ఎవరికోసం దిగి వస్తారు…??

ప్రధాని నరేంద్రమోడీ వంటి మొండి రాజకీయవేత్త ఉండరనుకుంటారు. పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోయినా 130 కోట్ల మంది ప్రజలను ఒకే ఒక నోట్ల రద్దు నిర్ణయంతో [more]

Update: 2018-12-29 15:30 GMT

ప్రధాని నరేంద్రమోడీ వంటి మొండి రాజకీయవేత్త ఉండరనుకుంటారు. పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకపోయినా 130 కోట్ల మంది ప్రజలను ఒకే ఒక నోట్ల రద్దు నిర్ణయంతో నెలలతరబడి రోడ్డుపై నిలబెట్టారు. పాకిస్తాన్ తో యుద్ధానికి దారితీస్తుందనే వెరపు లేకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు. సుప్రీం కోర్టుతో, ఆర్బీఐతో, కాగ్ తో రాజ్యాంగ బద్దమైన పెద్ద వ్యవస్థలన్నిటితోనూ పేచీలు పెట్టుకున్నారు. సీబీఐను చిన్నబుచ్చారు. ప్రత్యర్థి పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు పీఎం పేరు చెబితేనే హడలెత్తిపోయేలా అదుపాజ్ణల్లో పెట్టుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల అమలు కోసం అవసరమైతే ఆత్మత్యాగానికైనా సిద్దం కావాలనేది ఆయన సిద్ధాంతం. కానీ పరిస్థితులు ఆయనకు సహకరించడం లేదు. తాను పెట్టుకున్న నియమాలను తానే అధిగమించాల్సి వస్తోంది. ప్రజాకర్షక బాట పట్టకతప్పడం లేదు. గతంలో చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తమా? అన్నట్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను తలకెత్తుకోవాల్సి వస్తోంది. ఓటరు దేవుళ్లు కరుణిస్తారో? లేదో? తెలియదు. ప్రధాని మాత్రం వివిధ రాష్ట్రాల్లోని రైతు సంక్షేమ పథకాల అధ్యయనంపై దృష్టి పెట్టారు.

రాజకీయ ఒత్తిడి…

భారతీయ జనతాపార్టీ రగులుతున్న నిప్పులకుంపటిగా కనిపిస్తోంది. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలుస్తున్న అనేక వర్గాలు పార్టీకి దూరమయ్యాయి. పార్టీ పట్ల 2014లో నూతనంగా ఆకర్షితులైనవారు మళ్లీ దూరమై పోయారు. నాయకత్వం దిశానిర్దేశం కోల్పోతోంది. ఆర్ఎస్ఎస్ , విశ్వహిందూ పరిషత్ వంటి మాతృసంస్థలు సైతం బీజేపీ నాయకత్వం పట్ల గుర్రుగా ఉన్నాయి. తమ మూల సిద్ధాంతాలు, డిమాండ్లను పట్టించుకోని కేంద్రప్రభుత్వానికి తామెందుకు మద్దతు ఇవ్వాలనేది ఆయా సంస్థల ప్రధాన ప్రశ్న. హిందూమతానికి తగిన ఆదరణ ఉండాలనేది ఆర్ఎస్ఎస్ మౌలిక విధానం. మైనారిటీలను అణగదొక్కాలని ఆ సంస్థ భావించదు. అదే సమయంలో మతమార్పిడులను వ్యతిరేకిస్తుంది. కాంగ్రెసు పార్టీ సైతం క్రమేపీ సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ లోకి వచ్చేస్తోంది. మెజార్టీ హిందువులకు వ్యతిరేకంగా వెళ్లడం దుస్సాహసమని ఆ పార్టీ గుర్తించింది. రాహుల్ గాంధీ స్వయంగా తాను హిందువునని ప్రకటించుకుంటూ గుడులు , గోపురాలు తిరుగుతున్నారు. ఈపరిస్థితుల్లో బీజేపీకి మాత్రమే తామెందుకు మద్దతు ఇవ్వాలి? దానివల్ల కలిసి వచ్చే అదనపు ప్రయోజనాలేమిటని విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజకీయపార్టీగా బీజేపీకి, సంఘ్ పరివార్ సంస్థలకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి.

పార్టీ అసమ్మతి…

అయోధ్యలో రామమందిర నిర్మాణం సంగతేమిటని ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీకి చెందిన ఎంపీలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తాము నియోజకవర్గాల్లో స్పష్టమైన హామీని ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని ఎంపీలు చెబుతున్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ డిమాండును వినియోగించుకున్నామని ఎమ్మెల్యేలు కూడా పేర్కొంటున్నారు. బిహార్ ఎంపీలూ రామమందిర నిర్మాణాన్ని కోరుతున్నారు. ఇక్కడ అధికారంలో భాగస్వామిగా ఉన్న జేడీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్రలో శివసేన బీజేపీతో దాదాపు రాజకీయ యుద్ధమే చేస్తోంది. రామాలయ నిర్మాణమే ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమని ఎంపీలలో మెజార్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుని రామాలయం కడుతున్నట్లుగా కనిపిస్తే తప్ప 2019 ఎన్నికలకు జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్లలేమంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టినప్పుడు తాము ఎక్కువగా ఆశించామని , కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఏమాత్రం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో సైతం మతపరమైన భావనలు ఎక్కువ. అక్కడి నుంచికూడా నిరసన స్వరాలు వినవస్తున్నాయి.

పాతపై పగ.. కొత్తకు పొగ…

వ్యాపార వర్గాలు బీజేపీకి అండగా ఉంటూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులు ఆర్థికంగా సంపన్న వర్గాలు కావడంతో ఓటర్ల బేస్ తక్కువగా ఉన్నప్పటికీ వ్యవస్థాపన నుంచి బీజేపీ కి నిధుల కొరత పెద్దగా లేదు. వనరులు సులభంగానే సమకూర్చుకునేది. నోట్ల రద్దు, జీఎస్ టీ అమలు తర్వాత దేశంలో వ్యాపార వర్గాలు చాలా ఇక్కట్లను ఎదుర్కొన్నాయి. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందని పార్టీ నాయకులు భయపడుతున్నారు. మూడు నాలుగు దశాబ్దాలుగా పార్టీని భుజాన మోసిన ప్రధాన వర్గం దూరమైంది. 2014లో మోడీ కరిష్మాతో యువత, మధ్యతరగతి ప్రజలు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. నూతన ఉద్యోగాల కల్పన లేకపోవడం, పారిశ్రామిక విప్లవం తెస్తారనుకుంటే అది ఆదిలోనే అటకెక్కడంతో యువత దూరమైపోయారు. మధ్యతరగతి ప్రజలు సైతం నూతన విధానాలతో ఇక్కట్లను ఎదుర్కొన్నారు. డిజటలైజేషన్, నోట్లరద్దు వంటివి ఈ వర్గం ప్రజలకు సైతం రుచించని పరిణామంగా మారింది. అందులోనూ మిడిల్ క్లాసు ప్రజలను ఒపీనియన్ మేకర్లుగా చెప్పుకోవాలి. యువతతో కలిసి మిడిల్ క్లాసు ప్రజలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇందులో 60 శాతం ఒపీనియన్లు మోడీ పాలనకు వ్యతిరేకంగా వస్తున్నాయనేది బీజేపీ సోషల్ వింగ్ అంచనా.

జై కిసాన్ తో…జయం?

రాయితీలు, రుణమాఫీల వంటివాటికి మోడీ వ్యక్తిగతంగా వ్యతిరేకం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనేది ఆయన బలమైన నమ్మకం. కానీ దేశవ్యాప్తంగా రైతు రాజకీయాలు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు రుణమాఫీ సహా వివిధ రకాల సంక్షేమ పథకాలతో రైతుపై వల వేస్తున్నాయి. ప్రస్తుతమున్న స్థితిలో 2019లో అధికారం నిలబెట్టుకోవాలంటే అన్నదాతకు ఆసరా ఇవ్వాల్సిందేనని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. కానీ నిధుల సమస్య వెన్నాడుతోంది. రిజర్వు బ్యాంకు వద్ద మిగులు నిధుల్లో 3 లక్షల కోట్లరూపాయల మేరకు రాబట్టుకోవాలని కేంద్రం యోచిస్తోంది. దాదాపు 50వేల కోట్లరూపాయల మేరకు సమీకరిస్తే ఏడాదికాలంగా దేశంలో వివిధ పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం అందచేయవచ్చు. లక్ష పాతికవేల కోట్లరూపాయల ను వెచ్చించగలిగితే ఎకరాకు 2500 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతుబంధును అమలు చేయవచ్చు. రుణమాఫీని అమలు చేయాలంటే మాత్రం మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు అవసరమవుతాయి. రుణమాఫీతో పాటు రైతుబంధును కలిపి అమలు చేయగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ప్రచారం చేసుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రామాలయ నిర్మాణం వివిధ కారణాలతో సాధ్యం కాని స్థితిలో ప్రత్యామ్నాయం రైతు సంక్షేమమే అని నొక్కి చెబుతున్నారు. ఈమేరకు మోడీ తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News