టీడీపీలో పెద్ద గొంతులు పెగలవేం?

తెలుగుదేశం పార్టీలో వన్ టు టెన్ చంద్రబాబే. ఆయన ఎవరినీ నమ్మరు. అన్ని పనులూ తానే చూడాలనుకుంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.ఆ సంగతి [more]

Update: 2019-06-26 08:30 GMT

తెలుగుదేశం పార్టీలో వన్ టు టెన్ చంద్రబాబే. ఆయన ఎవరినీ నమ్మరు. అన్ని పనులూ తానే చూడాలనుకుంటారు. దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.ఆ సంగతి తెలిసినా బాబు మాత్రం తన వైఖరి ఎపుడూ మార్చుకోలేదు. టీడీపీలో పని విభజన అంటూ లేకపోవడం వల్ల నాడు మంత్రులు, ఇపుడు పార్టీ నాయకులు కూడా ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోయారు. అధికారంలో ఉన్నపుడు తీరు వేరు. ఎవరు ఎలా ఉన్నా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి వాయిస్ బాగానే బయటకు పోతుంది. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి బలమైన గొంతులకు కావాలి. కానీ మారని తమ్ముళ్ళు అన్నీ బాబే చూసుకుంటారన్న దానికి అలవాటు పడిపోయారు. దాంతో ఏ ఒక్క గొంతూ కూడా లేవడం లేదు.

బాబుకు మద్దతు కరవు :

టీడీపీలో బాబు అధినాయకుడు. ఆయన మీద ఈగ వాలినా పార్టీ సహించదు అన్న సందేశాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అటువంటిది బాబు గారి కలల నగరంలో ఆయన కట్టుకున్న ప్రజావేదిక కూల్చేస్తున్నా టీడీపీ తమ్ముళ్ల గొంతు మూగబోతోంది. ఇక బాబు గారి ఇల్లు కూడా రేపో మాపో కూల్చేసినా కూడా కిక్కురుమనని పరిస్థితి ఉంటుందేమో. పార్టీ ఓడిపోయి అప్పుడే నెల రోజులు పై దాటిపోయింది. అయినా తమ్ముళ్ళు అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారో ఏమో కానీ పెద్ద గొంతు చేసుకోవడంలేదు. ఓ వైపు నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ ఫిరాయిస్తే తమ్ముళ్ల స్పందన చాలా పేలవంగా ఉంది.

మాజీ మంత్రులేరీ :

పార్టీ అధికారంలో ఉన్నపుడు రెండు విడతలుగా విస్తరించిన సందర్భంలో మొత్తంగా ముప్పయి మంది పై వరకూ మంత్రులకు బాబు అవకాశాలు ఇచ్చారు. . ఇపుడు ఆ మంత్రులు మాజీలయ్యారు. కానీ వారిలో ఎవరూ కూడా పార్టీ ఫిరాయింపుల మీద నోరు చేసుకోలేదు. వైసీపీ సర్కార్ టీడీపీ అవినీతిని పదే పదే గట్టిగా బహిర్గతం చేస్తున్నా ఎవరూ కిక్కురుమనడంలేదు. చంద్రబాబుకు అమరావతిలో నిలువ నీడ లేకుండా చేస్తామంటే కూడా తమ్ముళ్ళ నోరు బంద్ అయింది. ఏపీ టీడీపీకి కళా వెంకటరావు అధ్యక్షుడు ఉన్నారు. పార్టీ కార్యవర్గం కొండవీటి చాంతాడంత ఉంది. కానీ ఎవరూ కూడా ప్రజావేదిక విషయంలో కానీ ఫిరాయింపుల భాగోతంపైన కానీ నోరు పెట్టింది లేదు. దీనికి ముందు అసెంబ్లీ వేదిక మీద కూడా వైసీపీ చంద్రబాబు మీద విరుచుకుపడిన సందర్భంలో కూడా ఆయన వెనకలా మాట్లాడేందుకు అచ్చెన్నాయుడు, మరోకరు తప్ప మిగిలిన వారే కనిపించలేదు. ఈ రకమైన పరిస్థితి చూసినపుడు టీడీపీలో చంద్రబాబు ఒంటరిగా మారిపోయారా అనిపించకమానదు.

Tags:    

Similar News