నిమ్మగడ్డ “పంచాయతీ” లో కిరికిరి తప్పదా?

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం [more]

Update: 2021-01-14 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికల నియమావళి అమలులో ఉందంటున్నారు. షెడ్యూల్ ను సింగిల్ బెంచ్ రద్దు చేసింది కాబట్టి ఎన్నికల నియమావళి ప్రశ్న ఉత్పన్నం కాదన్నది ప్రభుత్వం వాదన. ఈ వాదనలకు ఈ నెల 18వ తేదీన హైకోర్టు బ్రేక్ చెప్పే అవకాశాలున్నాయి. 18వ తేదీన హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

పంతాలకు పోతుండటంతో….

ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, అటు ప్రభుత్వం ఇద్దరూ పంతాలకు పోతున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల పాటు కొనసాగనుంది. దీంతో ప్రభుత్వం కూడా కరోనా వ్యాక్సిన్ గురించే హైకోర్టులో ప్రధానంగా తన వాదనను విన్పించనుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పట్లో ఎన్నికలు వద్దని, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు.

ఎన్నికలు జరగాల్సిందేనంటున్న….

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలు జరగాల్సిందేనంటున్నారు. ఒకసారి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎన్నికలను ఆపడం కుదరదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉదహరిస్తున్నారు. ఆయన ఇటీవల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కూడా కలసి తన ఆలోచనను చెప్పుకున్నారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు.

కోర్టు తీర్పు ఎలా వచ్చినా…?

ప్రభుత్వ సహకారం లేకపోతే ఎన్నికల నిర్వహణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కష్టమే. అయినా సరే ప్రభుత్వ ఆలోచనతో విభేదించి ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండగా ఎట్టిపరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదో ఒక కిరికిరి పెట్టకుండా ఉండరన్నది వాస్తవం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు.

Tags:    

Similar News