లోకల్ ఫైట్ ఇక ముగిసినట్లేనా…?

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఒక ప్రహసనంగా తయారయ్యాయి. 2018 ఆగస్ట్ లో పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థలకు మరో ఆరు నెలల పాటు జగన్ [more]

Update: 2021-01-12 14:30 GMT

ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఒక ప్రహసనంగా తయారయ్యాయి. 2018 ఆగస్ట్ లో పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థలకు మరో ఆరు నెలల పాటు జగన్ సర్కార్ స్పెషల్ ఆఫీసర్ల పాలనను పొడిగించడంతో ఇక ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే ఎన్నికలు జరుగుతాయి అని అంతా అర్ధం చేసుకుంటున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరగాలి అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోక తప్పదు. ఆయన పదవీ కాలం మెల్లగా కరిగిపోతోంది. జనవరి పండుగలతో గడిస్తే ఫిబ్రవరి మార్చి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల హోరుతో సాగిపోతాయి. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ అయిపోకతప్పదు.

అదీ మాస్టర్ ప్లాన్ ….

ఇక జగన్ తాను ఎంచుకున్న వారికే కొత్తగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా బాధ్యతలు అప్పగిస్తారన్నది వాస్తవం. ఆ మీదట అన్ని రకాలుగా అనుకూల వాతావరణం చేసుకుని మరీ ఈ ఏడాది ఆగస్ట్ సెప్టెంబర్ నెలల మధ్య స్థానిక ఎన్నికలను నిర్వహిస్తారు అని ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం. తొలుత వేసవిలో ఎన్నికలు అన్నారు కానీ అవి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే నెలలు. ఓ వైపు ఎండలు, మరో వైపు విద్యుత్, నీటి కష్టాలతో జనం ఇక్కట్లు పడుతూంటే ఎన్నికలు పెడితే పూర్తిగా రివర్స్ అవుతారు. అందుకే వర్షాలు బాగా పడి అంతా హుషార్ ఉన్న సీజన్ లోనే ఎన్నికలు అని అంటున్నారు.

పాతిక జిల్లాలతోనే…

ఇక ఇపుడున్న పద్ధతిలో ఎన్నికలు జరగవు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏపీలో పదమూడు జిల్లాలు ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని పాతిక జిల్లాలు చేయాలని జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. ఆ విధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే కొత్తగా మరో 12 జిల్లా పరిషత్తులు కూడా వస్తాయి. వాటికి కనుక ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయాల్లోనూ భారీ మార్పులు వస్తాయి. పార్టీల బలాబలాలు మారి కొత్త సమీకరణలు కూడా చోటు చేసుకుంటాయి. మొత్తానికి టీడీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చేయడానికి కొత్త జిల్లాలను ముందుకు తెచ్చి మరీ పరిషత్తు పీఠాలను అన్నీ వైసీపీ ఖాతాలో వేసుకోవడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అంటున్నారు.

పదవులే పదవులు ….

మరో వైపు పార్టీలో చాలా మంది నాయకులకు పదవులు లేవు. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే పార్టీ బలం గ్రాస్ రూట్ లెవెల్ వరకూ వెళ్లడమే కాకుండా కష్టపడి పనిచేసిన వారికి పెద్ద ఎత్తున పదవులు వస్తాయి. ఇక కొత్తగా జెడ్పీ పీఠాలు కూడా ఎక్కువ మందికి వస్తాయి. అందుకే కొత్త జిల్లాల నినాదాన్ని జగన్ ఎంచుకున్నారు అంటున్నారు. అదే విధంగా ప్రజలకు మొత్తం సంక్షేమ పధకాలను పంపిణీ చేసిన మీదటనే ఎన్నికలకు వెళ్తే పూర్తి ప్రయోజనాలు ఉంటాయని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ విధంగా కనుక ఆలోచించుకుంటే మాత్రం ఈ ఏడాది చివరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగుతుంది అంటున్నారు. మొత్తానికి జగన్ తాను అనుకున్న విధంగానే ముహూర్తం టైం ఫిక్స్ చేసి మరీ లోకల్ ఫైట్ లోకి దిగిపోతారని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అప్పటికి రిటైర్ అవ్వక తప్పదు.

Tags:    

Similar News