నమ్మకమైన నేతగా.. నిమ్మల జోరు పెరిగిందా..?

నిమ్మల రామానాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది విజ‌యం సాధించిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. నిన్న మొన్నటి వ‌ర‌కు కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్రమే [more]

Update: 2020-06-23 00:30 GMT

నిమ్మల రామానాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది విజ‌యం సాధించిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. నిన్న మొన్నటి వ‌ర‌కు కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్రమే ప‌రిమిత‌మైన నిమ్మల హ‌వా.. ఇప్పుడు పార్టీలోను, కీల‌క నిర్ణయాల్లోనూ కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. తాజాగా అసెంబ్లీ బీఏసీ స‌మావేశానికి ప్రధాన ప్రతిప‌క్షం త‌ర‌ఫున డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హోదాలో ఆయ‌న హాజ‌ర‌య్యారు. అంతేకాదు, పార్టీలోనూ ఆయ‌న‌కు ప్రాధాన్యం పెరిగింది. గ‌త ఏడాది జ‌గ‌న్ హ‌వాను త‌ట్టుకుని నిమ్మల రామానాయుడు విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌వాలో టీడీపీకి చెందిన మ‌హామ‌హులే చిత్తు చిత్తయ్యారు. అయినా నిమ్మల రామానాయుడు మాత్రం పాల‌కొల్లులో ఏకంగా 18 వేల పైచిలుకు భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత చంద్రబాబు ఆయ‌నకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ఇవ్వడంతో ఆయ‌న అధికార ప‌క్షంపై ప్రతి విష‌యంలోనూ పోరాటాలు చేస్తున్నారు.

పెరుగుతున్న ప్రాధాన్యం…..

డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ అయిన‌ప్పటి నుంచి నిమ్మల రామానాయుడు జ‌గ‌న్ ప్రభుత్వ నిర్ణయాల‌పై త‌న‌దైన శైలిలో దూకుడు ప్రద‌ర్శించారు. అనేక రూపాల్లోనిర‌స‌న వ్యక్తం చేశారు. నిత్యం నియోజ‌క ‌వ‌ర్గాల్లో ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ కార్యక్రమాల‌పై త‌న‌దైన శైలిలో నిర‌స‌న వ్యక్తం చేస్తూ.. అందరి దృష్టినీ ఆక‌ర్షించారు. అయిన‌ప్పటికీ.. అటు పార్టీలోను, ఇటు నిర్ణయాల్లోనూ నిమ్మల రామానాయుడుకు ఆశించిన రేంజ్‌లో రాష్ట్ర స్థాయిలో పార్టీ, ప్రతిప‌క్ష పాత్రలో కీల‌క పాత్ర పోషించే ఛాన్స్ ఇప్పటి వ‌ర‌కు ల‌భించ‌లేదు. అయితే, అనూహ్యంగా పార్టీలో కీల‌కంగా ఉన్న మ‌రో నాయ‌కుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఈఎస్ఐ కుంభ‌కోణానికి సంబంధించి ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలో నిమ్మల రామానాయుడుకు ప్రాధాన్యం పెరిగింది.

పార్టీ లైన్ దాటకుండా…..

నిర్మాణాత్మక రాజ‌కీయాలు చేయ‌డంలోను, నిర్మాణాత్మక విమ‌ర్శలు చేయ‌డంలోను నిమ్మల రామానాయుడుకు పేరుంది. దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంలో ఆయ‌న గుర్తింపు పొందారు. వ్యతిరేక ప‌రిస్థితుల‌ను కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని, ప్రజ‌ల ప‌క్షాన పోరు చేయ‌డంలోను ఆయ‌న త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. ఎక్కడా వివాదానికి తావులేకుండా.. ఏ స‌మ‌స్యనైనా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం చేయ‌డంలో ఆయ‌న త‌న‌కంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నారు. ఈ విష‌యంలో నిమ్మల రామానాయుడు స్టయిల్ డిఫ‌రెంట్. గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌నలో త‌న‌కు గుర్తింపు ల‌భించినా.. ల‌భించ‌క పోయినా.. పార్టీ లైన్ ప్రకారం ముందుకు సాగారు.

భవిష్యత్ పరంగా….

ఇక‌, ఇప్పుడు ఏడాది కింద‌టి వ‌ర‌కు కూడా ఆయ‌న‌కు పెద్దగా గుర్తింపు ల‌భించ‌లేదు. అయినా ఎక్కడా అసంతృప్తికి లోను కాకుండా ..పార్టీ త‌ర‌ఫున పోరాటాలు చేశారు. దీంతో ఇప్పుడు కీల‌కమైన నిర్ణయాలు, స‌మావేశాల‌కు చంద్రబాబు నిమ్మల రామానాయుడును సిఫార‌సు చేయ‌డం.. మున్ముందు మ‌రింత ప్రాధాన్యం పెంచుతుంద‌ని నిమ్మల అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి భ‌విష్యత్తులో నిమ్మల రామానాయుడు టాప్ లీడ‌ర్ అవుతార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక కాపు సామాజిక వ‌ర్గం నుంచి పార్టీలో చాలా దూకుడుగా ముందుకు వెళ్లడం కూడా ఆయ‌న‌కు క‌లిసి రానుంది. భ‌విష్యత్తులో టీడీపీ అధికారంలోకి వ‌స్తే నిమ్మల రామానాయుడుకు తిరుగులేని ప్రయార్టీ ఉంటుంద‌ని కూడా ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి నిమ్మల ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News