నిమ్మగడ్డ అంతవరకేనట… ఆ తర్వాత మాత్రం?

ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయనకు అన్నీ తెలుసు. సుదీర్ఘమైన ఐఏఎస్ సర్వీసులో ఆయన ఎపుడూ వివాదం కాలేదు. కానీ [more]

Update: 2021-02-26 12:30 GMT

ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయనకు అన్నీ తెలుసు. సుదీర్ఘమైన ఐఏఎస్ సర్వీసులో ఆయన ఎపుడూ వివాదం కాలేదు. కానీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా మాత్రం ప్రభుత్వాన్ని ఢీ కొట్టి ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కారు. ఏడాదిగా సాగిన ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటి అంటే ఇపుడు అటూ ఇటూ కూడా తెల్ల జెండా చూపించి మరీ ఇపుడు సయోధ్య బాట పట్టడం.

దూకుడుగానే ….?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ అధికారి మాత్రమే కాదు, న్యాయ విద్యను అభ్యసించిన వారు, పైగా రాజ్ భవన్ లో ఏళ్ల తరబడి పనిచేసి రాజ్యాంగాన్ని కూడా ఔపాసన పట్టేశారు. అందువల్లనే ఆయన రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల కక్ష కట్టి వ్యవహరించినా కూడా దాన్ని న్యాయ స్థానాల్లో దూకుడుగా ఎదుర్కొని పోయిన ఎస్ఈసీ కుర్చీ సంపాదించారు. పంతం పట్టి మరీ తాను ఎన్నికల కమిషనర్ గా ఉండగానే స్థానిక ఎన్నికలకు నిర్వహిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తాను ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా బాగా తెలుసు. అందుకే ఆయన మొదట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెర తీశారు.

ఒక్కసారి కాదా…?

పంచాయతీ ఎన్నికల తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మునిసిపల్ ఎన్నికల నగారా మోగించారు. నిజానికి వీటి కంటే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అవి చాలా ముఖ్యం కూడా. ఇప్పటికి నెల రోజులుగా స్థానిక ఎన్నికల తంతు సాగుతున్నా ఎక్కడా పరిషత్ ఎన్నికల ఊసే రాకపోవడం ఒకింత విస్మయం కలిగించే విషయమే. అయితే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటే చాలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉందిట. నాడు వేలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో అవి అక్రమం అని నిమ్మగడ్డ ఏకంగా కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ ఇపుడు ముందుంది. దాంతోనే ఇపుడు పెద్ద చిక్కు వస్తోంది అంటున్నారు.

ఇక్కడితో సరి…

పరిషత్ ఎన్నికలు నిమ్మగడ్డ నిర్వహించాలనుకుంటే మాత్రం పాత ఏకగ్రీవాలను రద్దు చేస్తూ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి. అదే జరిగితే వైసీపీ కోర్టుకు వెళ్తుంది. అపుడు అక్కడ ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం కూడా మార్చి 31తో పూర్తి అవుతుంది, మునిసిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాక కేవలం పదిహేను రోజులు మాత్రమే వ్యవధి ఉంటుంది. ఇక ఏకగ్రీవాలకు ఓకే అనేసి ఎన్నికలకు వెళ్తే తాను అన్న మాటలను, అక్రమమని కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ తప్పు అని తానే అంగీకరించాల్సి వస్తుంది. విపక్షాలు అసలు ఊరుకోవు. ఇదంతా పెద్ద వ్యవహారంగా ఉంటుంది. పైగా అటూ ఇటూ వైసీపీ, టీడీపీ పట్టు పట్టి కూర్చుంటాయి. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలను మాత్రం పెండింగులో పెట్టి తమ పదవిని ముగించేస్తారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News