చేసుకున్నోడికి చేసుకున్నంత అని..?

నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి కంటి మీద కునుకు పట్టడం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పరిస్థితులు ఆయనలో అసహనం రేకెత్తిస్తున్నాయి. చైనా [more]

Update: 2020-07-11 16:30 GMT

నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి కంటి మీద కునుకు పట్టడం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పరిస్థితులు ఆయనలో అసహనం రేకెత్తిస్తున్నాయి. చైనా దన్నుతో చేపట్టిన భారత్ వ్యతిరేక విధానం ఎదురుతన్నడంతో ఓలీ కంగారు పడుతున్నారు. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జాతీయవాదం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఆయనకు, తద్వారా తన పదవిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఈ నేపాల్ కమ్యునిస్టు నాయకుడు నిరుత్సాహంలో ఉన్నారు. ఓలీని చూసిన తర్వాత చేసుకున్న వారికి చేసుకున్నంత… అన్న సామెత గుర్తుకు రాక మానదు. చేతులారా చేసుకుని ఇప్పుడు తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతోందని, భారత్ సూచనలు, సలహాలతోనే ఈ ప్రక్రియ మొదలయిందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

చైనా ప్రోద్బలంతోనే….

భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరిగడ్ జిల్లా లోని కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలు తమవేనంటూ ఓలీ కొంతకాలంగా వాదిస్తున్నారు. 400 కిలోమీటర్లు గల ఈ ప్రాంతం తమేదనంటూ తాజాగా మ్యాప్ ను రూపొందించింది. ఈ మేరకు నేపాల్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనివల్ల ప్రజల్లో జాతీయ వాదం పెరుగుతుందని, భారత్ వ్యతిరేకత ప్రోది చేసుకుంటుందని ఓలీ భావించారు. అంతేకాకుండా పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను, ప్రతి పక్షాలను మాట్లాడనీయకుండా చేయగలనని భావించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దన్నుతోనే ఆయన ఈ సాహసం చేశారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఓలీ అంతరంగాన్ని పసిగట్టిన పార్టీలోని సీనియర్ నాయకులు తిరుగుబాటు చేశారు. పార్టీకి చెందిన మాజీ ప్రధానులైన పుష్ప కమాల్ దహాల్ (ప్రచండ), మాధవ్ కుమార్, ఝలానాధ్ భానల్ తదితరులు ఓలీ వైఖరిని నిలదీస్తున్నారు. వీరు మాజీ ప్రధానులు మాత్రమే కాదు. పాలక పార్టీలోని స్థాయ సంఘం సభ్యులు కూడా. భారత్ పై ఓలీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే పార్టీ సహాధ్యక్ష్య పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరినీ సంప్రదించకుండా….

కీలక అంశాల్లో, విధానపరమైన అంశాల్లో ఓలీ సీనియర్లను సంప్రదించకుండా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ ప్రధాని, పార్టీ సహాధ్యక్షుడైన ప్రచండ ధ్వజమెత్తుతున్నారు. ఉదాహరణకు గత నెలలో చైనా- నేపాల్ మధ్య జరగిన చర్చల్లో మాజీ ప్రధాని, ప్రస్తుత విదేశాంగ మంత్రి అయిన మాధవ్ కుమార్ నేపాల్ ను ఓలీ విశ్వాసంలోకి తీసుకోలేదు. దీనిని సీనియర్లు వేలెత్తి చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్వహణలో , కరోనా నియంత్రణలో, అవినీతి నియంత్రణలో, హామీల అమలులో ఓలీ విఫలమయ్యారన్న వాదన బలంగా వినపడుతోంది. దీతో పార్టీకి, ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు నానాటికీ కొరవడుతోంది. దీతో ఓలీ తన పదవికి ముప్పు వాటిల్లుతుందని కంగారు పడుతున్నారు.

బంధానికి శతాబ్దాల చరిత్ర….

వాస్తవానికి భారత్ – నేపాల్ మధ్య బలీయమైన బంధం ఉంది. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆది నుంచి ఈ హిమాలయ పర్వత రాజ్యానికి భారత్ ఇతోధికంగా సహాయం చేస్తూ వచ్చింది. ప్రదాని పదవి చేపట్టిన ఏ నాయకుడైనా ముందుగా భారత్ లోనే పర్యటించే సంప్రదాయం ఉంది. 2008లో ప్రధాని పదవి చేపట్టిన ప్రచండ ఈ సంప్రదాయాన్ని విస్మరించి తొలుత చైనాలో పర్యటించారు. రాచరికపాలనపై తిరుగుబాటు చేస్తూ అజ్ఞాతంలో ఉండి పోరాడుతున్న ప్రచండనను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చి నేపాల్లో ప్రజాస్వామ్య స్థాపనకు 2006లో ప్రాంతంలో భారత్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయంలో నేపాల్ మావోయిస్టులతో సంప్రదింపులు జరిపేందుకు సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా ఖాట్టండు పంపారు. ఆ తర్వాత కాలంలో ఏర్పడిన కొన్ని అపశృతులు కారణంగా ఉభయదేశాల సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని అవకాశంగా తీసుకుని నేపాల్ లో చైనా పాగా వేసింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ప్రాజెక్టులో నేపాల్ ను భాగస్వామిగా చేసుకుంది. తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని, పెద్దన్నలా పెత్తనం చేస్తుందన్న భావన కొంతమంది నేపాలీల్లో నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చి నేపాల్ లో స్థిరపడిన భారతీయుల ప్రభావం కూడా అధికంగా ఉందన్న అభిప్రాయం ఉంది. వీరిని మధేసీలు గాల వ్యవహరిస్తారు. నేపాల్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ దేశం చైనా ప్రభావానికి లోనుకాకుండా భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అపోహలను దూరం చేసేందుకు భారత్ విధాన నిర్ణేతలు చొరవ తీసుకోవడం తక్షణావసరం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News