ఎవరికీ అర్థంకాడేమిటబ్బా…!!

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరికంటే భిన్నంగా కన్పిస్తారు. ఎవరితో పొత్తు పెట్టుకోరు. అలాగని అందరితో విభేదించరు. వరుస విజయాలతో నవీన్ పట్నాయక్ దూసుకుపోతున్నారు. వెనుకబడిన రాష్ట్రం, [more]

Update: 2019-08-02 16:30 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అందరికంటే భిన్నంగా కన్పిస్తారు. ఎవరితో పొత్తు పెట్టుకోరు. అలాగని అందరితో విభేదించరు. వరుస విజయాలతో నవీన్ పట్నాయక్ దూసుకుపోతున్నారు. వెనుకబడిన రాష్ట్రం, నిత్యం తుపానులతో అల్లాడే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపచేస్తున్నారు. అయితే ఆయన వైఖరి ఎవరికీ అంతుపట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బిజూ జనతాదళ్ కు భారతీయ జనతా పార్టీ ప్రధాన పోటీ ఇచ్చింది.

ప్రధాన శత్రువైనా…..

నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ నవీన్ పట్నాయక్ కు ప్రధాన శత్రువుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బీజేపీ వచ్చి చేరింది. లోక్ సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాల్లో బిజూ జనతాదళ్ తర్వాత భారతీయ జనతా పార్టీయే ముందంజలో ఉండటం విశేషం. కాంగ్రెస్ దాదాపుగా తన ప్రాభవాన్ని ఒడిశాలో కోల్పోయిందనే చెప్పాలి. ఎప్పటికైనా ఒడిశాలో కమలం పార్టీ నవీన్ పట్నాయక్ ను ఓడించే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.

సత్సంబంధాలను కొనసాగించాలని….

కానీ నవీన్ పట్నాయక్ మాత్రం బీజేపీతో సత్సంబంధాలను పెంపొందించుకుంటున్నట్లే కనపడుతోంది. తొలి నుంచి నవీన్ పట్నాయక్ వైఖరి అలాగే ఉంటూ వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఆయన కయ్యానికి దిగరు. ఒడిశా వంటి రాష్ట్రాన్ని నిత్యం తుపానులు వెంటాడుతుంటాయి. తీవ్ర నష్టం జరగుతూనే ఉంటుంది. అందుకే ఆయన కేంద్రంతో సఖ్యతగా ఉంటే నిధులు వస్తాయని ఆశపడుతుంటారంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు మాత్రం కమలం పార్టీకి దగ్గరవుతున్నట్లే కన్పిస్తున్నారు.

కీలక బిల్లుల విషయంలో….

ఇటీవల రాజ్యసభలో జరిగిన సమాచార హక్కు చట్టం బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అధికార పార్టీకి నవీన్ పట్నాయక్ అండగా నిలబడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీకి నవీన్ పట్నాయక్ దగ్గరవుతున్నారా? అన్నది కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ కుదేలవ్వడం, కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ ఎవరికి వారే అన్న రీతిలో ఉండటంతో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శ్రేయస్సు కోసం బీజేపీతో సఖ్యత కొనసాగిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద నవీన్ పట్నాయక్ మాత్రం రాజకీయాల్లో ఎవరికీ అర్థం కాని వ్యక్తి అని చెప్పుకోవాలి.

Tags:    

Similar News