నిమ్మగడ్డ ను సాగనంపినంత మాత్రాన?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదానికి ఒక జీవో తో జగన్ ప్రభుత్వం తెరదించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం [more]

Update: 2020-04-10 14:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదానికి ఒక జీవో తో జగన్ ప్రభుత్వం తెరదించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం కరోనా సమయమని కూడా వేచి చూడలేదు. అందుకే నిబంధనలను మార్చి మరీ ఆర్డినెన్స్ తెచ్చి మరీ ఉద్వాసన పలికింది. ఇది కొంత విమర్శలకు దారితీస్తుందని తెలిసినా జగన్ ఏమాత్రం తగ్గ లేదు. జగన్ ను విపక్షాలు నియంత అని పిలుస్తుంటాయి. దానిని నిజం చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనమే అయింది.

అప్పటి నుంచి మొదలు…..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాయే కారణం కొంత అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇద్దరి మధ్యా మరింత గ్యాప్ ను పెంచాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి జగన్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కులం అంటగట్టారు. ఇది కొంత విమర్శలకు దారి తీసింది. వైసీపీ మంత్రుల దగ్గర నుంచి వరసగా మాటల దాడి పెంచడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లిపోయారు. తనకు భద్రత లేదంటూ కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాయటం కూడా వివాదాస్పదమయింది.

ఇద్దరి మధ్య గ్యాప్…..

తమతో ఏమాత్రం సంప్రదించకుండా స్థానిక సంస్థలను వాయిదా వేశారన్నది ప్రభుత్వ ఆగ్రహానికి కారణం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వెనకుండి తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందని కూడా వైసీపీ ఆరోపించింది. దీనికి తోడు కరోనా సాయం సమయంలో ప్రభుత్వం అందించే నగదును వైసీపీ నేతలు పంచడాన్ని కూడా టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అనర్హత వేటు వేయాలని కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తొలగింపు…వివాదమేనా?

దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమకు భవిష్యత్తులో అయినా ఇబ్బందికరంగా మారతారని వైసీపీ భావించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్ల కాలానికి కుదిస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ వద్దకు పంపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016లో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అంటే ఆయన పదవీకాలం మూడేళ్లు పూర్తవుతుంది.నిజానికి ఆరేళ్ల పాటు పదవీకాలంలో ఉండాల్సి ఉంది.

జీవోలు ఇలా….

కాని ఆర్డినెన్స్ తర్వాత ప్రభుత్వం తెచ్చిన జీవోల ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీ కాలం మూడేళ్లు. అంతేకాకుండా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించాలన్నది ఇంకో జీవో విడుదల చేశారు. ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ జీవోలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని భావించి జీవోలు బయటకు విడుదల చేయలేదు. అయితే గవర్నర్ నియమించారు కాబట్టి రాష్ట్ర ఎన్నికల అధికారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని విపక్షాలు వాదిస్తున్నాయి. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయిందనే చెప్పాలి. కరోనా సమయంలోనూ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో కూడా అభద్రత నెలకొంటుందంటున్నారు. స్వేచ్ఛగా ఐఏఎస్ లు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏపీలో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News