నిమ్మగడ్డ అందుకే అలా చేశారా?

రాష్ట్ర ఎన్నిలక ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. పైగా న్యాయస్థానానికి జవాబు [more]

Update: 2020-09-08 05:00 GMT

రాష్ట్ర ఎన్నిలక ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి. పైగా న్యాయస్థానానికి జవాబు చెప్పుకోవాల్సిన స్థితి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కార్యాలయం నుంచి సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు తమపై పెట్టిన కేసుల విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయనను తొలగించి…..

నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదయింది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సాంబమూర్తిని సీఐడీ పోలీసులు విచారించి ఆధారాలను సేకరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన వెంటనే ప్రభుత్వం ఆయనపై విమర్శలు ప్రారంభించింది. వైసీపీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కులం పేరిట దూషించింది. దీంతోపాటు ఆయనను పదవి నుంచి తొలగించి కనగరాజ్ ను నియమించింది.

న్యాయపోరాటంలో…..

దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈలోగా తనకు ప్రాణహాని ఉందని వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. ఈ లేఖపై తొలినాళ్లలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించలేదు. ఇది వివాదం కావడంతో తానే లేఖ రాశానని చెప్పారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ లేఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారయందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

కేసుల్లో ప్రభుత్వ జోక్యం….?

ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాలతో తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పుడు తనపైనా, సిబ్బందిపైనా నమోదయిన కేసులు నిలిపివేయాలని హైకోర్టు ను ఆశ్రయించి ఆయన విజయవంతమయ్యారు. వచ్చే ఏడాది మార్చి వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉంటారు. ప్రభుత్వం అప్పటి వరకూ తనను ఏమీ ఇబ్బంది పెట్టకుండా, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఆటంకం కల్గించకుండా ఉండేందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు న్యాయ పరిధిలో సీఐడీ కేసు ఉండటంతో ప్రభుత్వం జోక్యం ఉండదు. నిమ్మగడ్డ ప్రభుత్వం పట్ల చాలా కూల్ గానే రూడ్ గా వెళుతున్నట్లు అర్ధమవుతుంది.

Tags:    

Similar News