నిమ్మగడ్డ లేఖతో నానా యాగీ అవుతుందిగా

ఒకే ఒక్క లేఖ ఇపుడు ఏపీ రాజకీయం మొత్తాన్ని తిప్పేస్తోంది. ఆ లేఖ టీడీపీ అనుకూల మీడియాకు అతి పెద్ద ఆహారం అయింది. అదే లేఖ పసుపు [more]

Update: 2020-03-20 03:30 GMT

ఒకే ఒక్క లేఖ ఇపుడు ఏపీ రాజకీయం మొత్తాన్ని తిప్పేస్తోంది. ఆ లేఖ టీడీపీ అనుకూల మీడియాకు అతి పెద్ద ఆహారం అయింది. అదే లేఖ పసుపు పార్టీ నేతలకు, ఇతర ప్రతిపక్షాలకు ఏపీ సర్కార్ మీద ఆరోపణలు చేసేందుకు పెద్ద నోరు ఇచ్చింది. అదే లేఖ ఏకంగా రాష్ట్ర పతి పాలన పెట్టాలన్న తీవ్రమైన డిమాండ్ టీడీపీ చేసేదాకా పోయింది. ఇంతకీ ఆ లేఖ ఏంటి, ఎవరిదీ అంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లుగా చెప్పబడుతోంది. తాను ఆ లేఖ రాయలేదని నిమ్మగడ్డ ఇప్పటికీ గట్టిగా చెప్పకపోవడంతో సర్కార్ పరువు డ్యామేజ్ అవుతోంది. దీంతో వైసీపీ సర్కార్ సీరియస్ గా ఉంది.

పరువు తీసీలా…?

ఆ లేఖలో జగన్ సర్కార్ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ ఘట్టంలోనే దారుణాలు జరిగిపోయాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచరాదు అంటూ జగన్ తెచ్చిన కొత్త చట్టం దుర్మార్గం అయినదని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక ఏకగ్రీవాల పేరిట వైసీపీ నేతల దౌర్జన్యాలే జరిగాయని కూడా గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఇలా సర్కార్ పరువు మర్యాదలు గంగలో కలిపేలా ఆ లేఖ ఉండడమే కాదు ఏపీలో అసలు ప్రభుత్వమే లేదు. ఆటవిక రాజ్యం ఉందని కూడా చెప్పకనే చెప్పినట్లైంది.

బదనాం చేసేందుకే…?

ఆ లేఖ కనుక నిజం కాకపోతే రమేష్ కుమార్ ఎందుకు పెదవి విప్పరు అంటూ వైసీపీ నేతలు ఇపుడు ప్రశ్నిస్తున్నారు. ఆ లేఖ నిమ్మగడ్డ రాస్తే ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకోవచ్చునంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటున్నారు. ఇక ఆ లేఖలో జగన్ మీద, మంత్రుల మీద విమర్శలు ఉండడాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సైతం మండిపడుతున్నారు. ఆ లేఖ వల్ల ప్రభుత్వ సమాచారం. విశ్వసనీయత బజారు పాలు అయ్యాయని ఆయన అంటున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో కూర్చున్న తరువాత‌ ఇలా తాను రాసినట్లుగా చెప్పబడుతున్న లేఖ బయటకు రావడానికి రమేష్ బాధ్యత వహించాలని అంటున్నారు. ఒకవేళ లేఖ రాయకపోతే గట్టిగా ఖండించాల్సిఉంటుందని కూడా అంటున్నారు.

అది చాలా….

ఇక వైసీపీలో ఈ లేఖ మంటలు పుట్టిస్తోంది. జగన్ సీరియస్ గా ఉన్నారని సమాచారం. దీని లోతుపాతులు వెనక ఉన్న అసలు కధలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డీజీపీని ఆదేశించారని టాక్. మరో వైపు నిమ్మగడ్డ మిన్నకుండడం పైనా వైసీపీ పెద్దలు రగులుతున్నారని భోగట్టా. ఆయన ఇలా చేసినట్లుగా తేలితే కనుక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అసెంబ్లీలో ఆయన్ని అభిశంసిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందేనని కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి నిమ్మగడ్డను పదవి నుంచి దించేందుకు వేగంగా వైసీపీ పావులు కదుపుతోందని సమాచారం. నిమ్మగడ్డ పేరిట టీడీపీ నానాయాగీ చేయడం బట్టి చూస్తూంటే ఆయన మౌనం దేనికైనా సిధ్ధమైనే భావాన్ని కలిగిస్తోందని కూడా అంటున్నారు. చూడాలి ఈ కొత్త రాజకీయం ఎన్ని సెగలు, పొగలు పుట్టిస్తుందో.

Tags:    

Similar News