్పు ఎలా…?

అయిన వారు చేస్తే విధిరాత అని బాలయ్య లాంటి వారు అంటారు. అది ప్రజాస్వామ్య పరిరక్షణ అని అందమైన పడిగట్టు పదాలు చంద్రబాబు వాడతారు. అదే పని నాదెండ్ల భాస్కరరావు చేస్తే మాత్రం వెన్నుపోటు అంటారు. ఆయన్ని విలన్ గా చూపిస్తారు. అసలు సూత్రధారి అంటూ ఇందిరాగాంధీని సైతం దూషించేదాకా వెళ్తారు. అంటే మనకో న్యాయం, ఇతరులకు మరోలానా. ఎన్టీఆర్ విషయంలో ఎన్ని చెప్పుకున్నా సొంత కుటుంబం అంతా ఏకమై ఒంటరిని చేసి వేధించడం మాత్రం చరిత్రలో నిలిచిపోయే విషాద అధ్యాయంగానే చరిత్రకారులూ, రాజకీయ పండితులు, మేధావులు చూస్తారు. విధిరాతలు రాజకీయాల్లో ఉండవు. మనుషులు రాసిన రాతలే ఉంటాయి. బాలయ్య నటుడు కాబట్టి మంచి మాటలతో నాటి వెన్నుపోటు ఎపిసోడ్ ని లైట్ తీస్కోమన్నా కూడా నాటి జనం తమ కళ్ళతో చూశారు. ఇప్పటి జనం చరిత్రలోకి వెళ్ళి మరీ శోధిస్తారు. వారికంటూ సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.

Tags:    

Similar News