పాపం… మత్తు డాక్టర్… ?

విశాఖ జిల్లా నర్శీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ గుర్తున్నారా. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో ఆయన హల్ చల్ చేశారు. నాడు దేశమంతటికీ కరోనా [more]

Update: 2021-05-25 05:00 GMT

విశాఖ జిల్లా నర్శీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ గుర్తున్నారా. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో ఆయన హల్ చల్ చేశారు. నాడు దేశమంతటికీ కరోనా అపుడే పరిచయం అయింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి చోటే డాక్టర్లకు పీపీఐ కిట్స్ లేవు. మాస్కుల విషయం కూడా పెద్దగా అవగాహన లేని రోజులు అవి. అలాటి టైమ్ లో మత్తు డాక్టర్ ఏకంగా మీడియాకు ఎక్కి ప్రభుత్వం మీద నిందలు వేశారు. డాక్టర్లకు ఏ సురక్షితమైన పరికరాలు ఇవ్వలేదేని, వారికి కరోనాకు బలి చేస్తారా అంటూ ఆయన ఘాటుగానే మాట్లాడారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారని ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయన మరోసారి విశాఖ వీధుల్లో హడావుడి చేశారు.

బావుకున్నదేంటి ….?

దాంతో అది కాస్తా హై కోర్టు దాకా వెళ్ళింది. ఆ మీదట మొత్తం వ్యవహారం మీద సీబీఐ విచారణ కూడా జరిపించారు. ఆ నివేదిక ఏంటో ఇంకా చూడాల్సి ఉంది. ఇంతలోనే మత్తు డాక్టర్ సుధాకర్ గుండె పోటుతో మరణించారు అన్న వార్త. ఆయన చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు, లోకేష్ భారీ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. మొత్తానికి ఆయన విషయంలో టీడీపీ మరోసారి రాజకీయ మొదలెట్టింది అని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు ఇంతకీ డాక్టర్ సుధాకర్ సాధించింది ఏంటి అన్నదే ఇక్కడ చర్చ.

వాడుకున్నారా…?

ఇదిలా ఉంటే మత్తు డాక్టర్ ఆ రోజున మీడియా ముందు జగన్ సర్కార్ మీద చేసిన విమర్శల వెనక టీడీపీ పెద్దలు ఉన్నారని కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. నిజానికి చక్కగా గౌరవంగా సర్కార్ ఉద్యోగం చేసుకునే వైట్ కాలర్ జాబ్ హోల్డర్ రోడ్డు మీదకు ఎందుకు అలా రావాల్సివచ్చింది, ఆయన జీవితం గత ఏడాదిగా ఎందుకు తల్లకిందులు అయింది అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఇక ఆయనకు రాజకీయాల్లోకి రావాల్సి వుందని, 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ టికెట్ ట్రై చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి 2024కి హామీ ఇచ్చి ఆయన్ని రాజకీయ ముగ్గులోకి కొందరు దింపారని కూడా ప్రచారం అయితే సాగింది. ఏది ఏమైనా ఒక మంచి డాక్టర్ ఏమీ కాకుండా అసువులు బాయడం మాత్రం దారుణమే.

తప్పెవరిది…?

మత్తు డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ హద్దులు మీరారు. ఆయనకు ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఇక ఆయన మీద విశాఖ వీధుల్లో పోలీసులు చేసిన అతి కూడా జగన్ సర్కార్ కి చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. మొత్తానికి ఢీ అంటే ఢీ అంటూ సాగుతున్న రెండు పార్టీల రాజకీయాల్లోకి డాక్టర్ సుధాకర్ చొరబడి అన్యాయం అయిపోయారు అన్న మాట మాత్రం అంతటా వినిపిస్తోంది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో దీన్ని రాజకీయం చేసిన ప్రతిపక్షాలు కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించాలిగా అన్న వాదన కూడా మరో వైపు నుంచి వస్తోంది. మొత్తానికి ఒక మంచి డాక్టర్ మాత్రం ఈ లోకం నుంచి అర్ధాంతరంగా అంతర్ధానం కావడం మాత్రం బాధాకరం, దానికి రాజకీయాలే కారణమని అంతా అంటున్నారు.

Tags:    

Similar News