నిమ్మగడ్డ చేతిలో బలయిపోయినట్లేనా?

ఇపుడు బంతి ఎన్నికల సంఘం చేతిలో ఉంది. జగన్ ఎంత ఆగ్రహంగా అమాయకంగా ప్రశ్నించినా కూడా ఎన్నికల కమిషనర్ అధికారాలను ఆయన ఎప్పటికీ నిలదీయలేరు. ఇపుడు ఏపీలో [more]

Update: 2020-03-16 05:00 GMT

ఇపుడు బంతి ఎన్నికల సంఘం చేతిలో ఉంది. జగన్ ఎంత ఆగ్రహంగా అమాయకంగా ప్రశ్నించినా కూడా ఎన్నికల కమిషనర్ అధికారాలను ఆయన ఎప్పటికీ నిలదీయలేరు. ఇపుడు ఏపీలో సాధారణ పాలన మాత్రమే జగన్ చూడాల్సి ఉంటుంది. సూపర్ పవర్ గా ఎన్నికల సంఘం ఉంది. ఆఖరుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కూడా జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమతి తీసుకోవాలి. సుమారు రెండు నెలల పాటు ఏపీలో ఎన్నిక కోడ్ అమల్లో ఉంటుంది. అది ఉంది అంటే సూపర్ పవర్ అధికారాలు అన్నీ కూడా ఎన్నికల సంఘానివే. అంటే నిమ్మగడ్డ వారివే.

ఎన్నో సందేహాలు….

ఇక తాపీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా మీటింగ్ పెట్టినా వైసీపీ పక్కలో బాంబు వేశారు. ఎన్నికలను వాయిదా వేశామని శుభ వార్త మెల్లగా చెప్పారు. ఆరు వారాల పాటు ఎన్నికలు ఉండవు అని చెబుతూనే అపుడు కూడా పరిస్థితులు అనుకూలిస్తేనే అంటూ చిన్న మెలిక పెట్టారు. వైసీపీ నేతలు దాన్ని ఇప్పటిదాకా పట్టించుకున్న దాఖాలాలు లేవు. అదే ఇపుడు ఏపీలోని విపక్షాలకు వరంగా మారబోతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినదాని ప్రకారం మే మొదటి వారంలో ఎన్నికలు పెట్టాలి. అపుడు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవంటూ మళ్ళీ వాయిదా వేయవచ్చు ఆ విచక్షణాధికారం ఎపుడూ ఎన్నికల సంఘానికి ఉంది. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది.

మొదటికేనా…?

ఇలా వాయిదాల ప్రహసనం నడిపిన తరువాత మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దు అని కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ వంటివి కోరుకుంటున్నదే అన్నమాట. అదే కనుక జరిగితే ఇప్పటికంటే రెట్టింపు జగన్ తో పాటు, వైసీపీ మంత్రులు విచారించాల్సిఉంటుంది. పెడబొబ్బలు పెట్టాల్సివుంటుంది. ఎందుకంటే ఈ ఏకగ్రీవాలు, గెలుచుకున్న జిల్లాలూ అన్నీ ఒక్క దెబ్బకు హుష్ కాకీ అయిపోతాయి. చంద్రబాబు, పవన్, జీవీఎల్ వంటి వారు కోరస్ గా కోరుతున్నది అదే. మరి వాయిదా అంటూ నిన్నటివరకూ వీరు కోరారు. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానిచ్చేశారు, ఇపుడు ఏకంగా ఎన్నికల రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ముచ్చట కూడా ఈసీ తీర్చే రోజు తొందరలోనే ఉందని అంటున్నారు.

కేంద్ర బలగాలట……

ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల ఆద్వర్యంలో జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏపీలోని పోలీసుల మీద నమ్మకం లేదని ఆయన చెప్పేస్తున్నారు. బాబు కోరుకుంటున్నట్లుగా కాకపోయినా ఈసారి కొత్త షెడ్యూల్ తో జరిగే ఎన్నికలు మాత్రం కట్టుదిట్టంగా జరిపించే అవకాశాలు ఉండేలా ఉన్నాయి. అంటే ఏపీలో అధికార వైసీపీ కూడా ఒక రాజకీయ పార్టీగానే పాల్గొనేలా చూస్తారన్న మాట. మొత్తంగా చూస్తూంటే బీజేపీ చేతిలోకి ఈ వ్యవహారం వెళ్ళిపోయేలా ఉంది. మొత్తానికి గెలిచిన జగన్, ఓడిన బాబు అందరూ కేంద్రం చేతిలోనే ఉంటారన్న మాట. భలే రాజకీయమే.

Tags:    

Similar News