ఎవరిది పైచేయి ?

Update: 2018-07-21 15:30 GMT

అవిశ్వాసఘట్టం ముగిసింది. అసలు రాజకీయం మొదలైంది. ఎవరి అజెండాతో వారు మాట్టాడేశారు. తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీకి ఇతరుల నుంచి లభించిన మద్దతు అంతంతమాత్రమే. కేవలం 126 కే మద్దతు దారులైన సభ్యుల సంఖ్య పరిమితమైంది. తెలుగుదేశం, వైసీపీ, జనసేన లకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ప్రధానం. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెసు లకు ప్రత్యేక అజెండాలున్నాయి. అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీ, వామపక్షాలకు ఎవరి సిద్దాంతం వారికుంది. ఎవరి అవసరాలు వారికున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా , విభజన చట్టం అమలును ప్రధానాంశం చేయాలనే తలంపు తో టీడీపీ దీనిని ప్రతిపాదించింది. కానీ చర్చలో అదే ఒకానొక అంశంగానే మిగిలిపోయింది. జాతీయంగా ప్రభావం చూపగల పార్టీలు బరాబర్ తేల్చుకునేందుకు రాజకీయ పనిముట్లను బయటికి తీశాయి. కత్తులు దూసుకున్నాయి. తమ ఆయుధాలకు పదును పెట్టుకున్నాయి. ఎవరు ఎంతమేరకు రాణించారు? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అదనపు సాయం ఏమైనా అందుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ అవిశ్వాసం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలుగుతుందా? అన్న సందేహమూ తలెత్తుతోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రోడ్ మ్యాప్ 2019 రెడీ అయిపోయింది.

పేటెంట్ ఓకే..

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఏకైక చాంపియన్ గా నిలవాలని టీడీపీ భావించింది. వైసీపీ సభ్యుల రాజీనామాతో మార్గం సుగమమం అయిపోయింది. డిల్లీ కేంద్రంగా పార్లమెంటులో తన వాణిని అధికారపార్టీ వినిపించగలిగింది. సాంకేతిక గణాంకాలు పాతవే, మళ్లీ వండి వార్చింది. భావోద్వేగాల ఆవేదనను అదనంగా చేర్చింది. తెలుగుదేశం వ్యూహాత్మకంగా పైచేయి సాధించినట్లుగానే చెప్పుకోవాలి. రాష్ట్రంలోని ప్రధానమైన మిగిలిన రెండు పార్టీలు అసలు సోదిలో లేకుండా పోయాయి. బడ్జెట్ సెషన్ లో తొలి అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన వైసీపీ సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయింది. అసలు ఈ తీర్మానానికి ఆదిమూలంగా నిలిచి తొలుత డిమాండ్ వినిపించిన జనసేన తానే క్లెయిం చేసుకోలేని పరిస్థితిలో పడిపోయింది. ఆటకు అనుగుణంగా పావులు కదపడంలో ఆరితేరిన చంద్రబాబు చాణక్యం ఫలించింది. కేంద్రప్రభుత్వం స్పందించే అవకాశాలు అంతంతమాత్రమని అందరికీ తెలుసు. రాజకీయంగా మైలేజీ దక్కుతుందా? లేదా? అన్నదే ప్రధానం. ఆ మేరకు పేటెంట్ ను టీడీపీ సాధించగలిగిందనే చెప్పాలి. ప్రజాక్షేత్రంలో ఇది ఎంతవరకూ ఫలవంతం అవుతుందో వేచి చూడాలి.

పేచీ ఎక్కడ?...

అసలు బీజేపీకి, టీడీపీకి ఎక్కడ చెడిందనే విషయంలో ఒక కీలకాంశాన్ని మోడీ బయటపెట్టారు. టీఆర్ఎస్, టీడీపీ అధినేతలు కేసీఆర్, చంద్రబాబులు తొలి ఏడాది గిల్లికజ్జాలు పెట్టుకునేవారని మోడీ చెప్పారు. గవర్నర్, హోం మంత్రి, తాను జోక్యం చేసుకుని దిద్దుబాటు చేయాల్సి వచ్చిందన్నారు. అనేక సందర్బాల్లో వీరిరువురినీ బుజ్జగించి గొడవల్లేకుండా చూశామన్నారు. ఆయా వివాదాల్లో తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ పరిణతితో వ్యవహరించారని ప్రధాని చేసిన ప్రశంస భవిష్యత్ రాజకీయ సమీకరణలకు సంకేతం. వైసీపీ ఉచ్చులో పడవద్దని చంద్రబాబునూ హెచ్చరించానన్నారు. టీడీపీ వైఫల్యాలను తప్పించుకోవడానికి ఎన్డీఏ కూటమి నుంచి బయటకి వచ్చేసిందని ప్రధాని కుండబద్దలు కొట్టేశారు. మొత్తమ్మీద అవసరార్థం సాగిన పొత్తే తప్ప తొలి నుంచీ చంద్రబాబు, మోడీల మధ్య సుహృద్భావ సంబంధాలు లేవనే విషయాన్ని ప్రధాని పరోక్షంగా వెల్లడించారు. అంతేకాదు, రాష్ట్ర విభజన సమస్యల అంశంలో బీజేపీ నేత్రుత్వంలోని కేంద్రం ఏడుమండలాల విలీనం తర్వాత తెలంగాణ వైపే మొగ్గు చూపిందని తేల్చేశారు. చంద్రబాబు డిమాండ్లు అతిగా ఉండటమూ, కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ నిర్ణయాలను సమర్థించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తమ్మీద పేచీకి మూలాలు దీర్ఘకాలంగా పెరుగుతూ వచ్చినట్లుగానే చెప్పుకోవాలి.

పేలిందా...గన్ ?...

ఎంపీల చేత రాజీనామాలు చేయించి రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించాలనుకున్న జగన్ వ్యూహం విఫలమైంది. బీజేపీ ద్వంద్వ వైఖరి వైసీపీని దెబ్బతీసింది. పార్లమెంటు సభ్యుల రాజీనామాలు ఆమోదించే సందర్బంలో వర్షాకాల సమావేశాల గురించి హెచ్చరించి ఉంటే వైసీపీ జాగ్రత్త పడి ఉండేది. అవిశ్వాసం చర్చ తర్వాత సభలోనే రాజీనామాలు ప్రకటించి ఉంటే వైసీపీకి మైలేజీ దక్కేది. కానీ తమను వ్యతిరేకించే పార్టీలు, సభ్యుల సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ చాలా చాకచక్యంగా వ్యవహరించింది. అలాగని వైసీసీ కి సభలో ప్రాతినిధ్యం దక్కలేదని చెప్పలేం. పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుక అధికారికంగా వైసీపీ తరఫున మాట్లాడేయడం విశేషం. ఇవన్నీ టీడీపీకి లాభించే పరిణామాలే. మరోవైపు జనసేన కూడా రాజకీయంగా అవిశ్వాసం విషయంలో అన్యాయమైపోయింది. తమకు సభ్యులెవరూ లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో నిలిచిపోయింది. అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి హడావిడి చేసి ఉంటే మీడియా ప్రచారంతోపాటు కొంత మైలేజీ వచ్చేది. నిజానికి ఈ హడావిడి స్టార్ట్ చేసిందే పవన్. చివరి క్షణం వరకూ తన స్టాండ్ ను, వ్యూహాన్ని పరిరక్షించుకోలేకపోవడం వల్ల ప్రధాన పక్షాలు రెండూ చర్చలోకి రాకుండా తమను తాము నిర్బంధించుకున్నట్లయింది. ప్రత్యర్థుల అస్త్రాలను దక్కించుకుని ఫైట్ చేసి పైచేయి సాధించింది తెలుగు దేశం.

Similar News