నితీష్....నిమిత్త మాత్రుడేనా?

Update: 2018-06-08 17:30 GMT

నితీష్ కుమార్... భారత రాజకీయాల్లో సుపరిచిత నాయకుడు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్దపీట వేసిన నేతగా పేరుంది. ఒక దశలో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నితీష్ పెద్దదిక్కుగా మారారు. భవిష్యత్ ప్రధానిగా పేరొందారు. అటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు నిమిత్త మాత్రుడిగా మారిపోయారు. ఓ చిన్న ప్రాంతీయ పార్టీ అధినేతగా మిగిలిపోయాడు. భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. అటు విపక్షాలు ఆయనను ఏమాత్రం విశ్వసించలేక పోతున్ానయి. ఇప్పుడు ఇటు మిత్రపక్షం భారతీయ జనతాపార్టీ కూడా ఆయనను నమ్మలేకపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.... ఆయన రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు.

గందరగోళంలో రాజకీయ జీవితం....

రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి. హత్యలు ఉండవన్నది ఒక నానుడి. అంటే ఎవరి రాజకీయ జీవితాన్ని వారే చేజేతులా పాడు చేసుకుంటారు. అంతే తప్ప ఇతరులు ఎవరూ దెబ్బతీయలేరు. ఇది నితీష్ కు చక్కగా వర్తిస్తుంది. ఒకప్పుడు మిస్టర్ క్లీన్ గా, బీహార్ అభివృద్ధి రూపకర్తగా, పదవులను విలువల కోసం తృణప్రాయంగా త్యజించిన నేతగా శిఖరాగ్రాన ఉండి అందరి అభిమానాన్ని ఆదరణ చూరగొన్న నితీష్ ఇప్పుడు రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. విపక్ష ఆర్జేడీతో మళ్లీ కలసి నడవలేక, మిత్రపక్షమైన బీజేపీతో మనస్ఫూర్తిగా మనలేక రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు నితీష్ ను రాజకీయంగా ఒంటరిని చేశాయి. ఆయన భవిష్యత్ ను రాజకీయంగా అయోమయానికి గురిచేసింది. వచ్చే ఎన్నికలు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అసలు అప్పటిదాకా ముఖ్యమంత్రి పీఠం ఉంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నితీష్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మిస్టర్ క్లీన్ గా......

భక్తియార్ పూర్ లో 1951 మార్చి 1న జన్మించిన నితీష్ విద్యుత్తు శాఖలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. పాట్నాలోని nit (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ చదివిన ఆయన విద్యుత్తు శాఖ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయ అరగేట్రం చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, బీహార్ మాజీ ముఖ్యమంత్రులు సత్యేంద్ర నారాయణ సిన్హా, కర్పూరీ ఠాకూర్, మాజీ ప్రధాని వీపీ సింగ్ స్ఫూర్తిగా రాజకీయాల్లో పనిచేశారు. 2005 నుంచి 2014 వరకూ సుదీర్ఘకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో వ్యవసాయశాఖ, రైల్వేశాఖ మంత్రిగా వ్యవహరించారు. గైసాల్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ 1999 ఆగస్టులో రాజీనామా చేసి నైతిక విలువలకు పెద్దపీట వేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. బాలికలకు సైకిళ్లు, మధ్యాహ్న భోజన పథకం, భారీ ఎత్తున ఉపాధ్యాయులు నియామకంతో పాఠశాలల్లో డ్రాప్ అవుట్లను బాగా తగ్గించగలిగారు. అవినీతిని అణిచివేస్తూ, స్వయంగా ఎటువంటి ఆరోపణలకు తావు ఇవ్వకుండా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 17న రాజీనామా చేశారు. 2009లో 20 స్థానాలను సాధించిన పార్టీ 2014 ఎన్నికలలో కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. దీంతో రాజీనామా చేసి తన స్థానంలో జితిన్ రామ్ మాంజీని ముఖ్యమంత్రిని చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో మహాఘట్ బంధన్ ను ఏర్పాటు చేసి బీజేపీని మట్టికరిపించారు. లోక్ సభ ఎన్నికల్లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. వాస్తవానికి నాటి ఎన్నికల్లో లాలూ పార్టీ ఆర్జేడీకి 80, తన పార్టీ జేడీయూకి71 స్థానాలు లభించినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి ఆయన్నే ఎంపిక చేశారు. దీంతో అప్పట్లో ఆయన మోడీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదుగుతారని అందరూ భావించారు.

మోడీకి ప్రత్యామ్నాయంగా......

మోడీలాగానే బీసీ నేత కావడం, ఉత్తరాది నాయకుడు కావడం, మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఆయన ప్రధాని అభ్యర్థిత్వానికి ఉపకరిస్తాయని అనుకున్నారు. కానీ లాలూ జైలు శిక్ష, ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కేసులతో తన క్లీన్ ఇమేజ్ దెబ్బ తింటుందని భావించి క్రమంగా వారికి దూరమయ్యారు. బీజేపీకి దగ్గరయ్యారు. కేసుల కారణంగా తేజస్వీయాదవ్ రాజీనామా కోరడం, ఆయన తిరస్కరించడంతో నితీష్ రాజీనామా చేశారు. వెంటనే మరుసటి రోజు బీజేపీ మద్దతుతో 2017 జులై 27న రాష్ట్ర 36వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజుకు అది మంచి నిర్ణయమైనప్పటికీ అది ఇప్పుడు ఆయన రాజకీయ జీవితానికి పెను శాపంగా మారింది. బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీలు, దళితులు దూరమయ్యారు. లాలూను మోసగించారన్న ఉద్దేశ్యంతో యాదవులు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమికి ఇవి ప్రధాన కారణాలు. ఇటీవల జరిగిన అరారియా లోక్ సభ, జైహానాబాద్, భభువా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అరారియా, జెహనాబాద్ ఎన్నికల్లో ఆర్జేడీ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయారు నితీష్. ఇక తాజాగా ఈనెల 28న జరిగి జాకీహాట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి నితీష్ కు కొరవడుతున్న ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. తన పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఆయన సర్వశక్తులూ ఒడ్డారు. సగం మంది మంత్రులను ప్రచారంలోకి దింపారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొంతకాలం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ విపక్షాలు విశ్వసించే పరిస్థితి లేదు. రాజకీయంగా బలహీన పడ్డ నితీష్ అదే సమయంలో బీజేపీ బేరమాడే శక్తిని కోల్పోయారు. చివరికి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఆయన పరిస్థితి. ఇది స్వయంకృతాపరాధమే. అందువల్లే రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఇది నితీష్ కు చక్కగా వర్తిస్తోంది. గత ఏడాది బీజేపీతో కలవకుటే 2019 ఎన్నికల్లో విపక్షాల ప్రధాన అభ్యర్థిగా తెరపైకి వచ్చేవారేమో.....!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News