రాజకీయ తుఫాను రానుందా?

ఒడిశా రాజకీయం వేడెక్కింది. గడ్డకట్టే చలిలోనూ రాజకీయం పొగలు కక్కుతోంది. వచ్చే వేసవిలో ఏకకాలంలో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బిజూజనతాదళ్ (బీజేడీ) [more]

Update: 2019-01-06 16:30 GMT

ఒడిశా రాజకీయం వేడెక్కింది. గడ్డకట్టే చలిలోనూ రాజకీయం పొగలు కక్కుతోంది. వచ్చే వేసవిలో ఏకకాలంలో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బిజూజనతాదళ్ (బీజేడీ) విపక్ష భారతీయ జనతా పార్టీ పరస్పరం విమర్శలు రువ్వుకుంటున్నాయి. స్వయంగా పార్టీల అధినేతలు రంగంలోకి దిగడంతో రాజకీయం రక్తి కడుతోంది. బిజూ జనతాదళ్ అధినేత రాష్ట్రముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీజేపీ అధినేత అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఢీకొంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం రాజుకుంటోంది. రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపుతోందని నవీన్ పట్నాయక్ సూటిగా విమర్శిస్తుండగా, వచ్చిన నిధులను పట్నాయక్ ప్రభుత్వం స్వాహా చేస్తుందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన మోదీ పట్నాయక్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

కలసి నడుద్దామనుకున్నా……

వాస్తవానికి బీజేడీ, బీజేపీ ఒకప్పుడు మిత్రపక్షాలే. వాజపేయి మంత్రివర్గంలో నవీన్ పట్నాయక్ పనిచేశారు. 2000 సంవత్సరంలో పట్నాయక్ మంత్రివర్గంలో బీజేపీ భాగస్వామిగా ఉండేది. తర్వాత బీజేపీ, బీజేడీ దూరమైనప్పటికీ తీవ్ర విమర్శలకు దూరంగా ఉండేవి. ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల మాదిరిగా కాకుండా పట్నాయక్ కేంద్రంపై ఆచితూచి మాట్లాడేవారు. బీజేపీ, బీజేడీలకు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థికావడంతో రెండు పార్టీల మధ్య అప్రకటిత స్నేహం ఉండేది. 2019 ఎన్నికల్లో కూడా కలసి పని చేయాలని ఒక దశలో ఆలోచించాయి. కానీ మూడో కూటమి నేపథ్యంలో పట్నాయక్ తన మనసును మార్చుకున్నారు. కాలం కలసి వస్తే ప్రధానమంత్రిని కాగలనన్నది ఆయన ఆశ. జ్యోతిబసు తర్వాత రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా ఆయన రికార్డు సృ‌ష్టించారు. దేవెగౌడ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటూ ప్రధాని కాగలిగినప్పుడు తనకు ఎందుకు అవకాశం రాదన్నది ఆయన అభిప్రాయం. అందువల్లనే బీజేపీతో పొత్తు అవకాశాలు లేవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తర్వాతనే విమర్శల దాడి ప్రారంభమయింది. పరిస్థితి గ్రహించిన బీజేపీ కూడా అదే విధంగా స్పందిస్తోంది.

పట్నాయక్ విమర్శల దాడి…..

రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని పట్నాయక్ ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘాన్ని 4.59 లక్షల కోట్లు కోరగా కేవలం 1.84 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. ప్రత్యేక హోదా, కేంద్రం గ్రాంట్లు అక్కర్లేదని ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని పట్నాయక్ డిమాండ్ చేస్తున్నారు. కుర్బా -బాలంగీర్ రైల్వే లైను కు అవసరమైన భూమిని ఇచ్చినా, సగం మేరకు నిధుకు సమకూర్చేందుకు సిద్దంగా ఉన్న కేంద్రం మౌనం వీడటం లేదని పట్నాయక్ సూటిగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని మహానది కోల్డ్ ఫీల్డ్స్ వల్ల కేంద్రానికి సుమారు ఏటా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తుంది ఏమీ లేదని ధ్వజమెత్తుతున్నారు.

శంకుస్థాపనలు… ప్రారంభోత్సవాలు…..

విపక్ష పార్టీ కూడా పట్నాయక్ పై విమర్శల వేడిని పెంచింది. స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి ముఖ్యమంత్రి పట్నాయక్ ను నిలదీస్తున్నారు. ఖుర్బా పట్ణణంలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఒడిశాలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. పర్సంటేజీల సంస్కృతి రాష్ట్రంలో ప్రబలిందని, కేంద్ర పథకాలను నీరుగారుస్తున్నారన్నారు. విమర్శలతో సరిపెట్టకుండా రాష్ట్రానికి కేంద్రం భారీగా చేయూత అందిస్తోందని సోదాహరణంగా వివరించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. రాజధాని భువనేశ్వర్ లో రూ.1660 కోట్లతో నిర్మించిన ఐఐటీ క్యాంపస్ ను, వందపడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభించారు. బరంపురలో రూ.1600 కోట్లతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. పారాదీప్ – హైదరాబాద్ మధ్య రూ.3800 కోట్లతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించనున్న పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అంగుల్ నుంచి ఝార్ఖండ్ లోని బొకోరో వరకూ రూ.3437 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్యాస్ పైప్ లైన్ కు, నాలుగు జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్రానికి చేసిన సాయం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 1817లో జరిగిన “పైకా” తిరుగుబాటు 200 వ వార్షికోత్సవం సందర్భంగా భువనేశ్వర్ ఐఐటీలో పట్నాయక్, మోదీ ఒకే వేదికపై ప్రసంగించారు. తర్వాత రాజకీయ సభల్లో మోదీ పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికలపైనే……

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అయితే రాష్ట్రంలో మెజారిటీ లోక్ సభ స్థానాలను దక్కించుకునేందుకు అది పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో 21 పార్లమెంటు స్థానాలకు ఒక్క “సుందర్ ఘర్ ” స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. ఇక్కడి నుంచి గెలిచిన జ్యుయల్ ఓరమ్ కేంద్ర మంత్రి అయ్యారు. మిగిలిన 20 స్థానాలూ బీజేడీ ఖాతాలో పడ్డాయి. కాంగ్రెస్ కు ఒక్కటీ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఏబీపీ – సీ ఓటర్ సర్వే కమలనాధులకు కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది. మొత్తం 21 లోక్ సభ స్థానాల్లో 15 స్థానాలు కమలం ఖాతాలో పడతాయని సర్వే పేర్కొనడంతో బీజేపీ శ్రేణులు దూకుడు పెంచాయి. దీంతో స్వయంగా ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ కేవలం పదిమాత్రమే గెలిచింది. శాసనసభ పరంగా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి గట్టి పోటీనిచ్చి బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని, లోక్ సభ పరంగా అత్యధిక స్థానాలను గెలవాలన్నదిన కమలనాధుల అంతరంగం. అందుకోసమే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News