అప్పుడయితే… నిమ్మగడ్డ ఇలాగే చేసేవారా ?

నిజంగా ఇది జగన్ కి ఘోర అవమానమే. రాజకీయంగా ఆయనకు వ్యూహాలు చేతకావని తెలిసి మరీ చంద్రబాబు తెర వెనక వేసిన ఎత్తుకు వైసీపీ సర్కార్ మొత్తం [more]

Update: 2020-03-18 06:30 GMT

నిజంగా ఇది జగన్ కి ఘోర అవమానమే. రాజకీయంగా ఆయనకు వ్యూహాలు చేతకావని తెలిసి మరీ చంద్రబాబు తెర వెనక వేసిన ఎత్తుకు వైసీపీ సర్కార్ మొత్తం పరువు పోయింది. సాధారణంగా రాజకీయాల్లో జరిగేదేంటి. అధికార పక్షం ఎన్నికలను జరిపించగలదు, వాయిదా వేయగలదు, విపక్షాలు డిమాండ్ మాత్రమే చేయగలవు. కానీ ఇక్కడ జరిగిందేంటి. ఏకంగా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఓ శుభోదయాన స్థానిక ఎన్నికలు రద్దు అని చెప్పి అధికార పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇది నిజంగా రాజ్యంగబధ్ధమైన ఓ వ్యవస్థ చేయాల్సిన పనేనా.

కలసి నడవాలిగా….

ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి నాలుగేళ్ళ క్రితం నియమితులయ్యారు. ఆయన్ని చంద్రబాబు ఏరి కోరి తెచ్చిపెట్టారని వైసీపీ ఆరోపణలు పక్కన పెట్టినా ఓ రాజ్యాంగ బద్ధ సంస్థ అధినేతగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయాల్సిన పనులు చేశారా అన్నది ఇక్కడ ప్రశ్నలు. ఎన్నికల సంఘం కేవలం ఓ సాధనంగా మాత్రమే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ అంతా నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అలా ప్రభుత్వంతో కలసి ఈసీ ప్రతీ అడుగూ వేయాల్సిఉంటుంది. ఓ విధంగా ఈసీకి ప్రత్యేక అధికారాలు ఉన్నాయనుకున్నా అవన్నీ ప్రభుత్వంతో కలసి పంచుకుంటేనే అర్ధం పరమార్ద్ధం. మరి నిమ్మగడ్డ ఆ పని చేశారా అంటే లేదని జవాబు వస్తుంది.

బాబు ఉండి ఉంటే…?

జగన్ సీఎం అని అంత తేలిగ్గా తీసుకున్నారో మరేమో కానీ ఒక ముఖ్యమంత్రికి చెప్పకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా అసాధరణ నిర్ణయం తీసుకోవడం ఈసీకి తగునా అని మేధావుల నుంచి, నిపుణుల నుంచి కూడా వస్తున్న ప్రశ్న. సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పు వెలువరించింది. అందులో ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఈసీకి ఉందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఆ నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టంగా పేర్కొంది. మరి ఇక్కడ నిమ్మగడ్డ కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ అయినా చేయకుండా హడావుడిగా పని కానిచ్చేశారు. మరి బాబు ముఖ్యమంత్రిగా ఇపుడు ఉండి ఉంటే ఆయనకు చెప్పకుండా ఇంతటి సాహసం నిమ్మగడ్డ చేసేవారా. చేస్తే బాబు ఇలాగే ఊరుకుని సుద్దులు చెప్పగలరా. జగన్ కి పదింతలు రచ్చ చేసి పారేయరూ.

పోలిక ఏంటి …?

ఇతర రాష్ట్రాలో ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అటువంటిది ఒడిషా, పశ్చిమ‌ బెంగాల్లో ఎన్నికలు వాయిదా వేశారని అంటూ చెబుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి రాసిన లేఖలో సమర్ధించుకున్నారని అంటున్నారు. ఒకవేళ అక్కడ ఎన్నికలు జరపరాదు అని ఈసీ నిర్ణయించినా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని సంప్రదించకుండా చేస్తుందా. నవీన్ పట్నాయక్ ని అడగకుండా ఒడిషా ఈసీ కదులుతుందా? అదే జరిగితే వారు చూస్తూ ఊరుకుంటారా? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలే.

చిత్తశుద్ధి ఇదేనా…?

రాజ్యాంగం హక్కులు అంటే ఇచ్చి పుచ్చుకోవడం. పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగడం. అలా చేయకుండా నిమ్మగడ్డ రాజ్యాంగ విలువలను పతనం చేశారనే అంటున్నారు నిపుణులు. ఆయన చిత్తశుద్ధి, లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఎలా ఉందో 2018 నుంచి ఎన్నికలు జరపకపోయినా బాబుని అడగకుండా మౌనం వహించినపుడే తెలిసిందని వైసీపీ నేతలు అంటున్న దాంట్లోనూ వాస్తవం ఉంది. ఏది ఏమైనా జగన్ ని ముఖ్యమంత్రిగా నేను గుర్తించను అని మాట వరసకు పవన్ అంటే చేతల్లో నిమ్మగడ్డ, చంద్రబాబు నిరూపించారని వైసీపీ నేతలు మధనపడుతున్నారు.

Tags:    

Similar News