బొత్స బ్యాచ్ కు చుక్కలు చూపిస్తారా?

ఆయన తండ్రి వద్ద ఎందరో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. అలా ఎదిగిన వారే గురువు కొడుకును తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పెన్మత్స [more]

Update: 2020-12-20 06:30 GMT

ఆయన తండ్రి వద్ద ఎందరో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగారు. అలా ఎదిగిన వారే గురువు కొడుకును తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పెన్మత్స సాంబశివరాజు సీనియర్ నేత. ఈయన ఎందరికో రాజకీయ గురువు. బొత్స సత్యనారాయణ వంటి నేతలకు కూడా రాజకీయాలను నేర్పిన నేత. రాజకీయాల్లో మెళుకువలతో పాటు ఓటు బ్యాంకును ఎలా కాపాడుకోవాలో ఆయన నేర్పిన విద్యనే ఎంతో మంది నేటికీ అనుసరిస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా….

పెన్మత్స సాంబశివరాజు ఇటీవల మరణించారు. ఆయన కుమారుడు సురేష్ బాబుకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నిజానికి 2019 ఎన్నికల్లో నెలిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కుమారుడు సురేష్ బాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సురేష్ బాబుకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కాలం 2023 వరకూ ఉంది. 2024లో జరిగే ఎన్నికల్లో సురేష్ బాబు నెలిమర్లలో తమకు పోటీ అవుతారని బొత్స వర్గం భావిస్తుంది.

పూర్తిగా పక్కన పెట్టేసి….

ప్రస్తుతం నెల్లిమర్లలో వైసీపీ ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఈయన బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువు. వచ్చే ఎన్నికలకు సురేష్ బాబు తమకు అడ్డంకిగా మారతారని ఆయనను దూరం పెడుతున్నారు. అందుకే ఆయనను పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఆహ్వానం అందడం లేదు. కానీ సురేష్ బాబు మాత్రం ఓపికగా ఉండి నెలిమర్ల నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.

తనదే టిక్కెట్ అంటున్న…..

నెలిమర్ల నియోజకవర్గంలో పెన్మత్స కుటుంబానికి మంచి పట్టుంది. ఆ కుటుంబాన్ని అభిమానించే ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా ఉంది. పెన్మత్స సురేష్ బాబు కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని ఈ నియోజకవర్గం నుంచి వత్తిడి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందుకే సురేష్ బాబును బొత్స వర్గం దూరం పెడుతుందంటున్నారు. అయితే ఆయన వెయిట్ చేసి మరీ దెబ్బకొడతారని, పెన్మత్స కుటుంబాన్ని తక్కువగా అంచనా వేయకూడదంటున్నారు. జగన్ వద్ద బొత్స సత్యనారాయణ ఇమేజ్ తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బొత్సకు అంత ప్రాధాన్యత ఇవ్వరని, నెలిమర్ల తనదేనన్న ధీమాలో సురేష్ బాబు ఉన్నారు. మొత్తం మీద సురేష్ బాబు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారో చూడాలి.

Tags:    

Similar News