నవీన్ కీ రెండు నాలుకలేనా?

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆలోచన తీరే వేరుగా ఉంటుంది. ఆయన కేంద్ర ప్రభుత్వం తో అంత తొందరగా కయ్యానికి దిగరు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో [more]

Update: 2019-12-20 17:30 GMT

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆలోచన తీరే వేరుగా ఉంటుంది. ఆయన కేంద్ర ప్రభుత్వం తో అంత తొందరగా కయ్యానికి దిగరు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో తెప్పించుకోవడంలో నవీన్ పట్నాయక్ ది అందె వేసిన చేయి. నిత్యం తుఫానులతో అల్లాడిపోయే ఒడిశాకు కేంద్ర సాయం ఎప్పుడూ అవసరం ఉంటుంది. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సఖ్యతగానే ఉంటారు. అలాగని రాసుకుని పూసుకుని తిరగరు.

పౌరసత్వ చట్ట సవరణలో…..

ఇక తాజాగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయంలో బిజూజనతాదళ్ మద్దతిచ్చింది. లౌకిక వాదిగా, ఇరవై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ దీనిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒడిశా నుంచే మాత్రమే కాకండా దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు కూడా నవీన్ పట్నాయక్ తీసుకున్న స్టాండ్ ను తప్పుపట్టాయి. నవీన్ పట్నాయక్ అవకాశవాది అని విమర్శించాయి. ఆయన భయస్థుడని, బీజేపీకి భయపడే పౌరసత్వ బిల్లుకు మద్దతిచ్చారన్న తీవ్ర స్థాయి విమర్శలు కూడా విన్పించాయి.

ఎన్సార్సీని మాత్రం…..

అయితే అన్నింటికీ ఆయన సమాధానం చిరునవ్వు ఒక్కటే. అయితే ఆయన పౌరసత్వ బిల్లుకు మద్దతిచ్చినప్పటికీ ఎన్ఆర్సీ అమలను మాత్రం తన రాష్ట్రంలో చేయడానికి వీలులేదంటున్నారు. ఎన్ఆర్సీ అమలు విషయంలో మాత్రం ఒడిశా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని ఇప్పటికే నవీన్ పట్నాయక్ ప్రకటించారు. తనపై జాతీయంగా వస్తున్న విమర్శల ధాటిని కొంత తగ్గించడానికే ఈ ప్రకటన చేసి ఉండవచ్చన్నది అందరికీ తెలిసిందే.

నితీష్ తరహాలోనే…..

కానీ ఒడిశాలోని విపక్షాలు మాత్రం నవీన్ పట్నాయక్ ను వదిలిపెట్టడం లేదు. నవీన్ లౌకిక వాది ముసుగులో బీజేపీకి మిత్రుడిగా కొనసాగుతున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో చేస్తున్నాయి. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ అయితే నవీన్ పట్నాయక్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తుననారని, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. బీహార్ లోనూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును సమర్థించి, ఎన్సార్సీని మాత్రం వ్యతిరేకించారు. బహుశ నవీన్ పట్నాయక్ కూడా నితీష్ తరహాలోనే పయనిస్తున్నట్లుంది.

Tags:    

Similar News