అసలు కారణం అదేనా?

ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ ప్రాంతంలో అతి పెద్ద రాష్ట్రమైన అసోం గత కొంతకాలంగా అట్టుడుకుతోంది. భద్రతా బలగాల పహారాలో బిక్కుబిక్కుమంటోంది. ఇక్కడ భారతీయులు ఎవరో? విదేశీయులు [more]

Update: 2019-09-05 16:30 GMT

ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ ప్రాంతంలో అతి పెద్ద రాష్ట్రమైన అసోం గత కొంతకాలంగా అట్టుడుకుతోంది. భద్రతా బలగాల పహారాలో బిక్కుబిక్కుమంటోంది. ఇక్కడ భారతీయులు ఎవరో? విదేశీయులు ఎవరో? అన్న గందరగోళం నెలకొంది. దీనంతటికీ కారణం ఎన్ఆర్సీ (national register of citizens) జాతీయ పౌర పట్టిక. దాదాపుగా పదేళ్లుగా ఎన్ఆర్సీ అంశం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ఆగస్టు 31న ఎన్ఆర్సీని విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్సీ లో పేర్ల నమోదుకు 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 3,11,21,004 మంది పేర్లు గత నెలాఖరున విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి. 19,06,657 మంది పేర్లు జాబితాలో లేవు. దీంతో వీరు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాము భారతీయులమా? విదేశీయులమా? అనన గందరగోళంలో ఉన్నారు. వీరి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికి విశ్వసించే పరిస్థితి లేదు. వీరు భారతీయులమని నిరూపించుకునేందుకు 120 రోజుల్లో ట్రైబ్యునల్ లో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ట్రైబ్యునళ్లను 400 వరకూ ఏర్పాటు చేశారు. ఇక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చినా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అయినపప్టికీ ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేని వారు ఆందోళనలోనే ఉన్నారు.

పెద్ద చరిత్ర ఉన్న ఎన్ఆర్సీ…..

ఎన్ఆర్సీకి పెద్ద చరిత్ర ఉంది. ఇది ఈనాటిది కాదు. అసోం భౌగోళికంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపు 41,60 కిలోమీటర్ల భారీ సరిహద్దు ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద సరిహద్దుల్లో ఇది ఒకటి. బంగ్లాదేశ్ కు భారత్ లోని పశ్చిమ బెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో సరిహద్దు ఉన్నప్పటికీ అసోంతో ఉన్న సరిహద్దు అతి పెద్దది. అత్యం కీలకమైనది కూడా. పేద దేశమైన బంగ్లాదేశ్ నుంచి నిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలోకి వలస వస్తుంటారు. ఇలా వచ్చే వారిలో ముస్లింలు ఎక్కువ మంది. హిందువులు కూడా వస్తున్నప్పటికి వారి సంఖ్య తక్కుత. అసోంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో గల సారవంతమైన భూముల్లో చాలా మంది వలస వచ్చిన వారు కూలీ పనులు చేసుకుని పొట్టపోసుకుంటారు. అయితే చివరకి వీరి సంఖ్యే అధికంగా ఉందని, తామే మైనారిటీలమయ్యామని స్థానికుల ఆవేదన. ఇది కాలక్రమంలో ఉద్యమాలకు దారితీసింది. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 80,90వ దశకంలో విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలల్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి ఆధిపత్యం పెరిగింది. వీరు అన్నీ చట్టబద్ధమైన ధ్రువపత్రాలు (రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు) తీసుకుని స్థానికంగా చలామణి అవుతున్నారు. వీరికి ఆలిండియా యూనియన్ ఆఫ్ డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతుగా నిలబడింది.

కాంగ్రెస్ కూడా…..

వాస్తవానికి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కూడా చూసీ చూడనట్లు వ్యవహరించింది. దీనిని బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉండటంతో విదేశీయుల ఏరివేతకు నడుం కట్టింది. దీనికి సుప్రీంకోర్టుకూడా మద్దతుగా నిలిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ అసోం వారే. దీంతో ఆయన ఆధ్వర్యంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. మొత్తం ఎన్ఆర్సీ వ్యవహారాన్ని సీనియర్ అధికారి ప్రతీక్ హజాలే పర్యవేక్షిస్తున్నారు.

రాజకీయ కారణమూ…

ఎన్ఆర్సీ వెనక బీజేపీ రాజకీయం లేకపోలేదు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిలో అత్యధికులు ముస్లింలే. వీరు మొదటి నుంచి కాంగ్రెస్, ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు మద్దతుగా ఉన్నారు. వారిని ఎన్ఆర్సీ పేరుతో బంగ్లాకు వెనక్కు పంపడం ద్వారా స్థానిక హిందువుల ఓటు బ్యాంకును కైవసం చేసుకోవచ్చన్న వ్యూహం. ఈ వ్యూహంతోనే 2016లో రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని సాధించింది. పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో వేగంగా పావులు కదిపిింది. ఇక స్వదేశీయులెవరో? విదేశీయులు ఎవరో గుర్తించేందుకు రూపొందించిన నిబంధనలు లోప భూయిష్టంగా ఉన్నాయన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి.

వారిని నియంత్రించేందుకు…..

ప్రస్తుత బంగ్లాదేశ్ (ఒకప్పటి పాకిస్థాన్ లో భాగం) నుంచి వచ్చే వారిని నియంత్రించేందుకే 1950లోనే కేంద్రం ఎన్ఆర్సీ ని ప్రారంభించింది. 1951 నాటికి ఎన్ఆర్సీ లో పేరున్న వారిని, 1971 మార్చి 24కు ముందు ఓటరు జాబితాలో పేరు నమోదయిన వారిని ప్రామాణికంగా తీసుకున్నారు. వారితో పాటు అదే ఇంటి పేరున్న వారిని భారతీయులిగా గుర్తించాలని నిర్ణయించారు. వీరు జనన ధ్రువీకరణ, శరణార్ధుల ధ్రువీకరణ, పౌరసత్వం, భూ రికార్డులు, శాశ్వత చిరునామా, పాస్ పోర్ట్, లైసెన్స్, ఎల్ఐసీ పాలసీ, బ్యాంక్ పాస్ బుక్ వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేనట్లయితే విదేశీయులుగా పరిగణిస్తారు. ఇలాంటి వారు 19 లక్షలకు మంది పైగా ఉన్నట్లు తాజాగా గుర్తించారు. చట్టప్రకారం వీరిని బంగ్లాదేశ్ కు పంపాలి. లేనట్లయితే మనదేశంలోని ప్రత్యేక శిబిరాలకు తరలించాలి. ప్రస్తుతానికి అలాంటివి ఏమీ లేవు. అసలు ఎన్ఆర్సీ జాబితా తయారీ తప్పుల తడక అనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇది లోప భూయిష్టంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News