ఎక్కడా నో ఎంట్రీయేనా…?

ఎటూ దారిలేక…ఎటూ వెళ్లలేక… ఇలా తయారయింది సీనియర్ నేత డి.శ్రీనివాస్ పరిస్థితి. డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని చెప్పేందుకు ఏమాత్రం సందేహం లేదు. త్వరలో ఉన్న [more]

Update: 2018-12-28 11:00 GMT

ఎటూ దారిలేక…ఎటూ వెళ్లలేక… ఇలా తయారయింది సీనియర్ నేత డి.శ్రీనివాస్ పరిస్థితి. డి.శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనని చెప్పేందుకు ఏమాత్రం సందేహం లేదు. త్వరలో ఉన్న పదవీ ఊడిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీఎస్ డోలాయమానంలో ఉన్నారు. కాంగ్రెస్ లో కి ఎంట్రీ ఇక కష్టమేనని తేలిపోయింది. ఇటు టీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ అవ్వడమే మేలు. ఇలా ధర్మపురి శ్రీనివాస్ తన రాజకీయ జీవితానికి ఇలా ముగింపు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డి.శ్రీనివాస్ పై త్వరలోనే రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. ఆయనంతట ఆయనగా రాజీనామా చేస్తే సరి…లేకుంటే ఫిర్యాదు చేస్తామని, డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

డీఎస్ పై ఫిర్యాదుకు….

ఇటీవల రాజ్యసభ నుంచి జనతాదళ్ యు నేత శరద్ యాదవ్ పై వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. కానీ డి.శ్రీనివాస్ నేరుగా రాహుల్ గాంధీని కలసి చర్చించడం, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కొన్ని సభల్లో చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ లను టీఆర్ఎస్ నేతలు సేకరించారు. వీటన్నింటి ఆధారంగా ఆయనను రాజ్యసభ పదవి నుంచి తప్పించాలని కోరనున్నారు. అయితే డి.శ్రీనివాస్ అంతకంటే ముందుగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మహాకూటమి విజయం సాధిస్తుందని…..

డి.శ్రీనివాస్ ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రంతిప్పిన వ్యక్తి. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన డీఎస్ రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ ఆయనకు గౌరవప్రదమైన స్థానం లభించినా, సొంత జిల్లా రాజకీయాల నుంచి డిఎస్ బయటపడలేకపోయారంటారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టడం వల్లనే అక్కడ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. దీంతో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి వెళదామని భావించారు. ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే తాను నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చని, రాజ్యసభ కాని, ఎమ్మెల్సీ పదవి కాని సంపాదించుకోవచ్చని భావించారు.

అంచనాలు తలకిందులు కావడంతో….

కాని డీఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చినట్లుగా ఆయన సొంత జిల్లాలోనే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. తన అనుచరులందరినీ ముందుగానే కాంగ్రెస్ లోకి పంపిన డిఎస్ నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇరవై వేల మెజారిటీతో గెలవడంతో ఇప్పుడు డీఎస్ వైపు కాంగ్రెస్ నేతలు కూడా చూడటం లేదు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డీఎస్ అవసరం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం పట్టించుకోవడం లేదట. మొత్తంమీద డీఎస్ రెంటికి చెడ్డ రేవడిలా మారారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News