నితీష్ సీఎం అయినా స్టీరింగ్ మాత్రం?

బీహార్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఒక రకంగా ఇది బీజేపీ ప్రభుత్వమనే చెప్పాలి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ స్టీరింగ్ మాత్రం బీజేపీ చేతుల్లోనే [more]

Update: 2020-11-12 16:30 GMT

బీహార్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఒక రకంగా ఇది బీజేపీ ప్రభుత్వమనే చెప్పాలి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ స్టీరింగ్ మాత్రం బీజేపీ చేతుల్లోనే ఉండనుంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను సాధించింది. బీజేపీ 72 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటే జేడీయూ 47 స్థానాలకే పరిమితమయింది.

ముఖ్యమంత్రిగా కూడా…

కానీ భారతీయ జనతా పార్టీ ముందుగా చెప్పిన ప్రకారం నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో ఇక వేరే వివాదాలకు తావులేదు. అయితే బీజేపీలో కొంత మంది సీనియర్ నేతలు కేంద్ర నాయకత్వం నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తమకు ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి ఎందుకు వద్దన్నారన్న విషయాన్ని నిలదీస్తున్నారని తెలిసింది.

ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఫార్ములా…..

దీనిపై ఇప్పటికే కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ములాను కేవలం సీట్ల సర్దుబాటుకే కాకుండా ముఖ్యమంత్రి పదవికి కూడా వర్తింప చేయాలని కోరుతున్నారు. రెండున్నరేళ్లు నితీష్ కుమార్ కు సీఎం పదవి ఇచ్చినా, చివరి రెండున్నరేళ్లు బీజేపీకి ముఖ్యమంత్రి పదవి దక్కాలని కొందరు గట్టిగా వత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఇందుకు కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

మంత్రివర్గంలోనూ…..

ఇక మంత్రివర్గ విస్తరణలోనూ ఎక్కువ మంది బీజేపీ నేతలకు దక్కేలా అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ జేడీయూ మంత్రివర్గంలో తక్కువ పదవులను ఇచ్చిందని ఈసారి మాత్రం జేడీయూ కంటే ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినపడుతుంది. అంతేకాదు కీలకమైన హోం, రెవెన్యూ, ఆర్థిక వంటి శాఖలను కూడా బీజేపీ కి అప్పగించాలని కూడా అధిష్టానం పై వత్తిడి తెస్తున్నారు. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే నితీష్ కుమార్ బీజేపీ వత్తిళ్లతోనే పాలన చేయాల్సి ఉంటుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది.

Tags:    

Similar News