శుక్రవారం ఏం జరగనుంది..?

Update: 2018-07-18 18:29 GMT

కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో స్పీకర్ సుమిత్రా మహజన్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అవిశ్వాసంపై చర్చతో పాటు విభజన హామీల అమలు, విపక్షాల ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం చర్చించనుంది. గత సమావేశాల్లో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వరుసగా అవిశ్వాస తీర్మాణాలు ప్రవేశపెట్టినా స్పందించని కేంద్రం ఈసారి ఎదుర్కొవాలని భావించింది. దీంతో ఇప్పుడు రాష్ట్రం, కేంద్రం అవిశ్వాస తీర్మాణంలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తోంది.

అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ

బుధవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ అధిష్ఠానం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, అమలు జరుగుతున్న తీరు, రావాల్సిన నిధులపై చర్చకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. కేంద్రం చేసే వాదనలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం వరకు ఎంపీలను పూర్తిగా సిద్ధం చేయాలని భావిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా టీడీపీ వాదనలకు కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అందుకే చర్చకు ఆ పార్టీ సిద్ధమైందని భావిస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల పూర్తి సమాచారాన్ని సభలోనే చెప్పి టీడీపీ వాదనలకు కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది.

బీజేపీ అసంతృప్తుల మద్దతు కోరేనా..?

అయితే, అవిశ్వాస తీర్మాణంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు, బీజేపీ అసంతృప్తులను, మోడీ వ్యతిరేకులను కూడా సంప్రదించాలని తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మోడీ విధానాలపై అసంతృప్తితో ఉన్న అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి వారిపై చర్చించాలని భావించినా, ఇటువంటి ప్రయత్నం చేస్తే విషయం పూర్తిగా రాజకీయం అవుతుందనే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయం పక్కకు వెళుతుందని భావిస్తున్నారు. దీనికితోడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున రాజకీయాలు చేస్తున్నామనే విమర్శలు వస్తాయని టీడీపీ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News