ఇంటికెళ్ళేలోగా మొత్తం చక్కబెట్టేస్తారట…?

దటీజ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఇప్పటికే అనిపించుకున్న ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఇపుడు చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పర్వం నడుస్తోంది. [more]

Update: 2021-01-28 14:30 GMT

దటీజ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఇప్పటికే అనిపించుకున్న ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఇపుడు చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పర్వం నడుస్తోంది. నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిపించిన వెంటనే మునిసిపల్ సమరానికి కూడా నిమ్మగడ్డ తెరతీస్తారని అంటున్నారు. ఈ విధంగా వరస షెడ్యూల్ తో మొత్తం ఎన్నికల తతంగాన్ని తాను రిటైర్ అయ్యేలోగానే పూర్తి చేయాలన్నది ఆయన పట్టుదలగా కనిపిస్తోంది అంటున్నారు.

ఆయనే రాజు…

ఏపీలో ఇపుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతోనే మొత్తం వ్యవస్థలు అన్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. దైనందిన పాలన తప్ప ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ముందు చూపుతోనే ఉన్నారని అంటున్నారు. వచ్చే రెండు నెలలు తానే మొత్తంగా అయి ఏపీలో కధను నడిపించాలనుకుంటున్నారు. అంటే వరస ఎన్నికలు అన్న మాట. ముందు పంచాయతీతో మొదలుపెట్టి కార్పోరేషన్ల దాకా ఎన్నికలను మొత్తం నిర్వహించి ఏపీలో లోకల్ బాడీస్ కి ఎక్కడా ఎన్నికలు జరగలేదు అన్న మాట లేకుండా చేయాలనుకుంటున్నారుట.

అన్నీ చకచకా….

పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. అవి ఫిబ్రవరి 9 నుంచి మొదలుపెట్టి 13, 17, 21 వరకూ సాగుతాయి. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22న మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా చేయాల్సిన కసరత్తు మీదనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూపు ఉందని అంటున్నారు. ఓ వైపు పంచాయతీ ఎన్నికలను చూస్తూనే మిగిలిన ఎన్నికలకు సంబంధిచిన షెడ్యూల్ ఖరారులో నిమ్మగడ్డ బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఏపీలో 75 మునిసిపాలిటీలు ఉన్నాయి, అలాగే 16 కార్పోరేషన్లు ఉన్నాయి. ఇక 31 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటికీ మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించడానికి భారీ యాక్షన్ ప్లాన్ ఎన్నికల సంఘం రెడీ చేస్తోంది అని చెబుతున్నారు.

వాటితో సరి…..

ఇక మార్చి నెల మొదలవుతూనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఎన్నికల సంఘం ప్రణాళికలను తయారు చేస్తోంది అన్న మాట వినిపిస్తోంది. ఇవన్నీ కూడా మార్చి రెండవ వారానికల్లా పూర్తి చేయాలని టైమ్ బౌండ్ ప్రొగ్రాం ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టుకున్నారు అని అంటున్నారు. ఇలా ఏపీలో అన్ని ఎన్నికలు నిర్వహించి ఆ మీదట పూర్తి సంతృప్తితో తాను రిటైర్ కావాలన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు హయాంలో నియమితులైన నిమ్మగడ్డ జగన్ ఏలుబడిలో చురుకు పుట్టి చివరి దశలో ఇలా దూకుడు చేయడం ద్వారా తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు.

Tags:    

Similar News