మెనీ డౌట్స్….!!

సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తలమునకలవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్్ [more]

Update: 2019-01-08 16:30 GMT

సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తలమునకలవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్్ సభతో పాటు, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో జరిగిన రెండు ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉంటుందా? అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్నాయక్ సొంత పార్టీలోనే సందేహాలు పలువురు వెలిబుచ్చుతున్నారు. పట్నాయక్ కూడా ఈ విష‍యాన్ని గుర్తించినట్లే కనపడుతోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఆమేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టే దిశగా సాగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత పార్టీని ఆలోచనల్లో పడేస్తున్నాయి.

ఆ ఫలితాలతో……

ఇటీవల అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత తొలిసారి ప్రభుత్వ వ్యతిరేకత అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో ఏకధాటిగా పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అక్కడ కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లో గౌరవ ప్రదంగానే ఓడిపోయినప్పటికీ అతి తక్కువ స్థానాలను సాధించి ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ చేదు అనుభవాన్ని చవి చూసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ వరుసగా పనిచేయడం గమనార్హం. ఇద్దరికీ వ్యక్తిగతంగా మంచిపేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. తమ పరిధులు, పరిమితుల మేరకు ఉన్నంతలో మంచి పాలనే అందించారు. అయినా ఓటమి అనివార్యమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న మిజోరాం లోనూ కాంగ్రెస్ కు ఇలంటి పరిస్థితే ఎదురైంది. అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లల్ తన్హ్ వాహ్లా పదేళ్లుగా మంచిపాలనే అందించారు. పెద్దగా ఆరోపణలు కూడా లేవు. అయినా పరాజయాన్ని ఎదుర్కొనక తప్పలేదు. రాజస్థాన్, తెలంగాణల పరిస్థితి వేరు.

అదే మైనస్…..

ఈ ఉదాహరణలను చూసిన తర్వాత నవీన్ పట్నాయక్ లో కూడా ఒకింత ఆలోచన మొదలయింది. ఆయన సుదీర్ఘకాలంగా సీఎంగా కొనసాగుతున్నారు. 2000 మార్చి 15 నుంచి నేటివరకూ ఏకధాటిగా సీఎంగా పనిచేస్తున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను 20 స్థానాలను పార్టీ కైవసం చేసుకుంది. 147 అసెంబ్లీ స్థానాలకు గాను 117 స్థానాలను పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కానీ ఈసారి అంత సానుకూల పరిస్థితి ఉంటుందా? అన్నది సందేహమే. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు తమ తమ మాతృభాషల్లో అనర్గళంగా ప్రసంగించగలుగుతారు. కానీ పట్నాయక్ కు ఆ పరిస్థితి లేదు. ఆయన తన మాతృభాష ఒడియాలో ధారాళంగా మాట్లాడలేరు. ఆంగ్ల మాధ్యమంలో చదివిన పట్నాయక్ కు ఒడియాపై పట్టు తక్కువ. సహజంగా కూడా ఆయన మంచి వక్త కాదు. ఆకట్టుకునే విధంగా ప్రసంగించలేరు. భావోద్వేగాలను రెచ్చగొట్టే విద్య కూడా లేదు.

సర్కార్ నిర్ణయాలు….

ఇటీవల సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి. థెంకనాల్ లో బీరు బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో నాడి ఎలా ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది. ఒడిశాలో 60 శాతం మంది జీవనాధారం వ్యవసాయమే. ఈ రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 114 ప్రాంతాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమయింది. వ్యక్తిగా పట్నాయక్ పట్ల ప్రజాదరణ ఇప్పటికీ పెద్దగా తగ్గలేదు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అవినీతి కారణంగా ఎమ్మెల్యేలు క్రమంగా ప్రజాదరణను కోల్పోతున్నారు.

రైతులను దరిచేర్చుకునేందుకు….

ఈ పరిస్థితిని గుర్తించిన నవీన్ పట్నాయక్ నష్టనివారణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో కనీసం 40 నుంచి 50 మంది తప్పించి కొత్త ముఖాలను ఈసారి బరిలోకి దించుతారని చెబుతున్నారు. రైతులను ఆకట్టుకునేందుకు కర్షక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీ హుడ్ అండ్ ఇన్ కమ్ అగెంటేషన్ పేరుతో తాజాగా కొత్త పథకాన్ని ప్రకటించారు. రైతులకు పెట్టుబడి వ్యయం అందించడం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం కల్పించడం, వృద్ధాప్యం, అంగవైకల్యం గల రైతులకు ఆర్థిక సాయం అందించడం ఈ పథకం లక్ష్యం. రుణమాఫీ కన్నా ఇది మేలైన పథకమని పట్నాయక్ చెబుతున్నారు. రాష్ట్రంలోని 32 లక్షల మంది రైతుల్లో 20 లక్షల మంది మాత్రమే రుణాలు తీసుకున్నారని, అందువల్ల రుణమాఫీ వల్ల ప్రయోజనం పరిమితమేనని ఆయన భావిస్తున్నారు. కొత్త పథకం సుమారు 30 లక్షల మంది రైతులు లబ్దిపొందనున్నారు. ఈ పథకం తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు నవీన్ పట్నాయక్….!!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News