మరో సారి కరోనా హెల్ప్ చేస్తుందా…?

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఎపుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో అన్ని ఎన్నికలూ ఒకే నెలలో జరిపించడానికి వైసీపీ సర్కార్ [more]

Update: 2021-03-22 05:00 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో ఎపుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తున్నాయి. గత ఏడాది మార్చిలో అన్ని ఎన్నికలూ ఒకే నెలలో జరిపించడానికి వైసీపీ సర్కార్ సన్నద్ధం అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాటిని నిర్వహించడానికి పచ్చ జెండా ఊపేసింది. అయితే మధ్యలో కరోనా వచ్చి కధను అడ్డం తిప్పేసింది. అయితే దీని మీదనే వైసీపీ సర్కార్ కి ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. తెలుగుదేశానికి అనుకూలం చేయడానికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను హఠాత్తుగా ఆపేశారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది.

అనుమానాలుగా…..

అయితే ఆ వాదనను మొదట రాజకీయ విమర్శలుగానే చూసిన జనం కధ ముందుకు సాగే కొద్దీ ఇందులో ఏదో మతలబు ఉందని అనుమానపడ్డారు కూడా. ఇక ఎన్నికలు వద్దు అన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరువాత పంతం పట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయ్యారు. దాని మీద కూడా రచ్చ రచ్చ అయినా చివరికి కోర్టు తీర్పుతో ప్రభుత్వం దిగి వచ్చింది. అలా పంచాయతీలు, మునిసిపాలిటీల ఎన్నికలు సాఫీగా సాగిపోయాయి. కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం నిలిచిపోయాయి. ఆ రెండు ఎన్నికలను దూకుడుగా నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికల విషయంలో మాత్రం ఫుల్ సైలెంట్ అయిపోయారు.

ఇప్పట్లో జరిగేనా…?

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ప్రివిలేజ్ నోటీసులను ఇవ్వడం ద్వారా వైసీపీ బాణం వేస్తే ఆయన తాను గవర్నర్ కి రాసిన లేఖలు లీక్ అవుతున్నాయంటూ ఏకంగా సీబీఐ విచారణ కోసం కోర్టుకెక్కారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా పరిషత్ ఎన్నికలు జరవవని తేలిపోయింది. ఇక వైసీపీ సర్కార్ మరో కొత్త అధికారిని ఎంపిక చేసి గవర్నర్ ద్వారా నియామకం చేయించుకోవాలి. ఆయన హయాంలోనే పరిషత్ ఎన్నికలు జరగాలి. దానికి ఎంతో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కరోనా దేశంలో పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.

అదే లాభమా…?

ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలలో వైసీపీకి దక్కిన ఏకపక్ష ఫలితాలతో తల బొప్పి కట్టిన టీడీపీకి పరిషత్ ఎన్నికలు వాయిదా పడడమే కావాలని అంటున్నారు. ఆ ఎన్నికలు ఎంత లేట్ అయితే అంత వైసీపీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. దాంతో ఏపీలో కొన్ని అయినా జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకోవచ్చు అన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు చెప్పి పరిషత్ ఎన్నికలు వాయిదా వేయడం వెనక కుట్ర ఉందని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా గత ఏడాది కరోనాతో మొత్తం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇపుడు పరిషత్ ఎన్నికలు కనుక వెనక్కి జరిగితే వైసీపీకి మళ్ళీ ఇబ్బందులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News