నితీష్ నిరుపేద

దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ నిజాయితీ పరుడని పేరు. ఆయన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినా ఆస్తులు కూడబెట్టుకోవడం చేతకాదు. [more]

Update: 2020-01-04 16:30 GMT

దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ నిజాయితీ పరుడని పేరు. ఆయన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినా ఆస్తులు కూడబెట్టుకోవడం చేతకాదు. ముఖ్యమంత్రిగా కొన్నేళ్లనుంచి బీహార్ ను అభివృద్ధి చేయడం దిశగా పనిచేస్తున్నారు. మద్యనిషేధాన్ని పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. దేశంలో అత్యంత నిరుపేద అయిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రికార్డుల్లోకి ఎక్కారు.

విలువలతో కూడిన…..

దేశంలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వారిలో నితీష్ కుమార్ ఒకరు. 1970వ దశకంనుంచే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కానీ నితీష్ కుమార్ ఎప్పుడూ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రయత్నించలేదు. అందుకే నితీష్ కుమార్ మాజీ ప్రధాని వాజ్ పేయికి అత్యంత ఇష్టుడయ్యారంటారు. 2000 సంవత్సరంలో తొలిసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

అదొక్కటే మచ్చ…..

జనతాదళ్ యు వ్యవస్థాపకుడు శరద్ యాదవ్ ను పక్కన పెట్టి పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడమే ఆయనపై రాజకీయంగా ఉన్న ఏకైక మచ్చ. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలసి మహాగడ్బందన్ గా పోటీచేసి విజయం సాధించారు. అయితే లాలూకుమారుల అవినీతి వ్యవహారంతో విసిగిపోయిన నితీష్ కుమార్ ఏకంగా మంత్రిపదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ కుమార్ ను బీజేపీ దగ్గరకు తీసింది. దీంతో బీజేపీతో కలసి వచ్చే ఎన్నికలకు నితీష్ కుమార్ సిద్ధమవుతున్నారు.

మంత్రుల కంటే…?

తాజాగా నితీష్ కుమార్ తన ఆస్తులను ప్రకటించారు. ఆయనకున్న ఆస్తి పది ఆవులు, ఏడు దూడలు, ఒక పశువుల షెడ్డు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తన పేరిట 48 లక్షల విలువ చేసే ఇల్లు ఢిల్లీలో ఉందని చెప్పారు. ఆయన వద్ద ప్రస్తుతం ఉన్న నగదు 38,039 రూపాయలు మాత్రమేనని వెల్లడించారు. నితీష్ కుమారుడి పేరు మీద మాత్రం 1.49 కోట్ల స్థిరాస్థి, అంతే మేర చరాస్తి ఉన్నట్లు నితీష్ కుమార్ వెల్లడించడం విశేషం. బీహార్ లో ఉన్న మంత్రులు, దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల కన్నా నితీష్ కుమార్ నిరుపేదగా ఆయన ఆస్తులను చూసి చెప్పేయవచ్చు.

Tags:    

Similar News