ఉత్త‌రంలో ఏ పార్టీ ఊపు ఉంటుందో..?

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఆశావ‌హుల మ‌ధ్య పోటీ పెరిగింది. 2014 ఎన్నిక‌ల్లో భాజ‌పా.. టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌చి [more]

Update: 2019-02-09 03:30 GMT

విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నుంచి టికెట్ దక్కించుకునేందుకు ఆశావ‌హుల మ‌ధ్య పోటీ పెరిగింది. 2014 ఎన్నిక‌ల్లో భాజ‌పా.. టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌చి గెలిచిన విష్ణుకుమార్ రాజుకు ఇక్క‌డ ప్ర‌స్తుతం ఎదురుగాలి వీస్తోంది. పార్టీకి పెద్ద‌గా శ్రేణులు లేక‌పోవ‌డం, ఆయ‌న‌కు కూడా సొంతంగా పెద్ద‌గా ఇమేజ్ లేక‌పోవ‌డం వంటి అంశాలు ఆయ‌న్ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో వెన‌క్కు నెట్టేస్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల్లో, మీడియాలో హ‌ల్‌చ‌ల్ త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న చేసేందేమీలేద‌ని ప్ర‌జ‌ల్లో అభిప్రాయం ఉంది. ఇక ఆయ‌న పార్టీ మారుతున్నారంటూ ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా టీడీపీలోకి వ‌చ్చి పార్టీ త‌రుపున పోటీ చేయాల‌ని యోచిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు మాత్రం ఆయ‌న‌పై ఏమాత్రం సానుకూలంగా లేర‌ని అంటున్నా చివ‌ర్లో స‌మీక‌ర‌ణ‌లు ఎలా మార‌తాయో ? చెప్ప‌లేం.

టిక్కెట్ రేసులో స్వాతి కృష్ణారెడ్డి

ఇక విష్ణుకుమార్ ప‌ట్ల ముందు నుంచి ఒకింత సానుకూలంగా ఉన్న చంద్ర‌బాబు ఇక్క‌డ క‌నీసం పార్టీకి ఇన్‌చార్జ్‌ను కూడా నియ‌మించ‌లేదు. ఇక టీడీపీ నుంచి ప్ర‌ముఖ వ్యాపారవేత్త స్వాతి ప్ర‌మోట‌ర్స్ చైర్మ‌న్ స్వాతి కృష్ణారెడ్డి మేడకు దాదాపు అధినేత గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రెడ్డి సామాజికవ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు ఈ ప్రాంతంలో మంచి ప‌ట్టుంది. వాస్త‌వానికి ఇక్కడ కాపు సామాజికవ‌ర్గ ఓట‌ర్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న‌మాట వాస్త‌వ‌మే. రెడ్డి సామాజికవ‌ర్గాన్ని టీడీపీ దూరం పెడుతూ వ‌స్తోంద‌న్న ఆప‌వాదు ఉన్న ద‌రిమిలా ఆయ‌న‌కే టికెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక అన‌కాప‌ల్లి సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే స్వాతి కృష్ణారెడ్డికి ఇవ్వ‌కుంటే మాత్రం పార్టీ ఇబ్బందుల్లో ప‌డుతుంద‌నే వాద‌న బ‌లంగా ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్న వైసీపీ, జ‌న‌సేన‌

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే కేకే రాజు బ‌రిలో ఉండ‌నున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. నిత్యం ప్ర‌జాక్షేత్రంలో ఉంటున్నారు. దాదాపుగా ఆయ‌న‌కే టికెట్ వ‌చ్చే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే ఇక్క‌డి నుంచి నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉండి ఇటీవ‌లే జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న గుంటూరు భార‌తి టికెట్ ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. వైసీపీ ఆవిర్భావం నుంచి మ‌హిళా విభాగానికి సార‌థ్యం వ‌హించిన పసుపులేటి ఉషాకిర‌ణ్ కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన‌లో చేరారు. ఆమె కూడా టికెట్ ఆశిస్తున్నారు. అందుకే నిత్యం ప్ర‌జా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. జ‌న‌సేన సానుభూతిప‌రులు ఎక్కువగా ఉండ‌డంతో ఆ పార్టీ ప్ర‌భావం కూడా ఎక్కువ‌గానే ఉండ‌నుంది. మొత్తంగా చూసుకున్న‌ట్ల‌యితే కాపు సామాజకవ‌ర్గం ఓటర్ల ప్ర‌భావం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండ‌నుంది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ధ్య త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌తో పాటు ఎక్కువ సంఖ్య‌లో ఉద్యోగులు ఉన్నారు. ప్ర‌జాచైత‌న్యం ఎక్కువే అని చెప్పాలి.

Tags:    

Similar News