“శరణ్య”మా….. రణమా?…జగన్ పీకల్లోతు కోపంతో?

ఒక్కోసారి ఏదో తీగ లాగితే మరో చోట డొంక కదులుతుంది. ఇపుడు సరిగ్గా అదే జరుగుతోంది. జగన్ సర్కార్ కి, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2020-03-24 13:30 GMT

ఒక్కోసారి ఏదో తీగ లాగితే మరో చోట డొంక కదులుతుంది. ఇపుడు సరిగ్గా అదే జరుగుతోంది. జగన్ సర్కార్ కి, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అతి పెద్ద అగాధం ఏర్పడిపోయింది. అదెంతవరకూ అంటే ఏపీలో పని చేయాల్సిన ఈసీ పొరుగురాష్ట్రం వెళ్ళి కూర్చుకునేంతగా. ఇక ఆయన స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం వరకూ అంతా ఒప్పుకుంటున్నా తాను రాసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ ద్వారా జగన్ సర్కార్ మీద జల్లిన బురద. ఆ లేఖలో ఆయన వాడిన తీవ్ర పదజాలం వెరసి జగన్ కి పీకల్లోతు కోపం పెంచిందనే అంటున్నారు. దాంతో టార్గెట్ నిమ్మగడ్డ పేరిట ఇపుడు లోతైన దర్యాప్తు జరుగుతోందిట.

ఆమె విషయంలో…?

ఇక స్థానిక ఎన్నికలు ఇలా వాయిదా పడ్డాయో లేదో అలా నిమ్మగడ్డ కుమార్తె శరణ్య వ్యవహారం కూడా వెంటనే వెలుగు చూసింది. శరణ్య రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి మండలి అసోసియేట్ డైరెక్టర్ గా గత ఏడాది అక్టోబర్ వరకూ పనిచేశారట. అంటే ఆమె జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల వరకూ ఆ పదవిలో కొనసాగారన్న మాట. ఇక ఆర్ధిక అభివృద్ధి మండలి విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి విదితమే. దాంతో మొత్తం మండలి వ్యవహారాలు అన్నీ చూసే కీలక అధికారి జాస్తి కిషోర్ ని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయన మీద క్యాట్ సస్పెన్షన్ ఎత్తి వేసి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళేందుకు అనుమతించినా దర్యాప్తు మాత్రం సాగుతోంది.

జోక్యమెంత…?

ఈ అవినీతి విషయంలో నిమ్మగడ్డ శరణ్య జోక్యం, ప్రమేయం ఎంత అన్నది ఇపుడు వైసీపీ సర్కార్ కి కావాల్సిఉంది. ఎందుకంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మండిపోతున్న ప్రభుత్వానికి ఇపుడు శరణ్య వ్యవహారం ఆయుధంగా మారుతోంది అంటున్నారు. ఇప్పటికే ఆర్ధిక మండలిలోని అవకతవకలు వెలికి తీసిన సీఐడీ లోతుల్లోకి వెళ్తోంది. శరణ్య కేవలం సింగపూర్ లోని ఒక కార్పోరేట్ సంస్థ కు మామూలు లాయర్ మాత్రమే. ఆమెను 2016లో ఆర్ధిక మండలిలో అసోసియేట్ గా తీసుకువచ్చారు. నెలకు రెండు లక్షల జీతం కూడా ఇచ్చేలా నాటి బాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదే టైంలో నిమ్మగడ్డ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానధికారిగా నియమితులు కావడం గమనార్హం. అంటే నిమ్మగడ్డ పలుకుబడితోనే శరణ్యకు ఈ పదవి దక్కిందన్నది తెలిసిపోతోదని అంటున్నారు.

ఉచ్చు బిగిసేనా…?

ముందు అసోసియేట్ గా చేరినా తరువాత రోజుల్లో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి మండలి అసోసియేట్ డైరెక్టర్ గా కూడా శరణ్య ప్రమోషన్ పొందింది. ఇలా అమె అనూహ్యంగా ఈ బోర్డులో కీలకం కావడంపైనా కూడా వైసీపీ సర్కార్ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లుగా సమాచారం. ఇక ఆమె ఈ హోదాలో అనేక దేశాలు తిరిగారు. పెట్టుబడులు ఏం తెచ్చారు అన్నది పక్కన పెడితే బోర్డులో జరిగిన అవినీతి, అవకతవకలకు ఆమె ఎంతవరకూ బాధ్యులు అన్నది కూడా సీఐడీ ఇపుడు దృష్టి సారించిందని అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ అధికారి నుంచి రాజకీయ అవతారంగా మారి సర్కార్ పైన బురద జల్లేలా రాసినట్లుగా చెబుతున్న లేఖ ఇపుడు శరణ్యకు ఉచ్చుని బిగించే విధంగా మారిందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News