తెలుగింటి కోడలు తెగనమ్ముతోందిగా..?

అందుకే కోడలుకి కూతురికీ తేడా తెలుసుకోమని చెబుతారు. కూతురు ఇంటిపేరు మారినా కూడా పుట్టింటి మీద వ్యామోహం, ప్రేమ మాత్రం అలాగే ఉంటాయి. కోడలు అత్తింటకు వచ్చినా [more]

Update: 2021-02-20 05:00 GMT

అందుకే కోడలుకి కూతురికీ తేడా తెలుసుకోమని చెబుతారు. కూతురు ఇంటిపేరు మారినా కూడా పుట్టింటి మీద వ్యామోహం, ప్రేమ మాత్రం అలాగే ఉంటాయి. కోడలు అత్తింటకు వచ్చినా కూడా ఆ తీరే వేరుగా ఉంటుంది. ఇపుడు అచ్చమైన తెలుగింటి కోడలు విషయంలో ఈ రకంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆంధ్రుల కోడలు, మాజీ మంత్రి, గోదావరి జిల్లాలలో కీలక నేత మాజీ మంత్రి స్వర్గీయ పరకాల శేషావతారం వారి కోడలు. అంతే కాదు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సతీమణి. ఆమె మన దేశ ఆర్ధిక మంత్రిణి నిర్మలా సీతారామన్. ఆమె ఏపీ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నిక అయ్యారు. ఇలా అన్ని రకాలుగా బాంధవ్యాలు ఉన్నా కూడా నిర్మలమ్మ మాత్రం ఏపీ జనాల ప్రతీ విన్నపానికీ తూచ్ అనేస్తున్నారు.

ఏపీకి అన్యాయమే …?

దేశానికి ఆర్ధిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమె తలచుకుంటే భారీ ప్యాకేజి ఏపీకి దక్కుతుంది. విభజన‌ కష్టాలు కూడా తీరుతాయి. కానీ ఉన్నదే ఊడ్చెసే విధంగా మోడీ సర్కార్ చేస్తూంటే దానికి నిర్మలమ్మ శక్తి కొలదీ సహకరిస్తున్నారు అన్న విమర్శలు ఆంధ్రుల నుంచి వస్తున్నాయి. పోలవరం నిధుల విషయంలోనూ ఇలాగే ఉంది. విభజన హామీలూ ఎటూ గాలికి పోయాయి. ప్రత్యేక హోదా లేదు. ప్యాకేజి అంతకంటే లేదు. ఇక రైల్వే జోన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న తీరుగా సీన్ ఉంది. ఇపుడు తీరి కూర్చుని బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని నూటికి నూరు శాతం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా తెలుగు వారి కోడలు మాత్రం సైలెంట్ గా మోడీ సర్కార్ కి సహకరిస్తున్నారు తప్ప మరేమీ సాయం లేదు అని ఆంధ్రులు ఆగ్రహిస్తున్నారు అంటే అర్ధముందిగా.

తమిళనాడుకు మేలు….

ఇదే నిర్మలా సీతారామన్ తన పుట్టిల్లు అయిన తమిళనాడుకు మాత్రం బాగానే నిధుల వరద పారించుకున్నారు. అంతే కాదు, మెట్రో రైళ్ళతో సహా ప్రగతి గతిని మార్చేసే ప్రాజెక్టులను అక్కడ కేటాయించేలా చూసుకున్నారు. ఎంత అయినా పుట్టిల్లు. అది బాగానే ఉండాలి. కానీ అత్తవారిల్లు కూడా కొంతైనా కళకళలాడాలిగా. నిర్మలమ్మ ఆ విషయంలో మాత్రం చూసీ చూడనట్లుగానే ఉంటున్నారు. కేంద్రం వద్దకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎన్ని సార్లు వెళ్ళి విన్నపాలు చేసినా వాటిని బుట్టలోనే పడేస్తున్నారు అంటున్నారు. దీంతో తెలుగు వారి కోడలు పట్ల అంతా భగ్గుమంటున్నారు.

ఆశలు లేనే లేవు….

నిర్మలా సీతారామన్ ఆర్ధిక మంత్రిగా వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పటికి రెండు బడ్జెట్లు పూర్తిగా ప్రవేశపెట్టారు. ఏ ఒక్క బడ్జెట్ లో కూడా పొరపాటున కూడా ఏపీ గురించి లేదు. పైగా ఏపీని ఆదుకుంటామని నికరమైన హామీ కూడా లేదు. అంటే బీజేపీ పెద్దలు ఎలా చెబితే అలా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తున్నారు అంటున్నారు. తాను ఏపీ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించాను అని ఆమె గుర్తు చేసుకున్నా కూడా ఇంత నష్టం జరిగేది కాదు అన్నది మేధావుల మాట. మరి పేరుకు మాత్రమే బంధాలు, బంధుత్వాలు కలుపుకుని పెద్దల సభలో సీట్లు పట్టేసే ఈ బాపతు వారిని ప్రోత్సహించడం కూడా జగన్, చంద్రబాబు చేస్తున్న తప్పు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి నిర్మలమ్మ తాను ఎప్పటికీ తెలుగు వారి గోడు వినని కోడలినే అని మళ్ళీ మళ్లీ రుజువు చేసుకుంటున్నారు. అంతే.

Tags:    

Similar News