రాజకీయం నేడు ఖరీదైన వ్యాపారంగానే మారిందా?

ఇప్పుడు ప్రతీ రాజకీయ పార్టీ పూర్తి కంపెనీ ల తరహా లోనే నడుస్తున్నాయి. రాజకీయం అంటే వ్యాపారం అనేది సుస్పష్టం గా ప్రజలకు సైతం అర్ధం అయిపొయింది. [more]

Update: 2020-06-29 17:30 GMT

ఇప్పుడు ప్రతీ రాజకీయ పార్టీ పూర్తి కంపెనీ ల తరహా లోనే నడుస్తున్నాయి. రాజకీయం అంటే వ్యాపారం అనేది సుస్పష్టం గా ప్రజలకు సైతం అర్ధం అయిపొయింది. ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు ఎవ్వరు ఉహించి ఉండరు. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్రేగి పోతున్నాయి. దీనికి మినహాయింపులు ఎవ్వరు కాదని చెప్పే స్థాయికి చేరుకున్నాయి. ప్రజా సేవ అనే దానికి అర్ధం పరమార్ధం వెతుక్కోవలిసిన దుస్థితి దాపురించింది.

ప్రజలే కారణం …

ఇంతటి దురవస్థకు కారణం అంతా ప్రజలే అనే రీతికి వ్యవస్థ నడిచివెళుతుంది. ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తే తప్ప ఓట్లు రాలే పరిస్థితి లేదు. చిన్న వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు వరకు కోట్లాది రూపాయలతోనే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. సేవ చేద్దామని వచ్చేవారు అన్ని కోట్లు పోసి పదవుల్లోకి రావాలని ఎందుకు అనుకుంటారు. వచ్చాక ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి లాగకుండా ఎలా ఉండగలరు. పోనీ ఉన్నా ఆ పై వచ్చే ఎన్నికలకు ఖర్చు ఎక్కడి నుంచి పట్టుకు రావాలి. ఇదే ఇప్పుడు అన్ని పార్టీలకు సమస్యగా మారింది.

ఒక్కసారి అధికారంలోకి వస్తే …

ఒక్కసారి అధికారం వస్తే నాలుగు ఎన్నికల వరకు సరిపడా డబ్బు సంపాదించడమే ఇప్పుడు లక్ష్యంగా ప్రతీ పార్టీ అడుగులు వేయక మానదు. అందుకే ఏ ఒక్కరు గెలిచాకా నీతి, నియమం అనేవి గాలిమాటలుగా చెబుతున్నారు తప్ప ఆచరణలో అవేమి కనిపించవు. నేతిబీరకాయలో నెయ్యి చందంగానే ఉంటాయి. ప్రతీ పార్టీలో ప్రస్తుతం నమ్మకస్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఫలానావారు మా పార్టీలోనే ఉంటారు అని చెప్పుకోగల ధైర్యం ఏ పార్టీలోనూ లేదు.

కొత్త సీసాలో పాత సారనే …

అందుకే నేడు అధికారపార్టీలో ఉన్నవారిలో చాలామంది గత ప్రభుత్వంలో పదవులు వెలగబెట్టిన వారే ఉంటారు. ప్రజలు తిరస్కరించినా నాయకులు మాత్రం అధికారం గొడుగు కిందకు క్షణం ఆలస్యం చేయకుండా చేరుతున్నారు. దీనికి అభివృద్ధి కోసం అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించేస్తున్నారు. ఈ పరిణామం ప్రతీ రాజకీయ పార్టీని నేడు తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. కార్పొరేట్ కంపెనీల తరహాలోనే ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు వ్యవస్థ నిర్మితం అయ్యివుంది. ఎన్నికల ముందు కార్పొరేట్ లు ఇచ్చే కాసుల కోసం ప్రతీ పార్టీ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండటం పరిపాటి గా మారిపోయింది.

కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా …

అలా కోట్లాది రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో ఇచ్చే కార్పొరేట్ ల ప్రయోజనాల కోసమే రాజకీయ పక్షాలు పని చేసుకుంటూ పోతున్నాయి. వారికి భూములు ఉచితంగా కట్టబెట్టడం, బ్యాంక్ రుణాలు ఎగవేస్తే ప్రజల సొమ్ము చెల్లించి ఆ రుణాలు మాఫీ చేయడం వంటివన్నీ ప్రభుత్వాలు తమ బాధ్యతగా చేసుకు పోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే దండిగా డబ్బులు ఖర్చు పెట్టె వారిని వెతుక్కుని మరీ వారికి దండ వేసి ఆహ్వానిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇలా వచ్చిన వారి బ్యాక్ గ్రౌండ్ కానీ సేవాతత్పరత ఉందా లేదా అనే ట్రాక్ రికార్డ్ తో అస్సలు సంబంధమే లేదు. ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారని భావిస్తే వారికి ఖచ్చితంగా టికెట్ లభిస్తుంది.

తారాస్థాయికి తీసుకువెళ్లిన …

తెలుగు రాష్ట్రాలని పరిశీలిస్తే మూడు దశాబ్దాలుగా డబ్బు మాయం గా రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత గా చంద్రబాబు ఈ సిస్టం కి శ్రీకారం చుట్టారని విశ్లేషకులు అంటారు. మొన్నటి ఎన్నికల్లో సైతం చంద్రబాబు పసుపు కుంకుమ స్కీం పై ఎన్ని విమర్శలు వచ్చినా టిడిపి పోలింగ్ కి ముందు ఓటర్లకు డబ్బులు అందేలా చేసిన ప్రక్రియ బెడిసి కొట్టింది. ఇవన్నీ గమనించిన వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కులాలు వర్గాల వారీగా ఐదేళ్లకు ముందే డబ్బులు అకౌంట్ లలో జమ చేస్తూ సంపదను సంక్షేమం పేరిట పంచిపెట్టేస్తుంది. తెలంగాణ లోను ఇదే తరహా గులాబీ పార్టీ మొదలు పెట్టింది. రైతు బంధు పేరిట కానీ, బతుకమ్మ చీరలు ఇలా పలు స్కీమ్స్ తో ఐదేళ్ల పాలన కాలంలోనే ప్రజలకు ముఖ్యంగా టార్గెటెడ్ ఓటు బ్యాంక్ కి పంపకాలు మొదలు పెడుతున్నారు అంతా.

ఆందోళన చెందుతున్న ప్రజాస్వామ్య వాదులు …

గతంలో కాంగ్రెస్, ఎన్టీఆర్ సమయంలో పేద వర్గాలకు అక్కడక్కడా వందా యాభై రూపాయలు ఎన్నికల ముందు ఇచ్చే విధానం ఉంటె ఇప్పుడు సంపన్నులు సైతం ఎన్నికల్లో డబ్బు ఆశించే పరిస్థితి కి వ్యవస్థ చేరుకోవడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. ఇది ఎక్కడో అక్కడ కట్ అవుతుంది అనుకున్నా పెరిగిపోతోందే తప్ప తగ్గడం లేదు. ఎన్నికల సంఘాలు సైతం ప్రేక్షక పాత్రకే పరిమితం కానీ మరేమి లేకుండా పోతుండటం ప్రజాస్వామ్య వాదులను ఆందోళనకు గురిచేస్తుంది.

Tags:    

Similar News