ఈయన కోసం అందరూ క్యూ కడుతున్నారా?

తమిళనాడు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిని బలహీన పర్చాలని విపక్ష డీఎంకే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. [more]

Update: 2020-09-05 17:30 GMT

తమిళనాడు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే, డీఎంకే కూటములు మాత్రమే ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిని బలహీన పర్చాలని విపక్ష డీఎంకే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి డీఎంకేకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవి కావడంతో అన్ని రకాలుగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకూడదన్నది స్టాలిన్ నిర్ణయం. ఇప్పటి నుంచే బలమైన కూటమిని ఏర్పాటు చేయాలన్నది స్టాలిన్ ప్రయత్నం.

అనేక చిన్నా చితకా పార్టీలున్నా…..

తమిళనాడులో అనేక చిన్నా చితకా పార్టీలున్నాయి. ఇవన్నీ ఎన్నికల సమయానికే ప్రజల ముందుకు వస్తాయి. అయితే వాటిలో కూడా సామాజికవర్గ పరంగా బలమైన పార్టీలు కూడా లేకపోలేదు. అందులో పీఎంకే ఒకటి. రాందాస్ నేతృత్వంలోని పీఎంకే బలమైన చిన్నపార్టీ అని చెప్పక తప్పదు. దీనికి వెన్నంటి బలమైన వన్నియార్ల ఓటు బ్యాంకు ఉంది. ప్రస్తుతం పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉంది. అయితే పీఎంకేను తన గూటికి రప్పించుకునేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు.

పీఎంకే వన్నియార్లలో….

తమిళనాడులో వన్నియార్ల సామాజికవర్గం అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తుంది. అందుకే పీఎంకే కు తమిళనాడు రాజకీయాల్లో అంత ప్రాధాన్యత ఉంది. అయితే పీఎంకే అధినేత రాందాస్ ఇప్పటికే అన్నాడీఎంకే తీరుతో విసిగిపోయి ఉన్నారని తెలిసింది. తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సరైన సీట్లను కేటాయించలేదని రాందాస్ కుమారుడు, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అన్సుమణి తీవ్ర విమర్శలు చేశారు. పీఎంకేతో పొత్తుతోనే అన్నాడీఎంకే విజయం సాధించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీరియస్ కామెంట్స్ కూడా చేశారు.

కానీ రజనీ వైపు రాందాస్ చూపు…

ఇక రాందాస్ ఆలోచన మరో విధంగా ఉందని చెబుతున్నారు. రాందాస్ తన కుమారుడు అన్సుమణిని ముఖ్యమంత్రిని చేయాలన్న కోరిక ఉంది. అయితే డీఎంకేలోకి వెళితే అది సాధ్యం కాదు. అన్నాడీఎంకేలో ఉన్నా అది నెరవేరదు. అందుకే రాందాస్ చూపు రజనీకాంత్ వైపు మరలిందంటున్నారు. రజనీకాంత్ కొత్త పార్టీ పెడితే ఆయనతో దోస్తీ కట్టేందుకు పీఎంకే సిద్ధంగా ఉందన్న ప్రచారం ఉంది. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని రజనీకాంత్ ప్రకటించడంతో రాందాస్ రజనీ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. రజనీ పార్టీ వస్తే ఆయనతోనే వెళతారని, లేకుంటే డీఎంకేతో పీఎంకే వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తం మీద అన్ని పార్టీలకూ ఇప్పుడు పీఎంకే కీలకంగా మారింది.

Tags:    

Similar News