జగన్ కు అదే మేలు చేస్తుందా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తనవద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అత్యంతక కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికలను గతంలో [more]

Update: 2019-03-28 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తనవద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అత్యంతక కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికలను గతంలో ఎన్నడూ లేనంత సీరియస్ గా చంద్రబాబు తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉందని జాతీయ సర్వే సంస్థలు సైతం చెప్పడం, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసిన చంద్రబాబు మూడు నెలలుగా ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ కార్యక్రమాలను అమలు చేశారు. డ్వాక్రా మహిళలను, రైతులను, వృద్ధులను ఆకట్టుకోవడం ద్వారా ప్రభుత్వంపై సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేశారు.

ఓ వైపు పథకాలు… మరోవైపు వ్యతిరేక ప్రచారం

ఓ వైపు కొత్త పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే వైఎస్ జగన్ పై వ్యతిరేకత తేవడానికి వీలైనంతా ప్రయత్నిస్తున్నారు. ఏ అవకావాన్ని వదులుకోకుండా మోడీ, జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్, మోడీపై ఉన్న వ్యతిరేకతను జగన్ పైకి మళ్లించడం ద్వారా మేలు కలుగుతుందనే ఆలోచన చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య జగనే చేయించాడనే మరో ఆరోపణతో జగన్ అధికారంలోకి వస్తే ప్రజలకు రక్షణ ఉండదని ఒక భయం కలిగిస్తున్నారు. ఇన్నీ చేస్తున్న ఆయన ఇప్పుడు జాతీయ నేతలనూ రాష్ట్రానికి రప్పిస్తున్నారు. తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించి యూపీఏలో, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలను రాష్ట్రంలో తన తరపున ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ముస్లింలు అధికంగా ఉండే కడప, కర్నూలు జిల్లాల్లో ప్రచారం చేయించారు.

సమీకరణాలను బట్టి ప్రచారం

ఇక, మరికొందరు నేతలను సైతం రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో విజయవాడ, విశాఖపట్నంలో ప్రచారం చేయించాలనుకుంటున్నారు. నిజాయితీగా పాలిస్తున్నారన్న పేరున్న కేజ్రీవాల్ తో ఈ రెండు నగరాల్లో ప్రచారం చేయిస్తే మేలు జరుగుతుందనుకుంటున్నారు. ఇక, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ లతో ప్రచారం చేయించి యాదవులు ఓట్లను ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే, అఖిలేష్ యూపీలో ఎస్పీ బాధ్యతలు, తేజస్వీ బిహార్ లో ఆర్ఎల్డీ బాధ్యతలను చూసుకుంటున్నారు. వారు వారి రాష్ట్రాల్లో ఎన్నికలను వదులుకొని ఏపీలో ప్రచారం చేయడం కష్టమే అంటున్నారు. ఇక, మమతా బెనర్జీని సైతం తీసుకువచ్చి విశాఖపట్నంలో ప్రచారం చేయించాలనుకుంటున్నారు. అయితే, ఆమెకు కూడా బెంగాల్ లో బీజేపీ, కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తున్నారు. సిట్టింగుల్లో చాలామందికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తులు ఉన్నాయి. ఇవన్నీ వదులుకొని ఏపీకి ప్రచారానికి వస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక నుంచి దేవగౌడ ప్రచారానికి వస్తానని ప్రకటించారు.

వైసీపీ కౌంటర్ ప్రచారం చేస్తే..?

జాతీయ నేతలను తీసుకువచ్చి ప్రచారం చేయించడం ద్వారా ఆయా కులాలు, మతాల వారి ఓట్లను ఆకర్షించడం చంద్రబాబు మొదటి వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, తనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను మరోసారి ప్రజలకు గుర్తు చేసి తానైతేనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలననే ఒక భావన ప్రజల్లో కల్పించాలనేది రెండో వ్యూహంలా ఉంది. అయితే, ఇది బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చంద్రబాబుకు అనుకూలంగా జాతీయ నేతలంతా ప్రచారానికి వస్తే ఒక్క జగన్ ను ఎదుర్కోవడానికి ఇంత మంది వస్తున్నారు అని వైసీపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇది గనుక ప్రజల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీకి మొదటికే మోసం వస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News