నిమ్మగడ్డ గట్టిగా డిసైడ్ అయినట్లున్నారే ?

కలికాలపు రాజకీయాల మహిమ కాకపోతే వ్యవస్థలలో కూడా అవి చొచ్చుకుపోయి పచ్చిగా వికృతరూపాన్ని చూపించడం అంటే ఇదేనేమో. అంతా రాజకీయం అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. నిజానికి ఈ [more]

Update: 2020-10-30 02:00 GMT

కలికాలపు రాజకీయాల మహిమ కాకపోతే వ్యవస్థలలో కూడా అవి చొచ్చుకుపోయి పచ్చిగా వికృతరూపాన్ని చూపించడం అంటే ఇదేనేమో. అంతా రాజకీయం అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. నిజానికి ఈ దేశంలో ఏనాడూ ఎరగని పరిణామాలు అనేకం జగన్ పాలనలో చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ జగన్ ప్రభుత్వం మెతకతనాన్ని చూసుకునా లేక ఆవేశమే తప్ప ఆలోచన లేని సర్కార్ దూకుడు విధానాలే చాన్స్ ఇస్తున్నాయా అన్నది తెలియదు కానీ అన్ని వ్యవస్థలు అవ్యవస్థలుగా మారడాన్ని అంతా చూస్తున్నారు. నిజానికి ఎన్నికల నిర్వహణాధికారం రాజ్యాంగ సంస్థగా ఎన్నికల కమిషన్ కి ఉండవచ్చు కాక కానీ దానికి ప్రభుత్వ సహకారం తప్పనిసరి. లేకపోతే ఎన్నికలు నిర్వహించగలరా అన్నది మౌలికమైన ప్రశ్న.

సామరస్యమేదీ …?

ఆది నుంచి ఎన్నికల కమిషన్ కి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద వివాదమే చెలరేగుతోంది. మార్చి 15 తరువాత బాహాటం అయిపోయింది. అనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల క్రతువులో ఫుల్ బిజీగా ఉంది. ఒక రకమైన ఎన్నికల వేడి వాతావరణం రాష్ట్రంలో ఉంది. మరి ఎవరినీ సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను నాడు అకస్మాత్తుగా వాయిదా వేశారు. దీని మీద దేశ అత్యున్నత న్యాయస్థానం నాడు ఇదే విషయమై ప్రశ్నించింది కూడా. తిరిగి ఎన్నికలు నిర్వహించే విషయంలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని కూడా సూచించింది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాపీగా మరో వివాదానికి తెర తీశారని విమర్శలు అయితే వస్తున్నాయి.

చికాకు పెడతారా…?

ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయిదు నెలలు ఆ సీట్లో ఉంటారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే అది సుదీర్ఘ సమయమే. ఆయన ఎన్నికలకు సై అంటూ ఉత్సాహపడితే ఆపడం ప్రభుత్వానికి ఇబ్బందే కాదు, అదొక రకం కొత్త పోరాటానికి దారితీస్తుంది. నిమ్మగడ్డ అఖిలపక్ష మీటింగునకు వైసీపీ గైర్హాజరు అయింది. పైగా ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిమ్మగడ్డ విషయంలో చేసిన కామెంట్స్ చూస్తే ఇంకా పచ్చిగానే వ్యవహారం ఉన్నట్లుగా ఉంది. దానికి తోడు ఇద్దరు మంత్రులు కొడాలి నాని, మేకపాటి గౌతం రెడ్డి వంటి వారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు రెడీగా ఇపుడు లేదు అని చెప్పేశారు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి వచ్చి హడావుడి పడుతున్నారంటే కచ్చితంగా ఇది మార్చి నాటి కధకు రెండవ భాగంగానే చెప్పుకోవాలి అంటున్నారు.

రాజీ లేదుగా…?

అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కానీ, ఇటు రాష్ట్ర పెద్దలకు కానీ ఎవరు పట్టుదలలు వారివి అన్నట్లుగానే ఉంటున్నారు. నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలకు పోయేది లేదని వైసీపీ సర్కార్ గట్టిగా నిర్ణయించుకున్నట్లుగానే కనిపిస్తోంది. మార్చి చివరి వరకూ నిమ్మగడ్డ ఉంటారు. ఇక నిమ్మగడ్డ తాను ఊరికే సీట్లో కూర్చుని ప్రయోజనం ఏంటి అందుకే స్థానిక ఎన్నికలు పెట్టడానికే సిద్ధపడుతున్నారు. ఆ విషయంలో అమీ తుమీ తేల్చుకోవడానికి ఆయన డిసైడ్ అయినట్లుగా ఉన్నట్లున్నారు. ఈ పేచీ ఇప్పట్లో తెమిలేలా లేదు. మరో సుదీర్ఘ పోరాటానికే ఇది దారి తీసేలా ఉంది. న్యాయస్థానాలే ఈ విషయంలో తగిన సూచనలు ఇస్తే తప్ప ఇది ఎంతదాకా అయినా సాగే అవకాశాలే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News