షర్మిలను శభాష్ అనాల్సిందేనా?

వై.ఎస్.షర్మిల పార్టీ పెట్టి ఏం సాధిస్తారో ఎవరికీ తెలియదు. ఆమె ఆలోచన వెనక ఎవరున్నారో స్పష్టత లేదు. ఆమె పార్టీ వల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ పక్షాల్లో [more]

Update: 2021-04-11 06:30 GMT

వై.ఎస్.షర్మిల పార్టీ పెట్టి ఏం సాధిస్తారో ఎవరికీ తెలియదు. ఆమె ఆలోచన వెనక ఎవరున్నారో స్పష్టత లేదు. ఆమె పార్టీ వల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ పక్షాల్లో ఎవరికి లాభం చేకూరుతుంది? ఎవరు నష్టపోతారనే దానిపైనా రకరకాల సమీకరణలున్నాయి. గందరగోళమైన రాజకీయ వాతావరణంలో మళ్లీ కొత్త వేదికా? అని ప్రశ్నించేవారికి కొదవ లేదు. పైపెచ్చు రాయలసీమ నేపథ్యం ఉన్న షర్మిలకు భావోద్వేగాల తెలంగాణ లో భవిష్యత్తు ఉంటుందా?. ఇన్ని రకాల ప్రశ్నలున్నా, ఒకందుకు మాత్రం షర్మిల ను శభాష్ అనాల్సిందే. రాజకీయాధికారం మగాళ్ల సొత్తుగా మారిపోయిన తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళ ముందుకొచ్చి సవాల్ విసరడం సామాన్యమైన విషయం కాదు. జాతీయ పార్టీలు మొదలు ప్రాంతీయ పార్టీల వరకూ వారసత్వ రాజకీయాల్లోనూ వివక్ష కొనసాగుతోంది. ఆడాళ్లకు సామర్థ్యం ఉందని నిరూపించుకున్నప్పటికీ తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ప్రియాంక కు కరిష్మా ఉందని తెలిసినా రాహుల్ మాత్రమే రావాలంటారు. పదవిని అధిష్టించాలంటారు. ఎన్టీయార్ మనవరాలు బ్రాహ్మణి అయితే పార్టీకి ఫాలోయింగ్ పెరుగుతుందని తెలిసినా లోకేశ్ మాత్రమే వారసుడని నిర్ధరించేస్తారు. ఉద్యమం నుంచి మొదలు పెట్టి తనను తాను నిరూపించుకున్నప్పటికీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టుకోవాలి. కరుణానిధి ఆలోచనల వేగాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ కణిమొణి డీఎంకే రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చకూడదు. రాజకీయం మగాళ్ల సొత్తుగా ముద్ర వేసేసుకున్న దారుణ స్థితి. ఇందిర, జయలలిత, మమత, మాయావతి వంటి ఎందరెందరో తాము రాజకీయ రంగంలో పురుషులకు తీసిపోమని ఇప్పటికే నిరూపించేశారు. మగాళ్లకంటే తమ నిర్ణయాలు దృఢంగా ఉంటాయని పనితీరుతో పక్కా చేశారు. అయినా సాధ్యమైనంతవరకూ ఆడాళ్లను అణగదొక్కేస్తోంది రాజకీయ పురుష ప్రపంచం. సొంత పార్టీని వదిలేసి తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే వైసీపీలో తనకు ద్వితీయ స్థానం కూడా ఇవ్వడానికి అన్న జగన్ మోహన్ రెడ్డి ఇష్టపడలేదనే అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో అందరూ సక్సెస్ కాలేరు. కానీ తెగించి తన కాళ్లపై తాను ఒక పార్టీ పెడతానని షర్మిల ముందుకు రావడం మాత్రం ఇతర పార్టీలకు కనువిప్పు గానే చెప్పాలి.

అందరిలా.. ఆ తాను ముక్కే…

కుల, మత సమీకరణల సంగతి పక్కన పెడితే కచ్చితంగా షర్మిల తన సొంత పార్టీని ప్రారంభించడం ఖాయమైపోయింది. సంకల్ప సభలో సుదీర్ఘపోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పకనే చెప్పేశారు. ఆశావహమైన వాతావరణం లేని స్థితిలో ఒక పార్టీని పెడతాననడమే సాహసం. ఉద్యమాలతో పెనవేసుకుపోయిన వారు, గ్లామర్ ప్రపంచంలో లక్షల మంది అభిమానులు ఉన్న నటులు సైతం పార్టీలను నడపలేక తలకిందులవుతున్నారు. గడ్డు కాలంలోనూ నెగ్గుకొస్తానంటోంది షర్మిల. మంచిదే. జెండా కొత్తది కావచ్చు. కానీ అజెండా మూసలోనిదే. ప్రాంతీయ పార్టీలన్ని అనుసరించే ధోరణిలోనే తన పంథా ఉండబోతున్నట్లు చూచాయగా ప్రకటించేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారపార్టీలు, ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాయి. బీజేపీపైన, కేంద్రంపైన చేసే ఆరోపణలు, విమర్శలు చాలా బలహీనంగా ఉంటున్నాయి. పోరాట పంథా లోపించింది. షర్మిల పార్టీ కూడా ఆకోవలోనే ఉండబోతోంది. కేంద్రంలోని అధికార పార్టీపై నామమాత్రపు విమర్శలు మినహా నిలదీసే ధోరణి కనిపించడం లేదు. అందుకే మిగిలిన పార్టీల తరహాలోనే మరో పార్టీగానే ఉండబోతోంది. అందరిలాగే తాను కూడా ఆ తాను ముక్కగానే రాజకీయాలు నడపాలనుకుంటోంది.

ఆత్మరక్షణలో.. అధికారం…

తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయాల్లో దూకుడెక్కువ. ఉద్యమంతో పెనవేసుకున్న బంధం. అందుకే ఇతర పార్టీలపై దారుణంగా విరుచుకుపడుతుంది. ఆంధ్రాకు చెందిన పార్టీలు, నాయకత్వం కనిపిస్తే టీఆర్ఎస్ కు చాలా అడ్వాంటేజ్. కాంగ్రెసు పార్టీ 2018లో టీడీపీతో చేతులు కలిపిన పాపానికి టీఆర్ఎస్ నుంచి రాజకీయ దాడిని చవిచూడాల్సి వచ్చింది. షర్మిల తాను ఈ ప్రాంతం కోడలిగా క్లెయిం చేసుకోవచ్చు. కానీ రాయలసీమ మూలాలున్నాయి. అయినప్పటికీ షర్మిల విషయంలో అధికార పార్టీ చాలా డిఫెన్స్ లో ఉంది. మహిళ కావడంతో నోరు మెదపలేకపోతున్నారు అగ్రనేతలు. ఆమెను పరుష పదజాలంతో నిందిస్తే రివర్స్ లో తమకే నష్టం వాటిల్లుతుందనే అంచనాలో ఉన్నారు. ఏమాత్రం నోరు జారినా రాజశేఖరరెడ్డి అభిమానులు, క్రిస్టియన్లు, ఎస్సీ వర్గాలు, మైనారిటీలు టీఆర్ఎస్ కు దూరమై పోతారేమోననే భయం పట్టుకుంది. షర్మిలను ఎదుర్కోవడంలో బలహీనమైన, పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. చూసీ చూడనట్లు పోతున్నట్లు బహిరంగంగా కనిపిస్తోంది. కానీ లోతుగా తరచి చూస్తే ఆమెను ఎదుర్కొనేందుకు సరైన వ్యూహం లేదు. ఇతర పార్టీలపై ఎదురుదాడి చేసే అధికార పార్టీ , షర్మిలవిషయంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

ఇకనైనా సాధికారత..

రాజకీయాల్లో మహిళలు ముందుకు రావాలి. మహిళా ప్రతినిధులు చురుకుగా వ్యవహరిస్తున్న స్థానిక సంస్థలు మెరుగైన ఫలితాలను కనబరిచినట్లు రికార్డులు చాటి చెబుతున్నాయి. మహిళా ప్రతినిధులు ఉన్న చోట పోల్చి చూస్తే అవినీతి ముద్ర తక్కువగా ఉంది. జగన్ తరహాలో కాకుండా పొలిటికల్ గా క్లీన్ ట్రాక్ రికార్డు ఉండటం షర్మిలకు అడ్వాంటేజ్. షర్మిల రాజకీయం నడపటంతో ఇతరపార్టీలు సైతం మహిళల ప్రాతినిధ్యం పెంచక తప్పని అనివార్యత ఏర్పడవచ్చు. కనీసం షర్మిలను ఎదుర్కోవడం కోసమైనా ద్వితీయ శ్రేణి మహిళా నాయకులకు స్వేచ్ఛ నిచ్చి పవర్ పుల్ గా తయారు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాగ్ధాటి కలిగిన కల్వకుంట్ల కవిత వంటివారికి ఇది గోల్డెన్ చాన్సు. కాంగ్రెసు, బీజేపీలు సైతం మహిళా నాయకులకు పెద్ద పీట వేయకతప్పదు. అందుకే షర్మిల పార్టీ మార్పుదిశలో మంచి ప్రయత్నమైతే అందరూ హర్షించాల్సిందే. తెలంగాణలో వైసీపీ దాదాపు లేనట్లే కాబట్టి రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పూర్తిగా తాను క్లెయిం చేసుకోగలుగుతోంది. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో మహిళా నాయకత్వంలో ప్రాబల్యం కలిగిన పార్టీ ఆవిర్భవిస్తోంది. ఖమ్మం సభ సక్సెస్ ఇదే విషయాన్ని చాటి చెబుతోంది. అయితే గతంలో లక్ష్మీ పార్వతి సారథ్యంలో ఎన్టీయార్ పేరిట ఒక పార్టీ వెలసింది. కానీ నిలదొక్కుకోలేకపోయింది. తెలుగుదేశం దాడిని తట్టుకోలేక క్రమేపీ కనుమరుగైపోయింది. ఆటుపోట్లను తట్టుకుని నిలబడితే అధికారం రాకపోయినా గుర్తించ దగిన స్థాయిలో సీట్లు, ఓట్లు తెచ్చుకోగలిగితే షర్మిల రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదు. అటు ఆంధ్రాలో అదికారంలో ఉన్న వైసీపీకి సమాంతర వేదికను తెలంగాణలో నెలకొల్పుకుంటే ఎప్పుడైనా అటో ఇటో ఒక చాన్సు దక్కే అవకాశాలు సైతం ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News