కొత్త ఏడాది కటకటాల పాలేనా?

కొత్త ఏడాది తెలుగుదేశం పార్టీ నేతలకు కష్టాలు తప్పేట్లు లేవు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. అనేక మంది టీడీపీ నేతలపై కేసులు [more]

Update: 2020-12-30 05:00 GMT

కొత్త ఏడాది తెలుగుదేశం పార్టీ నేతలకు కష్టాలు తప్పేట్లు లేవు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. అనేక మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసింది. అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేయగా, కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది. రవాణా శాఖలోని స్కామ్ కు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపు యాభై రోజులకు పైగానే కటకటాల వెనక్కు నెట్టింది. ఇప్పుడు కొత్త ఏడాది ఎవరికి ముహూర్తం పెట్టారన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

రాజధాని భూముల విషయంలో….

ఇప్పటికే రాజధాని అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై కొత్త ఏడాది స్పష్టత వచ్చే అవకాశముంది. దీనిపై కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఇందులో విన్పిస్తున్నాయి. ఇక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కూడా దర్యాప్తును వేగం పెంచారు. ఇందులో నారా లోకేష్ పాత్ర ఉన్నప్పటికీ ఆయనకు సహకరించిన వారిపై తొలుత కేసులు నమోదు చేసే అవకాశముందని చెబుతున్నారు.

విశాఖ భూ కుంభకోణంలో….

ఇక విశాఖ ప్రాంతంలో భూ కుంభకోణాలపై సిట్ దర్యాప్తు పూర్తయింది. త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది. విశాఖలో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయినట్లు సిట్ గుర్తించింది. ఇందులో టీడీపీ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇప్పటికే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం విశేషం.

మాజీ మంత్రి పేరు కూడా….

మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ ల ఏర్పాటులో జరిగిన అవినీతిపై కూడా ప్రభుత్వం దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఇది కూడా కొత్త ఏడాదిలో నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశముంది. ఇందులో కూడా మాజీ మంత్రి అరెస్ట్ అయ్యే అవకాశముందన్న ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద 2021 కొత్త ఏడాది ప్రారంభంలోనే టీడీపీ నేతల అరెస్ట్ ల పర్వం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఏడాది టీడీపీ నేతలకు కష్టకాలమనే చెప్పాలి.

Tags:    

Similar News