నితీష్…మీకిది తగునా?

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనతాదళ్ యులో విభేదాలు పొడసూపుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తుతో వెళ్లాలని నితీష్ కుమార్ నిర్ణయం ఇప్పటికే తీసుకున్న సంగతి తెలిసిందే. [more]

Update: 2019-12-15 16:30 GMT

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనతాదళ్ యులో విభేదాలు పొడసూపుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తుతో వెళ్లాలని నితీష్ కుమార్ నిర్ణయం ఇప్పటికే తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ బిల్లు, ఎన్నార్సీ అమలు విషయంలో మాత్రం పార్టీలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ముఖ్యంగా పౌరసత్వ బిల్లుపై జేడీయూ మద్దతు పలకడాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుపడుతున్నారు. ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ సయితం…..

అయితే పౌరసత్వ బిల్లు వల్ల వచ్చే ముప్పు ఏమీలేదని, బీహార్ లో ఎన్సార్సీని అమలు చేయబోమని నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ కు స్పష్టత ఇచ్చినట్లు చెబుతున్నారు. పౌరసత్వ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో బీహార్ లో అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లు నితీష్ కుమార్ కు వ్యతిరేకమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరంతా ఇప్పటికే ఆర్జేడీకి మద్దతు దారులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్సార్సీని బీహార్ లో అమలు చేయబోమని స్పష్టం చేశారు.

ముస్లింలు వ్యతిరేకంగా…..

శరద్ యాదవ్ చేతిలో నుంచి జనతాదళ్ యును తన చేతుల్లోకి తీసుకున్న నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ ను ఉపాధ్యక్షుడిగా నియమించారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహరచనను బీహార్ లో మొదలుపెట్టారు. ప్రధానంగా జనతాదళ్ యు పోటీ చేయనున్న స్థానాల్లో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రెండు దఫాలు సర్వేలు నిర్వహించి నితీష్ కుమార్ కు అందించారు. ఈ సర్వేల్లో నితీష్ కుమార్ కు మద్దతు ఇచ్చేందుకు ముస్లిం ఓటర్లు సుముఖంగా లేరని సర్వేల్లో తేలడంతో ప్రశాంత్ కిషోర్ ఆందోళన వ్యక్తం చేశారంటున్నారు.

కీలక నేతలు సయితం…..

ప్రశాంత్ కిషోర్ తో పాటు మరికొందరు కీలక నేతలు కూడా నితీష్ కుమార్ నిర్ణయాన్న తప్పుపడుతున్నారు. జేడీయూ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ సయితం పౌరసత్వ బిల్లును సమర్థించడం తప్పని బహిరంగంగా వ్యాఖ్యానించారు. పార్టీ సిద్ధాంతాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీరందరికీ నితీష్ కుమార్ ఒకే మాట చెబుతున్నారు. పౌరసత్వ బిల్లును సమర్థించడంలో తప్పు లేదని, ఎన్సార్సీని అమలు చేయనని చెప్పడంతో పార్టీలో ఆగ్రహంగా ఉన్న నేతలు కొంత తగ్గినట్లు చెబుతున్నారు. మొత్తం మీద బీహార్ జనతాదళ్ యులో పౌరసత్వ బిల్లు ముసలం పుట్టించిందనే చెప్పాలి.

Tags:    

Similar News