తెలుగింటి కోడలే షాక్ ఇచ్చేసింది .. జగన్ ఏం చేస్తారో

ఆంధ్రప్రదేశ్ కి కోరుకున్న విభజన కాదు. వద్దు మొర్రో అంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఆనాడు ప్రతీ వారూ కంట నీరు పెట్టారు. బంగారం లాంటి [more]

Update: 2019-06-27 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ కి కోరుకున్న విభజన కాదు. వద్దు మొర్రో అంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఆనాడు ప్రతీ వారూ కంట నీరు పెట్టారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేయవద్దు అని. అయినా మొండిగా అమలు చేసారు. దానికి ప్రతిఫలం అన్నట్లుగా ఏదో మొక్కుబడిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. నాటి యూపీయే సర్కార్ కి కూడా హోదా ఇవ్వాలని మనస్పూర్తిగా లేదు. అందుకే దిగిపోయే ముందు హడావుడి చేశారు. ఆ తరువాత వచ్చిన బీజేపీ సర్కార్ ఏం చేసిందన్నది గత అయిదేళ్ళ కధ అందరికీ తెలిసిందే. మరో మారు అక్కడ మోడీ బంపర్ మెజరిటీతో అధికారంలోకి వచ్చారు. ఇక ఇక్కడ జగన్ సీఎం అయ్యారు. జగన్ మొదటి రోజు నుంచే ప్రత్యేక హోదా అంటున్నారు. దానికి సమాధానం కూడా వెంటనే వచ్చేసింది.

హోదా వూసే లేదట :

ఏపీ సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. మేము ఇవ్వలేము, అసలు ఆ ప్రతిపాదన ఏదీ కూడా మా పరిశీలనలో లేదు. ఇదీ తెలుగింటి ఆడపడుచు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పిన మాట. లోక్ సభలో జేడీయూ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా ఈ జవాబు ఇచ్చారు. దీంతో మోడీ మొండితనం ఏంటన్నది మరో మారు లోకానికి తెలిసింది. ఏపీకి సంబంధించి జగన్ కి కూడా తెలిసొచ్చింది. హోదా వూసే లేదని చేతులు దులుపుకున్న కేంద్రంతో జగన్ ఏ విధంగా తలపడతారు అన్నది ఇపుడు చర్చగా ఉంది.

ఘర్షణ పడితే అంతే :

జగన్ కళ్ళ ముందు చంద్రబాబు ఎపిసోడ్ ఉండనే ఉంది. కేంద్రంతో ఘర్షణ పడి చంద్రబాబు సర్వం కోల్పోయారు. ఏడాది పాటు ధర్మ పోరాట దీక్షలు చేసినా కూడా జనం ఆదరించలేదు. దానికి కారణం నాలుగేళ్ల పాటు కేంద్రంతో ఉండడం ఓ కారణమైతే, పదే పదే హోదా విషయంలో మాట మార్చడం మరో కారణం. సరే ఇపుడు జగన్ వచ్చారు. ఆయన కేంద్రంలో సఖ్యతనే కోరుకుంటున్నారు. ఘర్షణని చూసిన జనం కూడా ఇదే కరెక్ట్ అంటున్నారు. మరి సఖ్యతగా ఉన్నా కూడా మోడీ హోదా ఇస్తారా అంటే లేదనే అంటున్నారు. మోడీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చేది లేదని అంటారు.

పైగా ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణంలో బీజేపీకి కొత్తగా పోయిందేమీలేదు. ఓ వైపు తెలుగుదేశం వీక్ అవుతోంది. ఆ ప్లేస్ ఎటూ ఖాళీగా ఉంది. కాబట్టి జగన్ తప్పులు చేస్తే బీజేపీ వైపే జనం చూస్తారని మోడీ నమ్మకం. ఇక హోదా ఇచ్చేసి జగన్ని పెద్దవాణ్ణి చేసి పదికాలాలు కుర్చీ మీద కూర్చోబెట్టాలన్న ఉద్దేశ్యాలు మోడీకి అసలు ఉండవు. పైగా ఏపీ కేంద్రం మీద ఇపుడు చాలా ఎక్కువగా అధారప‌డిఉంది, జగన్ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇదీ మోడీ ఆలొచన. మరి జగన్ కూడా హోదా విషయం పక్కన పెట్టి వ్యూహాత్మకంగా మిగిలిన విషయాలు సాధించుకుంటారా లేక గొడవలకు దిగుతారా అన్నది చూడాలి. జగన్ అయితే మాత్రం హోదాని అలా సజీవంగా ఉంచుతూనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికే మొగ్గు చూపవచ్చు.

Tags:    

Similar News