నవీన్ కు ఇది న్యాయమేనా?

Update: 2018-06-25 16:30 GMT

ప్రత్యేక హోదా....అయిదారు నెలల క్రితం వరకూ ఈ డిమాండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొంతమంది మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులకు తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నోట మాటగా ఈ హామీ ఇచ్చినప్పుడు కూడా దీని గురించి ఎవరికీ అవగాహన లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఏపీ లోని అధికార తెలుగుదేశం పార్టీ ఈ డిమాండ్ తోనే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం, బీజేపీతో పొత్తకు తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి దీనిపై చర్చపచర్చలు నడుస్తున్నాయి. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒక్క బీజేపీ తప్ప ఏపీలోని అన్ని పార్టీలూ ఈ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందని పోటీలు పడి ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు దీనిని కాదనలేక, అవునన లేక కిందామీదా పడుతున్నారు. మొత్తానికి ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ పెద్ద హాట్ టాపిక్ లా మారింది.

అందరి నినాదమూ అదే....

ఏపీ సంగతిని కాసేపు పక్కన పెడితే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఈ డిమాండ్ ను బలంగా విన్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ పల్లవిని ఆలపిస్తున్నారు. వెనుకబడ్డ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ వాదిస్తున్నారు. ఇక ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశా ఈ డిమాండ్ ను ఎత్తుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. యావత్ దేశంలో బాగా వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాకు ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ నాయకుడు నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరుతున్నారు. నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటంతో నంగినంగిగా మాట్లాడుతున్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేక నీళ్లు నములుతున్నారు. ఒడిశా పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. బీజేపీకి బిజూ జనతాదళ్ కు ఎటువంటి సంబంధం లేదు. ఒకప్పుడు రెండూ మిత్రపక్షాలే అయినప్పటికీ ఇప్పుడు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం క్షీణిస్తుండటంతో బిజూ జనతాదళ్ కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని అది ఢీకొననుంది. ప్రత్యేక హోదా పేరుతో బీజేపీని ఇరుకున పెట్టవచ్చని అది అంచనా వేస్తోంది. రాష్ట్ర కమలనాధులు కేంద్రంపై గట్టిగా వత్తిడితేలేకపోతున్నారని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఈ డిమాండ్ ను బలంగా విన్పించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారని, భువనేశ్వర్ లోని రైల్వే జోన్ ను విశాఖకు మార్చాలన్న డిమాండ్ తో తమకు అన్యాయం చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు.

ఒడిశా వాదనలో.....

రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఒడిశా వాదనలో ఒకింత వాస్తవం లేకపోలేదు. తూర్పు రాష్ట్రమైన ఒడిశా వెనుకబడిన రాష్ట్రమని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీ అయిన బిజూ జనతాదళ్ పాలనలో కూడా పెద్దగా అభివృద్ధి చెందింది లేదు. బిజూ పట్నాయక్, ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హయాంలో రాష్ట్ర పరిస్థితి ‘‘ఎక్కడ వేసిన గొంగళి’’ మాదిరిగానే ఉంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికం. విస్తృతమైన తీరప్రాంతం ఉండటంతో దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రకృతి విలయాలు ఇక్కడే జరుగుతున్నాయి. కరువు కాటకాలు కూడా ఎక్కువే. కలహండి, బొలాంగేర్, కోరాపుట్ (కేబీకే) ప్రాంతాలు కరువుకు మారుపేరు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కరువు రూపుమాపేందుకు కెబీకే పేరుతో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు.అయినప్పటికీ ఈ ప్రాంత పరిస్థితి మారలేదు. ఒక్క కలహండి-బొలాంగిర్-కోరాపుట్ ల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుకోవడం తప్పేమీ లేదు. ఇది న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ ఇప్పుడికిప్పుడు వచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఉంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా నలుగుతోంది. 1979లో కేంద్రంలో, రాష్ట్రంలో జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. అప్పటి జనతా పార్టీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ తొలిసారి ప్రత్యేకక హోదా డిమాండ్ ను విన్పించారు. ఒక్క కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలూ ఇందుకు తమ మద్దతును ప్రకటించాయి. అనంతర కాలంలో కాంగ్రెస్ కూడా తన వైఖరిని మార్చుకుంది. హోదాకు మద్దతు ప్రకటించింది. తర్వాత క్రమంగా ఈ అంశం మరుగునపడి పోయింది. ఏపీ డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. నేరుగా అధికార పార్టీ గళాన్ని విన్పిస్తుండటంతో విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు మారు మాట్లాడలేక పోతున్నాయి. వచ్చేది ఎన్నికల ఏడాది కాబట్టి ఆ పార్టీలూ తలూపక తప్పడం లేదు.

పరిశ్రమలు లేవు...ఉపాధి లేదు....

ఎంతోమంది ఒరియా ప్రజలు ఇటు విశాఖపట్నం, అటు కోల్ కత్తా కు పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళుతుంటారు. నిరక్ష్యరాస్యులు కూలీనాలీ కోసం, విద్యావంతులు ఉద్యోగాల కోసం నిత్యం రాష్ట్రం నుంచి వెళ్లడం సర్వసాధారణం. రూర్కెలా ఉక్కు కర్మాగారం వంటి ఒకటి రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఇక్కడ లేవు. పూరీ, కోణార్క్ వంటి నగరాలు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనవి. కటక్, భువనేశ్వర్ వంటి నగరాలు తప్ప చెప్పుకోదగ్గ ప్రాంతాలు లేవు. 1979లో జనాతా సీఎం నీలమణి రౌత్రాయ్ తొలుత గళమెత్తినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు జేబీ పట్నాయక్ (కాంగ్రెస్), రబీరే (జనతాదళ్), బిజూ పట్నాయక్ (బీజేడీ), గిరిధర్ గమాంగ్ (కాంగ్రెస్) లు పెద్దగా పట్టించుకోలేదు. ఏది ఏమైనప్పటికీ, ఇందులో రాజకీయం ఉన్నప్పటకీ ఒడిశా వాదనలో న్యాయం ఉంది. అది సహేతుకమైన డిమాండ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News