నిమ్మల పెడుతున్న డిమాండ్లు.. వింటే నవ్విపోరూ

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్యత‌ల‌ను చేప‌ట్టే విష‌యంలో ఇద్దరు కీల‌క నాయకులు పోటీ ప‌డుతున్నారు. నువ్వా-నేనా అంటూ బ‌హిరంగంగానే [more]

Update: 2020-08-07 15:30 GMT

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్యత‌ల‌ను చేప‌ట్టే విష‌యంలో ఇద్దరు కీల‌క నాయకులు పోటీ ప‌డుతున్నారు. నువ్వా-నేనా అంటూ బ‌హిరంగంగానే ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. దీంతో పార్టీలో ఈ ఇద్దరి విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని హిందూపురం పార్లమెంటు స్థానానికి పార్టీ ఇంచార్జ్‌ను నియమించాలని అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పదవుల కాక పుట్టిస్తోంది. బీసీ వర్గాలకు చెందిన నాయకులను అధ్యక్షులుగా నియమించాలని అధిష్టానం నుంచి సూచ‌న‌లు అందడంతో ఆ మేరకు ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.

పోటీలో నలుగురు…..

ఈ నేపథ్యంలో బలహీన వర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు ఆ పార్టీ ముఖ్య వర్గాల సమాచారం. హిందూపురం పార్లమెంటు పరిధిలో నలుగురి పేర్లు చంద్రబాబు వ‌ద్ద ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. వాస్తవంగా గ‌త 15 ఏళ్లుగా ఇక్కడ బాధ్యత‌లు నిమ్మల కిష్టప్పే చూసుకుంటున్నారు. ప‌దేళ్లుగా ఆయ‌న ఎంపీగానే ఉన్నారు. అయితే ఇప్పుడు నిమ్మల‌ను కొన‌సాగించాలా ? వ‌ద్దా ? అన్న ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంద‌ట‌. దీంతో ఇప్పుడు ఆశావాహులు తామున్నామంటే తామున్నామంటూ లైన్లోకి వ‌స్తున్నారు. వీరిలో ఇద్దరు నాయ‌కులు బ‌లంగా ఉన్నారు. హిందూపురం పార్లమెంటు ఇన్‌చార్జ్‌ పదవి కోసం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆసక్తి చూపుతున్నారు.

ఎమ్మెల్సీగా ఉంటూ…..

గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాష్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అధికార మార్పిడి జరిగి వైసీపీ కొలువుదీరిన నేపథ్యంలోనూ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ఇక‌, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నిమ్మల కిష్టప్ప ఆ పార్టీలో పనిచేస్తున్నారు. తన 26 ఏళ్ల వయస్సు నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో ఆయన అనేక పదవులు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోరంట్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై పశుసంవర్థక శాఖ మంత్రిగా పనిచేశారు.

ఇద్దరు బరిలో ఉండటంతో….

హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా రెండుసార్లు వ‌రుస‌గా ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయ‌న రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లోనూ ఆయన హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఆయన హిందూపురం పార్లమెంటు అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు కాకుండా మ‌రో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే, ప్రధానంగా నిమ్మల‌-తిప్పేస్వామిలు మాత్రం ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించి ఎలాగైనా ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

పుట్టపర్తి, పెనుకొండలపైనా…

అయితే ఇక్కడ నిమ్మల మ‌రో ప్లాన్‌కు కూడా తెర‌దీస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. హిందూపురం పార్లమెంటు ప‌గ్గాల‌తో పాటు కుదిరితే పెనుగొండ లేదా పుట్టప‌ర్తి అసెంబ్లీ సీట్లపై కూడా క‌న్నేశార‌ట‌. పుట్టపర్తిలో మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ రెడ్డి వ‌య‌స్సు పైబ‌డ‌డంతో పాటు గ‌తంలో ఉన్నంత యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంపై కూడా క‌న్నేశార‌ట‌. అటు పెనుగొండ‌లో పార్థసార‌థిని ఇబ్బంది పెట్టేలా పావులు క‌దుపుతున్నార‌ట‌. ఈ రెండు అసెంబ్లీ సీట్లతో పాటు హిందూపురం ఎంపీ సీటు… ఈ మూడింట్లో రెండు త‌న ఫ్యామిలీలోనే ఉండాల‌న్నట్టుగా నిమ్మల పావులు క‌దుపుతున్నార‌ట‌. చంద్రబాబు మాత్రం నిమ్మల విష‌యంలో ఆయ‌న కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు అంత‌ ఆస‌క్తితో లేర‌న్న టాక్ కూడా ఉంది.

Tags:    

Similar News