ఇప్పుడు నిమ్మగడ్డ రియాక్షన్ ఎలా ఉంటుందో?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా [more]

Update: 2020-04-06 06:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా వైరస్ ఉన్న కారణంగా ఆయన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేసింది. కుల ముద్రను వేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుటుంబ సభ్యులను కూడా లాగింది.

హైదరాబాద్ లోనే ఉంటూ…..

అయితే ఎన్నికలను వాయిదా వేసిన రమేష్ కుమార్ తనకు ఆంధ్రప్రదేశ్ లో భద్రత లేదని హైదరాబాద్ వచ్చేశారు. గత ఇరవై రోజుల నుంచి రమేష్ కుమార్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కేంద్ర హోంశాఖకు ఆయన రాసిన లేఖ కూడా అప్పట్లో వివాదాస్పదమయింది. తనకు భద్రత కల్పించాలని, వైసీపీ నుంచి తనకు ముప్పు ఉందని ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం, వెంటనే భద్రత కల్పించడం చకా చకా జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎన్నికల నిబంధనలను తొలగించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ…..

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. పోలింగ్ జరగాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ జీరో స్థాయికి వచ్చిన తర్వాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ఎన్నికలను నిర్వహించే తేదీలను ప్రకటిస్తారు. అయితే ఇప్పడు ఏపీలో జరుగుతున్న సంఘటనలపై ఆయనకు పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి.

ఫిర్యాదుల మీద ఫిర్యాదులు……

హైదరాబాద్ లో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాత పూర్వక ఫిర్యాదులు టీడీపీ, బీజేపీలు చేస్తున్నాయి. ప్రభుత్వం కరోనా విపత్తు సమయంలో ప్రకటించిన నగదు సాయాన్ని వైసీపీ అభ్యర్థులు దగ్గరుండి పంచడాన్ని అవి ఆక్షేపిస్తున్నాయి. ప్రచారం కోసమే ఈ విధంగా చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాసిన లేఖలో కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిపై అనర్హత వేటు వేయాలని, జైలుశిక్ష విధించాలని కోరుతున్నారు. టీడీపీ నేతలు దీనికి సంబంధించి ఆధారాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంపారు. మరి నిమ్మగడ్డ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News