లీకు వీరులెవ‌రు ? వారిపనేనా? అనుమానమేనా?

గ‌వ‌ర్నర్‌కు తాను రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు.. ఇత‌రత్రా అంశాలు.. మీడియాకు చేర‌వేస్తున్నార‌ని.. ఇవేవీ బ‌హిరంగ లేఖ‌లు… లేదా స‌మాచారం.. కాద‌ని.. సో.. వీటిపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని [more]

Update: 2021-03-21 12:30 GMT

గ‌వ‌ర్నర్‌కు తాను రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు.. ఇత‌రత్రా అంశాలు.. మీడియాకు చేర‌వేస్తున్నార‌ని.. ఇవేవీ బ‌హిరంగ లేఖ‌లు… లేదా స‌మాచారం.. కాద‌ని.. సో.. వీటిపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతూ.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్‌.. హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. అంతేకాదు.. త‌న పిటిష‌న్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌ను ప్రతివాదులుగా చేర్చడం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

ఎలా బయటకు వస్తుంది….?

నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ కేసు వేసిన నేప‌థ్యంలో గ‌వ‌ర్నర్ పేషీకి సంబంధించిన స‌మాచారం ఎవ‌రు లీకు చేస్తున్నారు ? ఎలా బ‌య‌ట‌కు వ‌స్తోంది ? అనే విష‌యాలు చ‌ర్చకు దారితీశాయి. ఇక‌, దీనిపై వైసీపీ నాయ‌కులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎవ‌రు ఇది చేశారు ? ఎందుకు చేశారు ? అనే విష‌యాలపై చ‌ర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఓ సీనియర్ మంత్రి చుట్టూ వీరి చ‌ర్చలు తిరుగుతున్నాయి. గ‌వ‌ర్నర్ పేషీ నుంచి స‌మాచారం రాబ‌ట్టేందుకు ఉన్న సోర్స్‌.. అనంత‌ర ప‌రిణామాలు.. వంటివి కూడా వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చగా మార‌డం గ‌మ‌నార్హం.

సీఎంఓకు నేరుగా….

కొంద‌రు నాయ‌కులు.. దూర దృష్టితో గ‌వ‌ర్నర్ పేషీలో ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క అధికారుల‌ను నియ‌మించారనేది వీరి చ‌ర్చల సారాంశం. వీరు నేరుగా సీఎంవోకే స‌ద‌రు స‌మాచారం చేర‌వేస్తున్నార‌ని.. కొన్నాళ్లుగా గుస‌గుస వినిపిస్తోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ కేసు నిల‌బ‌డేది కాద‌ని కూడా అంటున్నారు. గ‌వ‌ర్నర్ పేషీ నుంచి స‌మాచారం లీకైంద‌ని చెప్పడానికి నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ వ‌ద్ద ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌లోనే కొంద‌రు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అక్కడి నుంచి కూడా లీకులు సాగి ఉండొచ్చన్న వాద‌న ఉంది.

ఆయన కార్యాలయం నుంచే….?

ఈ నేప‌థ్యంలో నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ వాద‌న‌కు బ‌ల‌మైన సాక్ష్యాలు ల‌భించే అవ‌కాశం లేద‌ని భావిస్తున్న వైసీపీ నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. నిమ్మగ‌డ్డ రమేష్ కుమార్ మాత్రం గ‌వ‌ర్నర్ కార్యాల‌యాన్ని టార్గెట్ చేసినా.. ప్రభుత్వ వ‌ర్గాలు మాత్రం.. నిమ్మగ‌డ్డ అంటే ఇష్టం లేని కొంద‌రు ఎన్నిక‌ల సంఘంలోని దిగువ సిబ్బందే వీటిని లీక్ చేసి ఉంటార‌ని చెప్పేందుకు రెడీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ విష‌యం.. ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టించినా.. మున్ముందు విచార‌ణ‌కు నిల‌బ‌డే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News