ఎన్టీఆర్ బయోపిక్: మహానాయకుడు మూవీ రివ్యూ

ఎన్టీఆర్ బయోపిక్: మహానాయకుడు బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్, వెన్నెల [more]

Update: 2019-02-22 03:59 GMT

ఎన్టీఆర్ బయోపిక్: మహానాయకుడు
బ్యానర్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, సచిన్ ఖేడేకర్, కళ్యాణ్ రామ్, వెన్నెల కిషోర్, సూర్య శ్రీనివాస్, మంజిమ మోహన్, హిమన్షి చౌదరి, మాస్టర్ ఆర్యవీర్,శ్రీ తేజ ,అప్రియ వినోద్, మిర్చి మాధవి తదితరులు
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా సినిమాలను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 9 సంక్రాతి కానుకగా ప్రేక్షకులముందుకు వచ్చింది. కథానాయకుడు సినిమాకి పాజిటివ్ టాక్ రావడమే కాదు.. సినిమా విశ్లేషకుల సైతం.. కథానాయకుడు సినిమాని తెగ పొగిడారు. ఎన్టీఆర్ నట జీవితాన్ని అద్భుతంగా క్రిష్ చిత్రీకరించాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ గా సూపర్ గా నటించాడని అన్నారు. నిజంగానే కథానాయకుడు సినిమా చాలా బావుంది. కానీ అనూహ్యంగా కథానాయకుడు సినిమా ప్రేక్షకులనుండి త్రిరస్కరణకు గురైంది. కంటెంట్ బావున్నా… సినిమాలో సంబందించిన ఎమోషన్, కామెడీ, కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడంతో కథానాయకుడు సినిమా కలెక్షన్స్ పరంగా భారీ డిజాస్టర్ అయ్యింది. కథానాయకుడు కొన్న బయ్యర్లు ఘొల్లుమన్నారు. ఇక కథానాయకుడు వచ్చిన నెలకే మహానాయకుడు కూడా విడుదల చేస్తామని చెప్పిన క్రిష్, బాలకృష్ణ లు సైలెంట్ గా మహానాయకుడు సినిమా ని రీ షూట్స్ చేసి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి నేడు ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మహానాయకుడు సినిమా మొత్తం ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం, ఆయన సీఎం ఎలా అయ్యాడు. అలాగే తాను రాజకీయాల్లో ఎంతో నమ్మిన వ్యక్తి ద్వారా ఎలా మోసపోయాడు. అలాగే కుటుంబ సమస్యలు, ఇంకా భార్య మరణం లాంటి సంఘటనలతో మహానాయకుడు సినిమాని క్రిష్ – బాలయ్యలు తెరమీదకి తెచ్చారు. ఎన్టీఆర్ మహానాయకుడుగా రాజకీయాల్లో ఎదిగినతీరు, పడిన సమస్యలు, భార్య బసవతారకం క్యాన్సర్ బారిన పడి… వైద్యం చేయించినా… మరణించడం వంటి ఎమోషనల్ అంశాలతో మహానాయకుడు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేశారు. కథానాయకుడులో మిస్ అయిన ఎమోషనల్ అంశాలను దర్శకుడు క్రిష్ మహానాయకుడిలో టచ్ చేసాడు. కావాల్సిన మసాలా లేకపోవడంతో…కథానాయకుడుని ఘోరంగా తిరస్కరించిన ప్రేక్షకులు… అన్ని కలగలిపిన మహానాయకుడిని ఏ మాత్రం ఆదరిస్తారో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
ఎన్టీఆర్ (బాలకృష్ణ) సినిమాల్లో ఉండగానే ఆయన దృష్టి రాజకీయాల మీదకి మళ్లుతుంది. అలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం… తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ క‌థానాయ‌కుడు సినిమా ముగిసింది. ఇక అలా రాజకీయరంగేట్రం చేసిన ఎన్టీఆర్ కేవలం తొమ్మిదినెలల లోపే తెలుగు దేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి.. అధికారంలోకి రావడం అనేది గర్వించదగిన విషయం. ఇక తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సంక్షేమమే తన పథకాలు అంటూ జనాల్లోకి వెళ్లిపోతాడు. తెలుగు దేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఢిల్లీ గద్దెను సైతం గడగడలాడించి.. తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నిలబెడతాడు. అయితే రాజకీయాల్లో ఊపిరిసలపనంతా బిజీగా వున్నా టైం లోనే ఎన్టీఆర్ భార్య బసవతారకం(విద్య బాలన్) అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లడంతో…. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న నాదెండ్ల భాస్కరరావు (సచిన్ ఖేడేకర్) వెన్నుపోటు రాజకీయాలతో ఎన్టీఆర్ ను సీఎం కుర్చీ నుండి దించేస్తాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ ఎలాంటి ఎత్తులు వేసి సీఎం కుర్చీని దక్కించుకున్నాడు? రాజకీయ కుట్రల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? రాజకీయాలతో పాటుగా కుటుంబాన్ని ఎన్టీఆర్ ఏ విధంగా చూసుకున్నాడు? వాటిలో చంద్రబాబు పాత్ర ఎంత? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఎలా నినదించాడు? అప్ప‌టి ఇందిరాగాంధీ నిరంకుశ‌త్వానికి ఎలా స‌మాధానం చెప్పగలిగాడు? అనేదే మహానాయకుడు మిగతా కథ.

నటీనటులు:
కథానాయకుడు లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. కృష్ణుడి గెటప్ లో బాలయ్య ని చూసిన వాళ్ళు మల్లీ ఎన్టీఆర్ ని చూస్తున్నామా అనే భావన కలిగింది. మరి ఎన్టీఆర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ ఒదిగిపోయిన తీరుని మనం క‌థానాయకుడులో చూశాం. మరి కథానాయకుడు కి కొనసాగింపు ఈ మహానాయకుడు. మరి నటన నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ గా మ‌రోసారి బాల‌కృష్ణ త‌న వంతు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వచ్చే పాత్ర కావడంతో తండ్రి పోలికలతో బాలకృష్ణ అదరగొట్టాడు. ఫేస్ ఎక్సప్రెషన్స్ లో కానివ్వండి… డైలాగ్స్ చెప్పే విధానంలోనూ బాలయ్య సూపర్బ్ నటన కనబర్చాడు. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా బాలయ్య పాత్ర‌లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. రెండు చోట్లా.. బాలకృష్ణ రెండు ర‌కాలుగాను 100 శాతం మెప్పించాడు. ఇక బసవతారకం పాత్రధారిగా కథానాయకుడులో అందరికన్నా ఎక్కువ మార్కులు కొట్టేసిన విద్యాబాల‌న్…. మహానాయకుడు సినిమాలోనూ ఆమె పాత్ర మొత్తం భావోద్వేగాల భ‌రితంగా సాగింది. విద్య న‌ట‌న బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తెచ్చింది. నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో సచిన్ ఖేడ్కర్ నటన అద్భుతం. మహానాయకుడు కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే టర్న్ అవుతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్టీఆర్‌ని పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచిన పాత్రలో సచిన్ ఖేడ్కర్ జీవించారు. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. చంద్ర‌బాబు పాత్ర‌లో ప్రాణం పెట్టి న‌టించాడు. కొన్ని ప‌దాల్ని చంద్ర‌బాబు ఎలా ప‌లుకుతారో మ‌నంద‌రికీ తెలుసు. రానా కూడా అదే విధానంతో ముందుకు పోయాడు. కథానాయకుడులో ఎన్టీఆర్ – ఏఎన్నార్ కలయిక సన్నివేశాలను బాగా హైలెట్ చేస్తే… మహానాయకుడులో మాత్రం ఏఎన్నార్‌ పాత్ర లో నటించిన సుమంత్‌ని ఒకే ఒక్క స‌న్నివేశానికి ప‌రిమితం చేశారు. హరికృష్ణ పాత్రధారి క‌ల్యాణ్ రామ్ కూడా అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తాడంతే. వెన్నెల కిషోర్, భరత్.. ఇలా మిగతా నటీనటులు తమ శక్తిమేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
కీరవాణి అందించిన నేపధ్య సంగీతం మహానాయకుడుకి ప్రాణం పోసింది. నేపధ్య సంగీతం ఆయువు పట్టు అనేలా అద్భుతంగా కుదిరింది. ఇక బ్యగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు కీరవాణి అందించిన పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. బొర్రా సాయి మాధవ్ రాసిన సంభాషణలు కథకు హెల్ప్ అయ్యాయి. ఆసుప‌త్రి ఎపిసోడ్ లో బుర్రా సాయిమాధ‌వ్ క‌లం మ‌రింత ప‌దునుగా ప‌లికింది. అతిశయోక్తులు లేకుండా కథానుగుణంగా సాయి మాధవ్ రాసిన మాటలు బాగా పేలాయి. రెండు మూడు డైలాగ్స్ థియేటర్స్ లో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. నిశబ్దాన్ని చేతగాని తనం అనుకోవద్దు.. మౌనం మారణాయుధంతో సమానం అని మరిచిపోవద్దు, నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను లాంటి డైలాగ్స్‌కి క్లాప్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. బహిరంగ సభలు.. క్రౌడ్ షాట్స్ చాలా రిచ్‌గా అందంగా చూపించాడు. ఇక ఈ సినిమాకు నిడివి రెండుగంటలే కావడంతో…. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు. ఎడిట‌ర్ ఈ సారి సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ గా ప‌ని చేసాడు అనే చెప్పాలి. ఇక టెక్నికల్ పరంగా ఎన్‌బీకే బ్యానర్‌లో మహానాయకుడుకి బాలయ్య అండ్ బ్యాచ్ మంచి క్వాలిటీ ఉన్న నిర్మాణ విలువలు అందించింది.

విశ్లేషణ:
ఎన్టీఆర్ జీవిత చరిత్ర అనగానే… ఎన్టీఆర్ నట, రాజకీయజీవితాలను ఏ విధంగా తెర మీద చూపిస్తారో…. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, వెన్నుపోటు రాజకీయాలతో ఎలా సతమతమయ్యాడో… అలాగే ఆయన అవసాన దశలో కుటుంబ, రాజకీయాలతో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో.. అనేది చూపిస్తారేమో అని అనుకున్నారు ప్రేక్షకులు. నట, రాజకీయ జీవితాలను వేర్వేరుగా చూపించడానికి ట్రై చేస్తే…. మొదటి పార్ట్ నటజీవితం కథానాయకుడికి తేడా కొట్టింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కథానాయకుడు మీద ఉన్న ప్రధాన విమర్శ ఎన్టీఆర్ భజన ఎక్కువగా చేశారు అని.. అందుకే ఆ చిత్రం డిజాస్టర్ అయిపోయింది అని.. అన్నారు. అందుకే ఈసారి క్రిష్ మహానాయకుడు విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నాడు. మహానాయకుడు సినిమాలో కేవలం వాస్తవాలు చూపించే ప్రయత్నం చేశాడు. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు క్రిష్. సినిమాలో వచ్చే మొదటి పాటలోనే ఎన్టీఆర్ బాల్యంతో పాటు వివాహాన్ని కూడా చూపించాడు. ఈ సినిమాలో కథ కంటే కథానానికే ఎక్కవ ప్రాధాన్యం ఉండటంతో అనవసరమైన హంగామాకి పోకుండా కథ సైడ్ ట్రాక్‌కి వెళ్లకుండా చెప్పాల్సి విషయానికి సూటిగా రేసీ స్క్రీన్ ప్లేతో కథను నడిపించాడు క్రిష్. ఓ నటుడు పార్టీని స్థాపించ‌డం, ఆ మ‌రుస‌టి ఎన్నిక‌ల‌లోనే త‌న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం, పైగా కేంద్రంలోని నిరంకుశ‌త్వ ధోర‌ణికి ఎదురొడ్డి పోరాటం చేయ‌డం ఇవ‌న్నీ అబ్బుర‌ప‌రుస్తాయి. అసలు ఇలాంటివన్నీ ఇంత వేగంగా జరుగుతాయా… ఏదో సినిమాల్లోనే చూపిస్తారు అనేలా ఉన్నప్పటికీ.. అది నిజం. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ సారథిగా చైతన్యరథం తీసుకొని జనాల్లోకి వెళ్లడం సినిమాల్లో ఆరాదించిన వ్యక్తి ప్రజల మధ్యకు వస్తే.. ప్రజలే ఆయన్ని దేవుడిగా కొలవడం…. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే పార్టీని స్థాపించడం, అలాగే తక్కువ సమయంలోనే అధికారంలోకి రావడం అనే సీన్స్ అన్నిఅద్భుతంగా మలిచాడు క్రిష్. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఆ పదవి కోసం వేచి చూసేలా చూడటం.. భార్య వైద్యం కోసం ఎన్టీఆర్ అటు వెళ్ళగానే…నాదెండ్ల వెనకాల రాజకీయాలు చేయడం ఇవన్నీ చాలా చక్కగా చూపించాడు క్రిష్. చంద్రబాబు పాత్ర ఇందులో కీలకం. చంద్రబాబుని మిస్టర్ పర్ఫెక్ట్‌గా చూపించారు. మొదట కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న చంద్రబాబు కొత్తగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తన సొంత మామ ఎన్టీఆర్‌పై సై అని పార్టీ పెద్దలతో శెభాష్ అనిపించుకోవడం.. తరువాత టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోవడం.. అనంతరం ఎన్టీఆర్ కోరికపై పార్టీకి పెద్ద పాలేరుగా ఉంటానని తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం లాంటి సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచాడు క్రిష్. ఇంకా ఒకవైపు ఎన్టీఆర్ ఢిల్లీతో పోరాడుతుంటే పార్టీని.. పార్టీ ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా చంద్రబాబు వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్లడం.. అక్కడ నుండి బెంగుళూరుకు తరలించడం లాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో చంద్రబాబుని హీరోగా చూపించారు. ట్రైన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఢిల్లీ తరలిస్తున్న సీన్‌లో విలన్‌‌లతో చంద్రబాబు ఫైటింగ్‌కి దిగిన సీన్‌ని బట్టి ఆయన పాత్రలో హీరోయిజం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాల‌పై పోరాటం చేయ‌డం.. అలాగే సినిమా మొత్తం బ‌స‌వ‌తార‌కం కోణంలో సాగుతుంది. ఇక బసవతారకం మరణమే సినిమాకి క్లైమాక్స్ గా చూపించారు. కానీ… ఎన్టీఆర్ జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడం, అల్లుడు చంద్రబాబు పార్టీలో కీలకంగా మారడం, చివరి రోజుల్లో ఎన్టీఆర్ మానసిక క్షోభను అనుభవించడం, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఎంట్రీ లాంటి కీలక ఘట్టాలు ఎన్టీఆర్ జీవితంతో ముడిపడిన బలమైన సంఘటనలను క్రిష్, బాలయ్యలు టచ్ చెయ్యకుండా వదిలేశారు. అందుకే మహానాయకుడు రాజకీయంగా అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఏదో అసంపూర్ణత ఈ బయోపిక్ లో కనబడుతుంది.

ప్లస్ పాయింట్స్ : ఎన్టీఆర్‌గా బాల‌య్య న‌ట‌న‌, బసవతారకంగా విద్య నటన, కీర‌వాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోష‌న‌ల్ సీన్స్

మైనస్ పాయింట్స్ : రియాలిటీకి దూరంగా కొన్ని సీన్స్, ఎన్టీఆర్ లైఫ్ లోని కీలక ఘట్టాలు లేకపోవడం,క్లైమాక్స్

Tags:    

Similar News