నిమ్మగడ్డను తీసుకుంటే తప్పేంటి ?

నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ పేరు గత నాలుగు నెలలుగా ఏపీ రాజకీయాల్లో మారుమోగుతోంది. ఎంతలా అంటే 151 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన [more]

Update: 2020-06-25 11:00 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ పేరు గత నాలుగు నెలలుగా ఏపీ రాజకీయాల్లో మారుమోగుతోంది. ఎంతలా అంటే 151 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన యువ ముఖ్యమంత్రి జగన్ తో సమానంగా అవతల వైపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ పొలిటికల్ గా ఫోకస్ అవుతున్నారు. నిజానికి నిమ్మగడ్డ ఒక మాజీ బ్యూరోక్రాట్. ఐఏఎస్ అధికారిగా ఆయన సర్వీస్ పూర్తి అయిన తరువాత నాటి చంద్రబాబు సర్కార్ 2016లో అయన్ని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించింది. బాబు టైంలో లోకల్ బాడీ ఎన్నికలు లేవు కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నాలుగేళ్ళుగా పనిలేకపోయింది. ఆయన పేరు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇపుడు జగన్ సర్కార్ లోకల్ బాడీ ఎన్నికలకు తెర తీయడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ రచ్చలో
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఇరుక్కున్నారు.

పావుగానా …?

వైసీపీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి మార్చి 15 వరకూ తెలియదా. ఆయన ఎలాంటి అధికారో అంతకు ముందు కనీసంగా అవగాహన లేదా అన్న ప్రశ్నలు ఇపుడు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులను, ఆయన నియమించిన వారిని లూప్ లైన్లోకి నెట్టిన జగన్ సర్కార్ అతి కీలకమైన ఎన్నికల సంఘం మీద మార్చి 15 దాకా ఎందుకు దృష్టి పెట్టకపోయింది అన్నది ఒక చర్చ. నాడే నిమ్మగడ్డ ట్రాక్ రికార్డ్ మీద ఒక అవగాహన‌కు వస్తే స్థానిక ఎన్నికలకు వెళ్ళకుండానే ఎన్నికల సంస్కరణలకు వైసీపీ ఉపక్రమించి ఉండేది. లేదా 2021 మార్చి వరకూ గమ్మున ఊరుకుని తమకు నచ్చిన వారిని ఎస్ఈసీగా అపాయింట్ చేసుకుని ఎన్నికలకు వెళ్ళేది. అంటే ఇక్కడ అతి సున్నితమైన ముఖ్య అంశాన్ని విస్మరించి ఎన్నికల యుధ్ధానికి వెళ్ళడంతోనే వైసీపీకి ఘోరమైన అవమానం జరిగింది అన్నది ఒక విశ్లేషణ.

లాజిక్ పాయింటే ….?

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధానాధికారిగా ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలలు వాయిదా వేశారు. ఇందులో సర్కార్ కి సమాచారం ఇవ్వకపోవడం వరకూ తప్పు ఉన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అంతా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏపీలో నాటి నుంచి నేటి దాకా కరోనా విలయతాండవం చేస్తోంది కాబట్టి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరి ఇలా చేశారని అప్పటికే గ్రహింపు ఉన్న వైసీపీ సర్కార్ పెద్దలు కాస్తా తమాయించుకుని పెద్దరికం ప్రదర్శించి ఉంటే కధ ఇంతవరకూ వచ్చేది కాదు. నిమ్మగడ్డ తప్పు చేస్తే జగన్ సైతం తన ముఖ్యమంత్రి హోదాను తగ్గించుకుని మరీ నిమ్మగడ్డకు సరిసాటిగా నిలిచారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉంటే మాత్రం వైసీపీకి వచ్చిన నష్టమేంటి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కూడా కలెక్టర్లూ, పోలీసులు ముఖ్యమంత్రి మాట వినకుండా పోతారా. ఇక నిమ్మగడ్డ ఆర్డర్ వేసినా అమలు చేయాల్సింది జగన్ సర్కారే. కాబట్టి వైసీపీ అధికారాలకు ఎక్కడా ఢోకా ఉండదు కదా.

అదే బెటర్….

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో చిరిగి చాట చేసుకుంటున్నది కచ్చితంగా వైసీపీ సర్కారేనని చెప్పాలి. ఆయన ఎవర్తితో ఎక్కడ మాట్లాడితే అతి పెద్ద మెజారిటీతో ఉన్న ప్రభుత్వానికి పోయేదేముంది. అయితే ఆయన్ని రాజకీయంగా ఒక పక్షం వైపు ఉన్నారని చూపించడం వరకూ ఆడిన రాజకీయం చాలు, జనాలకు ఎవరు ఏంటి అన్నది ఇపుడు బాగా తెలిసిపోయింది కూడా. అందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను హైకోర్టు తీర్పుని గౌరవించి ఎస్ఈసీ కుర్చీలో కూర్చోబెట్టి ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత వైసీపీ సర్కార్ దే. అది వివేకం అనిపించుకుంటుంది కూడా. ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీ స్వీప్ చేస్తుందని అంటున్నారు. జగన్ కూడా అన్ని పధకాలూ అమలు చేస్తున్నారు. అక్కడ నిమ్మగడ్డ ఉంటేనేమిటి, మరొకరు ఉంటేనేమిటి. వైసీపీ విజయం ఖాయమయ్యాక ఎవరూ అడ్డలేరు కదా. పైగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అక్కడ పెట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తే టీడీపీ కూడా కిక్కురుమనలేదు. ఎన్నికలలో అక్రమాలు అరాచకాలు జరిగాయని కూడా అనలేదు. ఎందుకంటే తాము కోరుకున్న నిమ్మగడ్డ ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి వారు నోరు నొక్కుకుపోతుంది. ఈ రకమైన వ్యూహంతో వైసీపీ ముందుకు వెళ్లడమే ఇపుడు బెటర్.

Tags:    

Similar News