పుంజు కోవాల్సిన కాలం…?

పుట్టిన రోజు అందరికీ పండగే. రాజకీయ నాయకులకు మరింత సందడిగా సాగుతుంది. వందిమాగధులు, అభిమానులు, ఆశ్రితులు, అధికారం కోరుకునేవారు ఒకరనేమిటి? అందరూ కలిసి పండగ చేసేస్తారు. సినీనటుడు [more]

Update: 2021-09-02 12:30 GMT

పుట్టిన రోజు అందరికీ పండగే. రాజకీయ నాయకులకు మరింత సందడిగా సాగుతుంది. వందిమాగధులు, అభిమానులు, ఆశ్రితులు, అధికారం కోరుకునేవారు ఒకరనేమిటి? అందరూ కలిసి పండగ చేసేస్తారు. సినీనటుడు రాజకీయ వేత్త అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ ఫాం గురించి చెప్పలేం కానీ సినిమాల్లో మాత్రం మంచి దూకుడు మీదున్నారు. ఆయన 25 సంవత్సరాల కెరియర్ లో ఎన్నడూ లేనంత బిజీగా సినిమాలు చేసేస్తున్నారు. అదే సమయంలో జనసేన ను ముందుండి నడిపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అండతో రాష్ట్రంలో అధికారం తెచ్చుకుంటామనే ఆశతో జనసేన అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల రెండింటి పాలనను నవ్యాంధ్ర చవి చూసింది. ప్రేక్షకులే కాదు, ప్రజలూ పాలనలో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తవుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల దిశలో సిద్ధం కావాల్సిన తరుణం. జనసేనకు సంబంధించి మరింత ముఖ్యమైన కాలం.

సినిమా కష్టాలు..

పూర్తి గా రాజకీయాలకే అంకితమవుతానని నాలుగేళ్ల క్రితం ప్రకటించిన పవన్ కల్యాణ్ రాజీ పడిపోయారు. సినిమా కెరియర్ తనకు తప్పదని నిర్ణయించుకుని బిజీ అయిపోయారు. ఆర్థికంగా పార్టీకి అండగా ఉండేందుకే సినిమాలు చేస్తున్నానని చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. కానీ రాజకీయంలో నిరంతరం అందుబాటులో ఉండేవారినే ప్రజలు కోరుకుంటారు. ఒక్క ఎన్నికతో అధికారం వచ్చి ఒడిలో వాలదు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో తప్పుడు అంచనాతో బోల్తా పడ్డారు. ఎన్టీరామారావు కూడా ఎక్కిన చైతన్యరథం దిగకుండా తొమ్మిది నెలలు ప్రచారం చేసిన తర్వాతనే విజయం సాధించారు. జగన్ విషయం చెప్పనక్కర్లేదు. ఏడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు. 2014 నుంచి జనసేన ఉన్నప్పటికీ ఇంతవరకూ ఒకే ఒక ఎన్నికలో తలపడింది. తొలిసారి 2014లో స్వయంగా అస్త్రసన్యాసం చేసి పార్టీ ప్రస్థానానికి పవన్ కల్యాణ్ బ్రేకులు వేసేసుకున్నారు. 2019లో పోటీ చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ పడేందుకు పావులు కదపాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ జనసేన వైఫల్యం చెందితే మరో రెండు దశాబ్దాలు వేరే రాజకీయ శక్తులు కొత్తగా రంగంలోకి దిగేందుకు సాహసించవు. టీడీపీ, వైసీపీల రాజకీయమే నడుస్తుంది.

బ్యాలెన్స్ చేసుకుంటేనే…

పవన్ కల్యాణ్ కు యువతరంలో మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల్లో అతని ఆదర్శాలు, సిద్దాంతాలు ప్రజలను ఎంతగా ఆకర్షిస్తున్నాయంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ సినిమా పరంగా అతనికున్న ఆదరణ, గ్లామర్ రాజకీయాలకు పెట్టుబడిగా ఉపయోగపడుతోంది. అయినప్పటికీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కల్పించలేకపోతే ఓటు బ్యాంకు ఏర్పడదు. ఆ క్రెడిబిలిటీ గ్యాప్ జనసేనను వెంటాడుతోంది. సామాజిక వర్గ పరంగా చూస్తే గడచిన డెబ్భై ఏళ్లలో రెండు సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక కాలం పరిపాలించాయి. ఆ రెండు వర్గాలకు చెందిన ఓటింగు జనాభాలో రెండు నుంచి మూడు శాతమే. కానీ పవన్ కల్యాణ్ సామాజిక వర్గం జనాభాలో 16 శాతం పైచిలుకు ఉంది. కానీ అది ఓటింగుగా మారడం లేదు. ఆ లోపమే జనసేనను అధికారానికి రాకుండా నిరోధిస్తోంది. ఇప్పటివరకూ అధికారాన్ని అనుభవిస్తున్న వర్గాల నుంచి కాపులు, వెనకబడిన తరగతులు, దళితులకు క్రమేపీ అధికారపు పగ్గాలు మారాలి. అందుకు పవన్ కల్యాణ్ వంటి జనాకర్షక నేత అవసరం ఉంది. అయితే సినిమాలను, రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుని తగినంత సమయం కేటాయిస్తేనే ప్రజలు అతనిలో తమ నాయకుడిని చూస్తారు.

ఇపుడు కాకపోతే.. ఇంకెప్పుడు?

టీడీపీ పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయి, అధికారాన్ని వైసీపీకి అప్పగించారు. ఆ పార్టీ విధానాల పట్ల కూడా క్రమేపీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, విద్యావర్గాలు దూరమవుతున్నాయి. రానున్న రెండేళ్ల పరిపాలన చాలా సమస్యాత్మకం కాబోతోంది. అప్పులు తెచ్చి సర్దుబాటు చేయడం, లేదా ప్రజలపై పన్నుల భారం పెంచడం రెండే మార్గాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండూ కూడా ప్రజలను ప్రభుత్వానికి దూరం చేస్తాయి. ఈ స్థితిలో సమర్థమైన ప్రతిపక్షం ముందుకు వస్తే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీని ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా చూడటం లేదు. రకరకాల కారణాల వల్ల నవ్యాంధ్ర తొలి పాలకునిగా చంద్రబాబు విఫలమయ్యారు. పాలనలో చిత్తశుద్దిని కనబరచలేకపోయారు. అందువల్లనే టీడీపీకి, వైసీపీకి మధ్య పదిశాతం ఓట్ల తేడా ఏర్పడింది. బలమైన కొత్త ప్రత్యర్థి ఆవిర్భవిస్తే టీడీపీ, వైసీపీల ఓటు బ్యాంకులకు చిల్లులు పడే వాతావరణం ఏర్పడింది. దీనిని జనసేన వంటి పార్టీలు ఎంతవరకూ ఎన్ క్యాష్ చేసుకుంటాయో చూడాలి. పార్టీ నిర్మాణంతోపాటు రానున్న రెండేళ్లు తరచూ ప్రజాసమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలి. పర్యటించాలి. అప్పుడే జనసేనను ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా ప్రజలు విశ్వసిస్తారు. సుదీర్ఘకాలం పోరాటానికి సిద్దమన్న పవన్ కల్యాణ్ రానున్న రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తారనేదానిపైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. పుట్టిన రోజు కొత్త సినిమా ట్రయిలర్లు, ప్రకటనలు చేయడానికే పరిమితం కాకుండా ప్రజాజీవితానికి మరోసారి పునరంకితం చేసుకోవాల్సిన తరుణం కూడా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News