చేజేతులా సర్వనాశనం చేసుకుంటున్నారా?

జాతీయ పార్టీ కాంగ్రెస్ కు వరస దెబ్బలు తగులుతున్నాయి. దీనికి స్వయంకృతాపరాధమే కారణంగా చెప్పుకోవాలి. తమ చేతకానితనంతో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి [more]

Update: 2021-03-05 17:30 GMT

జాతీయ పార్టీ కాంగ్రెస్ కు వరస దెబ్బలు తగులుతున్నాయి. దీనికి స్వయంకృతాపరాధమే కారణంగా చెప్పుకోవాలి. తమ చేతకానితనంతో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. వరసగా లోక్ సభ ఎన్నికల్లో రెండుసార్లు ఘోర ఓటమి చవిచూడటానికి కూడా కాంగ్రెస్ ఈ దుస్థితికి రావడానికి కారణంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ కు ఎవరో శత్రువులు లేరు. కాంగ్రెస్ పార్టీలోనే శత్రువులు అధికంగా ఉన్నారు.

గోవాలో చేతికి వచ్చిన…..

నాలుగేళ్ల క్రితం గోవాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యథిక స్థానాలను చేజిక్కించుకుంది. అయినా చేతకానితనంతో ఆ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించారు. సరైన సమయంలో స్పందించలేదన్న కారణంగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించడం మినహా కాంగ్రెస్ తీసుకున్న చర్యలేవీ లేవు. కనీసం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం, కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయకపోవడం వల్లనే ఈ సమస్య అక్కడ తలెత్తింది.

కర్ణాటకానికి కారణం….

తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. బీజేపీకి ఎక్కువ స్థానాలను వచ్చిన జేడీఎస్ తో కలసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మంచి వ్యూహాన్నే రచించింది. బీజేపీని అధికారంలోకి రాకుండా సమర్థంగా ఎదుర్కొనగలిగింది. అయితే ఆ ఆనందం పథ్నాలుగు నెలలకే పరిమితం అయింది. కాంగ్రెస్ లో అనైైక్యత, అసంతృప్తి కారణంగానే ప్రభుత్వం కుప్పకూలిపోయిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతోనే బీజేపీకి అధికారంలోకి రాగలిగింది.

మధ్యప్రదేశ్.. పుదుచ్చేరిలలో…..

మధ్యప్రదేశ్ లో మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి చెక్ పెట్టి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. కానీ కాంగ్రెెస్ నేతల కలహాల కారణంగానే జ్యోతిరాదిత్యసింధియా తన వర్గంతో బీజేపీలో చేరిపోవడంతో అక్కడా కుదురుగా ఉన్న ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తాజాగా ఇక పుదుచ్చేరిలోనూ అంతే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారణంగానే ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ సొంతంగా పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రలో అధికార కూటమిలో ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ కు శత్రువులు ఎక్కడో లేరు. ఆ పార్టీ కి నాయకులే శత్రువులు.

Tags:    

Similar News